అద్దె కట్టరు.. ఖాళీ చేయరు

జిల్లాలో పాడి రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో కంకిపాడు మార్కెట్‌యార్డులో స్థాపించిన మినీ పాల ప్రాజెక్ట్‌ స్కీకరణకు ‘అమూల్‌’ సంస్థ నిరాకరించింది.

Updated : 03 Mar 2024 06:20 IST

ఆవరణలో పుట్టలు.. కొండల్లా బకాయిలు
స్వీకరణకు ‘అమూల్‌’ తిరస్కారం

కంకిపాడు మార్కెట్‌ యార్డ్‌లో పాడుబడిన మినీ పాల ప్రాజెక్ట్‌

కంకిపాడు, న్యూస్‌టుడే: జిల్లాలో పాడి రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో కంకిపాడు మార్కెట్‌యార్డులో స్థాపించిన మినీ పాల ప్రాజెక్ట్‌ స్కీకరణకు ‘అమూల్‌’ సంస్థ నిరాకరించింది. దీనిని ‘టేక్‌-ఓవర్‌’(స్వాధీనం) చేసుకోవడం లాభసాటిగా ఉండదనే ఉద్దేశంలో సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం తమ నివేదికలో పేర్కొనడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ప్రభుత్వం నిర్వహించలేక, ఇతర సంస్థలు స్వీకరణకు ఆసక్తి చూపక గత ఆరేళ్లుగా నిరుపయోగంగా ఉంది. ఓ వైపు అద్దె బకాయిలు కొండల్లా పేరుకుపోతుండగా, ప్రాజెక్టు లోపల, బయట పాముల పుట్టలు విస్తరిస్తున్నాయి.
పభుత్వరంగ కృష్ణవేణి పాల ఉత్పత్తిదారుల సహకార సంస్థ ఆధ్వర్యంలో రూ.2.5 కోట్లతో 2011 మే నెలలో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌ను నాలుగేళ్ల పాటు విజయవంతంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా 60 మంది, పరోక్షంగా వెయ్యి మంది ఉపాధి పొందారు. నిర్వహణ లోపంలో 2016లో మూత పడింది.
దీనికి అవసరమైన స్థలం, రైతు భరోసా పథకానికి ఉపయోగించే భారీ గిడ్డంగిని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ కృష్ణవేణి సంస్థకు నెలవారీ అద్దె ప్రాదిపదికన లీజుకు ఇచ్చింది. మూత పడినప్పటి నుంచి అద్దె చెల్లించకపోవడం బకాయి రూ.23,62,106కి చేరింది. ప్రస్తుతం నెలసరి అద్దె రూ.41 వేలు చెల్లించాల్సి ఉంది.
తాఖీదులిచ్చినా ఫలితం శూన్యం :  గత నాలుగేళ్ల నుంచి వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సంబంధిత సంస్థకు తరచూ తాఖీదులు జారీ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో 2022లో ‘అమూల్‌’ సంస్థ బృందం ఈ యూనిట్‌ను స్వాధీనం చేసుకోడానికి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసింది. అప్పటికే ప్రాజెక్ట్‌లోని పరికరాలు పనికిరాకుండా పోవడంతోపాటు అద్దె బకాయిలు చెల్లించడం లాభసాటి కాదని స్వాధీనానికి ముందుకురాలేదు. రైతుల అవస్థలు :  అద్దె బకాయిలు చెల్లించకపోగా ఖాళీ చేయకపోవడంతో విశాలమైన ఆర్‌సీసీ గిడ్డంగి రైతులకు అందుబాటులో లేకుండా పోయింది. దాదాపు 30 సెంట్ల స్థలం చిట్టడవిలా తయారైంది. పుట్టల నుంచి పాములు పరిసర నివాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆవరణలోనే ఉన్న ఏఎంసీ కార్యాలయం, ఇతర గిడ్డంగులు, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య పరిశోధనా కేంద్రానికి వచ్చే రైతులు, సిబ్బంది అవస్థల పాలవుతున్నారు. ప్రతి నెలా అద్దె రూ.41 వేలు బకాయిలో చేరుతోంది.
తీర్మానాలు బుట్టదాఖలు : బకాయిల వసూళ్లు, గిడ్డంగి, స్థలం అప్పగింతకు గత ఆరేళ్లుగా ఏఎంసీ పాలకవర్గాలు తరచూ తీర్మానాలు చేసి సంబంధిత ఉన్నతాధికారులకు పంపుతున్నారు. కనీసం వీటికి సమాధానం ఇచ్చేపరిస్థితీ లేదు. రూ.కోట్ల విలువైన వస్తుసామగ్రి, స్థలం, గిడ్డంగి నిరుపయోగంగా మారింది. రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని పాలకవర్గం, రైతులు కోరుతున్నారు.

ప్రారంభోత్సవ శిలాఫలకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు