భద్రత.. వైద్యావసరాలకు డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానం

భద్రత.. రక్షణ రంగాలు.. ప్రైవేటు సంస్థలు వినియోగిస్తున్న డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని మన రోజువారీ అవసరాలకు పనికొచ్చేలా చేసేందుకు జేఎన్‌టీయూ, ఐసీఎంఆర్‌ ఆచార్యులు, పరిశోధకులు దృష్టి కేంద్రీకరించారు.

Updated : 02 Mar 2024 06:49 IST

జేఎన్‌టీయూ, ఐసీఎంఆర్‌ పరిశోధనలు

ఈనాడు, హైదరాబాద్‌: భద్రత.. రక్షణ రంగాలు.. ప్రైవేటు సంస్థలు వినియోగిస్తున్న డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని మన రోజువారీ అవసరాలకు పనికొచ్చేలా చేసేందుకు జేఎన్‌టీయూ, ఐసీఎంఆర్‌ ఆచార్యులు, పరిశోధకులు దృష్టి కేంద్రీకరించారు. వందల కిలోమీటర్లు ప్రయాణించేలా  అభివృద్ధి చేస్తున్నారు. ప్రాణాధార మందులను డ్రోన్‌ద్వారా మారుమూలలకు పంపుతున్న సాంకేతికతకు మరింత ఆధునికత జోడించనున్నారు. శాంతిభద్రతలకు ఉపయోగపడే డ్రోన్లలో ఉండాల్సిన అంశాలపై ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు.ఇప్పటివరకూ ఇజ్రాయెల్‌లోని ఓ ప్రైవేటు సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని వేర్వేరు దేశాలకు అందిస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో జేఎన్‌టీయూ ఆచార్యులు డ్రోన్లను భద్రతా అవసరాలకు, సీడ్‌బాల్స్‌ ప్రయోగాలకు వినియోగించేలా తయారు చేస్తున్నారు.

బహుళ ప్రయోజనాలు... పరిశోధనలు..:

జేఎన్‌టీయూ ఆచార్యులు వేర్వేరు దేశాల్లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక పరిజ్ఞానంపై సమాచారం సేకరిస్తున్నారు. ఐసీఎంఆర్‌ అధికారులు బీబీనగర్‌ ఎయిమ్స్‌ కేంద్రంగా క్షయవ్యాధిని గుర్తించేందుకు రోగుల నుంచి సేకరించిన శాంపిళ్లను డ్రోన్ల ద్వారా తీసుకొస్తున్నారు. 2నెలల క్రితం ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రారంభించారు. భువనగిరి జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంతోపాటు 3 పీహెచ్‌సీలతో డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించారు.

ట్రాఫిక్‌ నియంత్రణ.. కెమెరాల గస్తీ

రాజధాని, శివారు ప్రాంతాల్లో  బహుళజాతి సంస్థల కార్యకలాపాలు, విదేశీ రాయబార కార్యాలయాలు, ఈ-కామర్స్‌ సంస్థలుండడంతో ఆయా సంస్థల భద్రతకు డ్రోన్‌ కెమెరాల గస్తీని ఏర్పాటు చేయనున్నారు. రాత్రివేళల్లో ఇవి నిఘా వేస్తాయి. ఐటీ కారిడార్‌, ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులను తగ్గించేందుకు వీటిని వినియోగించనున్నారు. బెంగళూరులో   ట్రాఫిక్‌ రద్దీ పరిష్కారానికి వినియోగిస్తున్నారు.  

  • భువనగిరిలో జిల్లాలో రక్త,మూత్ర నమూనాలను పంపించేందుకు, ప్రాణాధార మందులను చేరవేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై ‘డ్రోన్‌ దీదీ’ పేరుతో ఎంపికచేసిన అక్కడి ఆశావర్కర్లకు హైదరాబాద్‌లోని వ్యవసాయ వర్సిటీలో ఐసీఎంఆర్‌ శిక్షణ ఇప్పించింది.
  • క్షయ వ్యాధిగ్రస్తులను వేగంగా గుర్తించేందుకు ఐసీఎంఆర్‌ అధికారులు 2డ్రోన్‌ కెమెరాలు వినియోగిస్తున్నారు. ఒక్కోటి 60-75 కి.మీ. దూరాన్ని చేరుకునేలా సాఫ్ట్‌వేర్‌రూపొందించారు. ముగ్గురు డ్రోన్‌పైలెట్లు వీటిని నిర్వహిస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని