స్థానిక సంస్థల ఎమ్మెల్సీపై గురి!

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల కావడంతో పాలమూరులో ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి.

Updated : 28 Feb 2024 06:51 IST

రంగంలోకి ప్రధాన పార్టీలు

 

ఈనాడు, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల కావడంతో పాలమూరులో ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి 2028 జవనరి 4 వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. పూర్వ మహబూబ్‌నగర్‌కు 2021 నవంబరులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రెండు స్థానాలకు నోటిఫికేషన్‌ పడింది. అప్పుడూ ఉమ్మడి జిల్లా నుంచి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో భారాస అధికారంలో ఉండటం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా అదే పార్టీకి చెందిన వారు కావడంతో ఇతర పార్టీల అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో ఈ ఉప ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ మార్చి 4న రానుండటంతో ప్రధాన పార్టీలు ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించాయి.

 14 నియోజకవర్గాల పరిధిలో..

స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గం పూర్వ మహబూబ్‌నగర్‌లోని 14 నియోజకవర్గాల పరిధిలో ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, పురపాలిక కౌన్సిలర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులకు ఓటింగ్‌ వేసే అవకాశం ఉంది.  2021 నవంబరులో నోటిఫికేషన్‌ వేసిన సమయంలో మొత్తం 1,445 మంది ఓటర్లు ఉన్నారు. స్థానిక సంస్థల పదవీ కాలం ముగియకపోవడంతో ప్రస్తుతం కూడా ఈ ఓటర్లే ఉన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినప్పుడు పూర్వ మహబూబ్‌నగర్‌లో 1,039 మంది భారాస నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి 241 మంది, భాజపా నుంచి 119 మంది, ఇతరులు 46 మంది గెలుపొందారు. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాలో పలువురు పార్టీలు మారారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హస్తం గూటికి చేరారు. ప్రధాన పార్టీల బలాబలాలు పూర్తిగా మారాయి. ప్రధానంగా కాంగ్రెస్‌, భారాస మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. భాజపా, ఇతరులకు కొన్ని స్థానాలు ఉండటంతో వారి ఓట్లకు ప్రాధాన్యం ఏర్పడనుంది. మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించనున్నారు.  ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో పది పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయడంతో అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. షెడ్యూల్‌ విడుదలతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఎక్కడా కొత్త అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించకూడదు. కొత్త ప్రాజెక్టులను ప్రకటించకూడదు.

అభ్యర్థులపై ఉత్కంఠ..

ఈ ఎన్నికల్లో ప్రధానంగా భారాస, కాంగ్రెస్‌ మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారాసకే అధికంగా ఓట్లు ఉన్నాయి. ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్‌కు క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశాలున్నట్లు ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై దృష్టి పెట్టింది. ఓటర్ల వివరాలను సేకరించి తమకే మద్దతు ఇచ్చేలా తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. అవసరమైతే పెద్ద ఎత్తున తాయిలాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి పారిశ్రామికవేత్త మన్నె జీవన్‌రెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. భారాస నుంచి కూడా పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యేలలో ఒకరికి అవకాశం కల్పిస్తారన్న చర్చ జరుగుతోంది. భాజపాకు ఓటుబ్యాంకు తగినంత లేకపోవడంతో ఆ పార్టీ నుంచి అభ్యర్థిని పోటీలో నిలుపుతారా? ఏదైనా పార్టీకి అంతర్గత మద్దతు ఇస్తారా? తేలాల్చి ఉంది. రాష్ట్రంలో ఓటరు జాబితాలో ఎక్కడ పేరున్నా ఈ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. పోటీ చేసే అభ్యర్థిని ఓటరు జాబితాలో పేరున్న 10 మంది సభ్యులు ప్రతిపాదించాల్సి ఉంటుంది. మార్చి 4 నుంచి నామినేషన్లను స్వీకరించే అవకాశం ఉండటంతో అప్పటిలోగా ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని