అవ్వాతాతలతో వైకాపా చెలగాటం

పింఛన్ల పంపిణీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం గందరగోళంగా మార్చింది. కొందరికి ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వాలని.. మిగతా వారందరికీ సచివాలయాల్లో పంపిణీ చేయాలంటూ విధి విధానాలు ఖరారు చేసింది.

Updated : 03 Apr 2024 05:04 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే

పింఛన్ల పంపిణీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం గందరగోళంగా మార్చింది. కొందరికి ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వాలని.. మిగతా వారందరికీ సచివాలయాల్లో పంపిణీ చేయాలంటూ విధి విధానాలు ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లాలో 4.71 లక్షల మంది పింఛనుదారులున్నారు.. పదివేల మందికిపైగా సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.. వీరంతా ఇంటింటికెళ్లి లబ్ధిదారులకు పింఛన్‌ పంపిణీ చేయడానికి పెద్ద ఇబ్బంది ఉండదు.. ఒక్కో సచివాలయ పరిధిలో ఒక్కో ఉద్యోగికి సగటున 47 ఇళ్ల వద్దకు వెళ్లడానికి వీలుంది.. ఒక్కొక్కరు తన పరిధిలో రెండు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయడం పెద్ద కష్టమేమి కాదు.. కానీ ‘అధికారం’తో అంటకాగుతున్న యంత్రాంగం పింఛన్ల పంపిణీ పితలాటకం పెట్టింది. అవసరమైన సిబ్బంది లేరంటూ ఉమ్మడి జిల్లాలో దాదాపు 90 శాతం పింఛన్‌దారులు సచివాలయాలకు వచ్చి సొమ్ము తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

సచివాలయాలకు చేరని సొమ్ము

ఉమ్మడి జిల్లాలో ప్రతి నెలా పింఛన్ల పంపిణీకి 143.69 కోట్లు అవసరం ఉంది. ఇప్పటివరకు పింఛను సొమ్ము జిల్లాకు రాలేదు. బుధవారం మధ్యాహ్నంలోగా పింఛను సొమ్మును సచివాలయ వార్డు అడ్మిన్లు బ్యాంకుల నుంచి తీసుకొచ్చి సచివాలయ ఉద్యోగులకు అందజేస్తారని.. సచివాలయ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, సచివాలయ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు కేటగిరీలవారీగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాల్సి ఉంది. ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేస్తాయని.. అప్పటి వరకు పింఛన్లు ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

నీళ్లు.. నీడ కల్పించాలి మరి

ఉమ్మడి జిల్లాలో 4.10 లక్షల మంది పింఛనుదారులు ఉండగా వారిలో 2.40 లక్షల మంది వృద్ధాప్య పింఛనర్లే ఉన్నారు. వీరందరూ సచివాలయాల వద్దకు వెళ్లి పింఛను తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా సచివాలయాలు ఊరికి దూరంగా.. అద్దె భవనాల్లో ఉన్నాయి. పట్టణాల్లో ఎత్తైన భవనాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఎండలు పెరిగిన నేపథ్యంలో అక్కడ నీడ.. నీళ్ల వసతి కల్పించాల్సినవసరం ఉంది. వృద్ధులు ఎండలకు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో సచివాలయాల వద్ద ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లూ అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు.

కుట్రకు తెరలేపిన వైకాపా

పింఛన్ల పంపిణీ వ్యవహారంలో వైకాపా కుట్రకు తెరలేపింది.. పింఛన్‌ సొమ్మును గుత్తేదారులకు మళ్లించడం.. ఇంటింటికెళ్లి పంపిణీ చేసే అవకాశం ఉండి కూడా సిబ్బంది కొరత అంటూ కొర్రీలు పెట్టిందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వైకాపా అడ్డుకుని ఆ నెపాన్ని తెదేపాపై నెడుతోందని మండిపడుతున్నారు. పింఛనుదారుల్లో విషబీజాలు నాటడమే వైకాపా సర్కారు ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోందని వారు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగానే సామాజిక మాధ్యమాల వేదికగా విషం చిమ్మే ప్రక్రియ మొదలు పెట్టారన్నారు. ఎన్నికల సంఘం పవిత్రతపైనా బురద జల్లుతున్నారన్నారు.


61 వేల మందికే ఇంటి వద్దకు

  • కర్నూలు జిల్లాలో 2,47,546, నంద్యాల జిల్లాలో 2,24,398 మంది పింఛనుదారులున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,188 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. ఇన్నాళ్లు వాటి పరిధిలోని వాలంటీర్లు పంపిణీ చేసేవారు. వారు ‘అధికార’ పార్టీ ప్రచార కార్యకర్తలా మారడంతో ఎన్నికల సంఘం ఆంక్షలు పెట్టింది. వారితో పింఛన్లు పంపిణీ చేయించకూడని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో పంపిణీ చేపట్టాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఇందులోనూ కొర్రీలు విధించింది.
  • విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అస్వస్థతతో బాధపడేవారు, మంచానికే పరిమితమైనవారు, నడవలేక వీల్‌ఛైర్‌లో ఉన్నవారు, సైనిక సంక్షేమ పింఛను పొందుతున్న వృద్ధ మహిళలకు ఇంటి వద్దే పింఛను పంపిణీ చేయాల్సి ఉంది. ఈ కేటగిరీలవారు కర్నూలు జిల్లాలో 33,693 మంది ఉండగా, నంద్యాల జిల్లాలో 27,685 మంది కలిపి మొత్తం 61,378 మంది ఉన్నారు.

వీరిని ఎందుకు దూరం పెట్టారో

  • రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ), యానిమల్‌ హజ్బండరీ అసిస్టెంట్‌ (ఏహెచ్‌ఏ), మత్స్య సహాయకులు, ఆరోగ్య కార్యకర్తలను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచారు. ఇక పోలింగ్‌ బూత్‌ ఆఫీసర్లు (బీఎల్వో)లుగా ఉన్నవారికీ బాధ్యతలు అప్పగించలేదు.
  • కర్నూలు, పాణ్యం, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌, నందికొట్కూరు, శ్రీశైలం, ఆళ్లగడ్డ తదితర పట్టణ ప్రాంతాలున్న నియోజకవర్గాల్లో సచివాలయ ఉద్యోగులకు బీఎల్వోల బాధ్యతలు అప్పగించారు. బీఎల్వోలుగా ఉన్నవారు పింఛన్లు పంపిణీ చేస్తారా? లేదా? అన్నది సందిగ్ధంగా ఉంది. వారందరినీ దూరంగా ఉంచితే వారం రోజులైనా ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కర్నూలు, పాణ్యంతోపాటు పట్టణ ప్రాంతాలున్న సచివాలయాల ఉద్యోగుల్లో సగం మంది బీఎల్వోలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని