తెలంగాణ తిరుపతికి వచ్చేది ఏపీ బస్సులే!

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం రామాలయం తర్వాత ద్వితీయ స్థానంలో ఈ ఆలయం నిలిచింది.

Updated : 01 Mar 2024 09:20 IST

ఎర్రుపాలెం, న్యూస్‌టుడే: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం రామాలయం తర్వాత ద్వితీయ స్థానంలో ఈ ఆలయం నిలిచింది. విభజిత ఖమ్మం జిల్లాలో అతిపెద్ద దేవాలయంగా విరాజిల్లుతోంది. అంతటి మహాత్మ్యమున్న జమలాపురం శ్రీవారి సన్నిధికి చేరడానికి భక్తులకు బస్సులే కరవయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన సర్వీసులే దిక్కయ్యాయి. ఖమ్మం, మధిర డిపోల నుంచి సర్వీసులను పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు.

ఏపీలోని మూడు డిపోల నుంచి బాగు

ఎర్రుపాలెం మీదుగా ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధి ఇబ్రహీంపట్నం, విజయవాడ డిపోలకు చెందిన బస్సులు నడుస్తున్నాయి. ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన రెండు సర్వీసులు జమలాపురం మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఒకటి కంచికచర్ల మీదుగా, మరొకటి జి.కొండూరు మీదుగా నడుస్తుండగా ఓ సర్వీసును రాత్రి జమలాపురంలో నిలుపుతున్నారు. తిరువూరు డిపోకు చెందిన రెండు సర్వీసులు ఎర్రుపాలెం మండలం మీనవోలు, తక్కెళ్లపాడు, సఖినవీడు, ఇనగాలి, మొలుగుమాడు, రామన్నపాలెం మీదుగా నడుస్తున్నాయి. విజయవాడకు చెందిన ఓ సర్వీసు ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు,  భీమవరం మీదుగా జమలాపురం వరకు రాకపోకలు సాగిస్తోంది. రాత్రిపూట భీమవరంలో నిలుపుదల చేస్తున్నారు.

పునరుద్ధరించాలని విన్నపాలు

జమలాపురం నుంచి మధిర మీదుగా భద్రాచలం వరకు ఇటీవల ఓ సర్వీసును ఏర్పాటు చేసి పది రోజులకే ప్రయాణికులు ఉండటం లేదని నిలిపేశారు. ఖమ్మం, మధిర డిపోలకు చెందిన బస్సులను భక్తుల సౌకర్యార్థం విజయవాడ, కంచికచర్ల, జి.కొండూరు, ఎర్రుపాలెం రైల్వేస్టేషన్‌ను కలుపుతూ జమలాపురం, గంపలగూడెం, భీమవరం సర్వీసులు ఉండేలా చూడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మధిర డిపో నుంచి జమలాపురం మీదుగా మైలవరం నుంచి విజయవాడ వరకు సర్వీసులు నడపాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎర్రుపాలెం మండలంలోని గ్రామాలను కలుపుతూ ఎర్రుపాలెం రైల్వేస్టేషన్‌ వరకు ఉదయం, సాయంత్రం వరకు బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతున్నారు. శని, ఆదివారాల్లో ఖమ్మం, మధిర నుంచి ఆర్టీసీ బస్సులు నడపాలని విన్నవిస్తున్నారు.


బస్సుల్లేక శ్రీవారి భక్తుల బాధలు

-నాగులవంచ రామ్మూర్తి, ఎర్రుపాలెం

భక్తులకు బస్సులు లేకపోవటంతో అత్యధికంగా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల భక్తుల సౌకర్యార్థం మధిర, ఖమ్మం డిపోల నుంచి బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం కృష్ణా జిల్లాకు చెందిన సర్వీసులను నడుపుతున్నారు. ఈ అంశంపై తెలంగాణ పాలకులు స్పందించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు