CM Jagan: జగన్‌ మావయ్యా.. ఇదేం ప్రగతయ్యా..?

నాడు-నేడు అంటూ విద్యా వ్యవస్థలో, మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్నో సమూల మార్పులు తెచ్చామని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. నేటికీ పలు చోట్ల ఆ ప్రగతి  కనిపించడం లేదు.

Updated : 27 Mar 2024 08:38 IST

పెచ్చులూడుతున్న భవనంలోనే జగనన్న గోరుముద్ద..!

న్యూస్‌టుడే - తుని: నాడు-నేడు అంటూ విద్యా వ్యవస్థలో, మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్నో సమూల మార్పులు తెచ్చామని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. నేటికీ పలు చోట్ల ఆ ప్రగతి  కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జగనన్నా... చేసిందేమిటన్నా.. అంటూ ఎస్సీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉదాహరణ ఇది.. 

తుని పట్టణం వీరవరపుపేటలో 4 నుంచి 10 తరగతులు చదువుతున్న 65 మంది బాలికలు ఎస్సీ వసతి గృహంలో ఉన్నారు. ఈ భవనాన్ని 1992 నిర్మించారు. నిర్వహణ లేక పైకప్పు, పిల్లర్లు పూర్తిగా పాడై కూలేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కొంతవరకు ఈ పాత భవనం తొలగించి రూ.50 లక్షలతో కొత్త భవనం నిర్మించాలని ప్రతిపాదించారు. ఆరు నెలల క్రితమే ఈ పనులకు శ్రీకారం చుట్టారు. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా నిధులైతే విడుదల కాలేదు. పిల్లర్ల కోసం ఇనుప ఊచలు వేసి గుత్తేదారు మధ్యలోనే పనులు ఆపేశారు. దీంతో ప్రాంగణంలో పెద్ద గొయ్యి, ఎక్కడ పడితే అక్కడ ఊచలు ప్రమాదకరంగా మారాయి. ఈ వసతి గృహ బాలికలకు పక్కనే ఉన్న పురపాలక ప్రాథమిక పాఠశాల ఆవరణలో తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేశారు.

అక్కడా పూర్తిగా సౌకర్యాలు లేవు. బాలికలు రాత్రి వేళ అక్కడ కేవలం నిద్రకు మాత్రమే వెళుతూ, భోజనాలు, బట్టలు ఉతకడం, కాలకృత్యాలు, చదువు ఇలా.. అన్నింటికీ పాత భవనాన్నే వినియోగించాల్సి వస్తోంది. ఇక్కడ పైకప్పు నుంచి తరచూ పెచ్చులూడి పడుతున్నాయి. పిల్లర్లు కూడా ధ్వంసమయ్యాయి. వసతి గృహ సంక్షేమాధికారిణి కె.సత్యకుమారిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. కొత్తగా చేపట్టిన నిర్మాణాలు పూర్తయ్యే వరకు మరో ప్రాంతంలో అద్దె భవనం తీసుకుంటామని తెలిపారు.

సగం పడగొట్టి గొయ్యి తవ్వి వదిలేసిన వసతి గృహం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని