యువికా పిలుస్తోంది..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో రాకెట్లను ఎలా తయారు చేస్తారు? ఆకాశంలోకి ఎలా వెళతాయి? అక్కడి పనితీరు ఏమిటి? అని తెలుసుకోవాలనే కుతూహలం ప్రతిఒక్కరిలో ఉంటుంది.

Updated : 02 Mar 2024 06:50 IST

యువికా ప్రచార చిత్రం

మంచిర్యాల విద్యావిభాగం, కాగజ్‌నగర్‌ -న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో రాకెట్లను ఎలా తయారు చేస్తారు? ఆకాశంలోకి ఎలా వెళతాయి? అక్కడి పనితీరు ఏమిటి? అని తెలుసుకోవాలనే కుతూహలం ప్రతిఒక్కరిలో ఉంటుంది. విద్యార్థుల్లో ఇది మరింత ఎక్కువ. ఇది తెలుసుకోవడానికి వారికో అవకాశం వచ్చింది. విద్యార్థుల ఆలోచనకు కొత్త రూపం ఇస్తే భావితరాలకు శాస్త్రవేత్తలను అందించే అవకాశముందని గుర్తించిన ఇస్రో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాంకేతికత, అంతరిక్ష శాస్త్రం, అనువర్తనాలపై ప్రేరణ, ప్రాథమిక జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా యంగ్‌ సైంటిస్ట్‌ పేరుతో యువ విజ్ఞాన్‌ కార్యక్రమం(యువికా) నిర్వహిస్తోంది. ఇస్రో సందర్శనకు తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఈ మేరకు దరఖాస్తు ఆహ్వానిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

మార్చి 28న తొలిజాబితా

ఆసక్తి ఉన్నవారు www.isro.gov.inవెబ్‌సైట్‌ను సందర్శించి తమ మెయిల్‌ ఐడీతో విద్యార్థుల పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. తర్వాత ఇస్రో నిర్వహించే క్విజ్‌ పోటీల్లో పాల్గొనాలి. అనంతరం సంబంధిత వెబ్‌సైట్‌లో వ్యక్తిగత పూర్తి వివరాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్‌ చేయాలి. ఎనిమిదో తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం, ఆన్‌లైన్‌ క్విజ్‌లో ప్రతిభకు 10 శాతం, పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గడిచిన మూడేళ్లలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొన్నవారికి 10 శాతం, ఒలింపియాడ్‌ సైన్సు పోటీల్లో బహుమతులు పొందిన ప్రతిభావంతులకు 5 శాతం, క్రీడా పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన వారికి 5 శాతం ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, స్కౌట్‌లో సభ్యత్వం ఉన్నవారికి 5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. మార్చి 28న మొదటి జాబితా అనంతరం ఏమైనా ఖాళీలు ఉంటే ఏప్రిల్‌ 4న రెండో విడత ఎంపిక జాబితాను విడుదల చేస్తారు. ఎంపికైన వారు మే 12న ఇస్రో కేంద్రాల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. మే 13 నుంచి 25 వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. విద్యార్థులకు బస్సులు, రైళ్ల ద్వారా ప్రయాణ రాయితీతో పాటు వసతి కల్పించడంతోపాటు భోజన ఖర్చులను ఇస్రో చెల్లిస్తుంది.

రెండు వారాలపాటు శిక్షణ

ఇస్రోకు చెందిన డెహ్రాడూన్‌, తిరువనంతపురం, శ్రీహరికోట, బెంగళూరు, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, షిల్లాంగ్‌ కేంద్రాల్లో ఎంపికైన వారికి శిక్షణ ఉంటుంది. విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు లేదా గైడ్‌ టీచర్‌ ఒకరికి ఇస్రోకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. వారికి కూడా ప్రయాణ భత్యం చెల్లిస్తుంది. రెండు వారాల పాటు ఆయా కేంద్రాల్లో అంతరిక్ష శాస్త్ర అంశాలపై అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో ముఖాముఖి, బృంద చర్చలు నిర్వహిస్తారు. ప్రయోగాత్మక ప్రదర్శన, ప్రయోగశాలల సందర్శనకు అవకాశం ఇస్తారు. భవిష్యత్తులో ప్రయోగ అంశాల రూపకల్పనలో ప్రావీణ్యంతో పాటు శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఇది దోహదపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని