పల్లెల్లో ‘సారా’సురులు

సారా రహిత రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ పరివర్తన పూర్తిగా విఫలమైంది. కార్యాచరణ ప్రణాళికను సమర్థంగా అమలు చేయకపోవడం, వైకాపా పెద్దల స్వార్థం తదితర కారణాలలో పల్లెల్లో నాటుసారా వ్యాపారం విస్తరిస్తోంది.

Updated : 12 Apr 2024 06:45 IST

ఆపరేషన్‌ పరివర్తన విఫలం
అక్రమార్కులకు వైకాపా వెన్నుదన్ను
న్యూస్‌టుడే, కర్నూలు, ఆదోని నేరవిభాగం

గుమ్మితంతండాలో సారా బట్టీల వద్ద సెబ్‌ అధికారులు

సారా రహిత రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ పరివర్తన పూర్తిగా విఫలమైంది. కార్యాచరణ ప్రణాళికను సమర్థంగా అమలు చేయకపోవడం, వైకాపా పెద్దల స్వార్థం తదితర కారణాలలో పల్లెల్లో నాటుసారా వ్యాపారం విస్తరిస్తోంది. సారా తాగడంతో నిత్యం ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.


180 ప్రభావిత ప్రాంతాలు

ఉమ్మడి జిల్లాలో 180సారా ప్రభావిత ప్రాంతాలున్నాయి. మద్యనిషేధ, ఆబ్కారీ శాఖాధికారులు సారా తయారీ ప్రాంతాలను ఏ-కేటగిరీగా, అమ్మకాల తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాలను బీ, సీ కేటగిరీలుగా విభజించారు. ఏ-కేటగిరీలో 30 గ్రామాలుండగా, బి-కేటగిరి-41, సి-కేటగిరీలో 109 ప్రాంతాలున్నాయి. కర్నూలు, ఆదోని, ఆలూరు, నందికొట్కూరు, పత్తికొండ నంద్యాల, పాణ్యం, బనగానపల్లి ఆత్మకూరు పరిధిలో ఈవ్యాపారం విస్తరించింది.


సెబ్‌ ఏర్పాటుచేసి.. పనిభారం పెంచి

మద్య నిషేధ, ఆబ్కారీ శాఖను రెండుగా విభజించిన వైకాపా ప్రభుత్వం కొత్తగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో శాఖను (సెబ్‌) ఏర్పాటు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల పర్యవేక్షణ బాధ్యతలను మద్య నిషేధ, ఆబ్కారీ శాఖకు అప్పగించింది. మొత్తం విభజన కారణంగా ఉమ్మడి జిల్లాల్లో 14 సెబ్‌ స్టేషన్లు, ఐదు చెక్‌పోస్టుల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. సెబ్‌లో మొత్తం 187 మంది పనిచేయాల్సి ఉండగా 103 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పలు స్టేషన్లలో పది మంది సిబ్బంది కూడా లేని పరిస్థితి. దీనికితోడు మద్యం ధరలు అమాంతం పెరగడంతో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా పెరగడంతో సెబ్‌ అధికారులకు పనిభారం అధికమై సారాపై దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది.


ప్రతికూల పరిస్థితులతో..

వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత సారాను పూర్తిగా నిర్మూలించే ఉద్దేశంతో ఆపరేషన్‌ పరివర్తన పేరుతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించింది. నిరంతర సారా స్థావరాలపై దాడులు చేపట్టడం, సమావేశాలు నిర్వహించి మంత్రణం చేయడం, కరడుగట్టిన సారా తయారీ నేరగాళ్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకోవడం, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం వంటి చర్యలతో సారాను నిరోధించేందుకు చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితుల కారణంగా సఫలం కాలేకపోయింది. నాటుసారా తాగి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.


ప్రభుత్వ అలసత్వం

  • కర్నూలులోని బంగారుపేట నీలిషికారీలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని హామీలు ఇస్తున్న అధికారులు వారిని పట్టించుకున్న దాఖలాలు లేవు.
  • సెబ్‌ స్టేషన్ల నిర్వహణకు ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయడం లేదు. వాహనాలకు ఇంధనం, అద్దెల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తోంది.
  • పోలీసు, సెబ్‌ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం.. సారా నిరోధించే విషయంలో కలిసి పనిచేయకపోవడం ప్రధాన లోపంగా మారింది.

అధికారం అండ

  • మద్యపాన నిషేధమంటూ హామీ ఇచ్చిన వైకాపా ప్రభుత్వం.. ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో దోపిడీకి తెరలేపింది. పలువురు వైకాపా నేతలకు లబ్ధి చేకూర్చేందుకు మద్యం ధరలు అమాంతం పెంచింది. నిరుపేద మందుబాబులకు సారానే ప్రత్యామ్నాయంగా మారింది. ఫలితంగా సారాకు గిరాకీ పెరిగి వ్యాపారం విస్తరించింది.
  • సారా తయారీ, అక్రమ రవాణా, వ్యాపారులకు వైకాపా నేతలే అండగా నిలుస్తున్నారు. వారిపై సెబ్‌ అధికారులుగానీ, పోలీసులుగానీ చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోతున్నారు. ఆదోనిలో సారా తయారీదారులు, విక్రయదారులు 200 మందికిపైగా ఉన్నారు. వైకాపా ప్రజాప్రతినిధి అండదండలతో వీరు బాహాటంగా సారా వ్యాపారం చేస్తుండటం గమనార్హం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని