అసమర్థతే జగన్‌ స్పెషాలిటీ

తెదేపా ప్రభుత్వ హయాంలో కేంద్రం సహకారంతో నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల.. అధునాతనం.. అద్భుతం. అన్ని హంగులతో కార్పొరేట్‌ తరహాలో అందుబాటులోకి వచ్చింది.

Updated : 12 Apr 2024 06:46 IST

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం

తెదేపా ప్రభుత్వ హయాంలో కేంద్రం సహకారంతో నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల.. అధునాతనం.. అద్భుతం. అన్ని హంగులతో కార్పొరేట్‌ తరహాలో అందుబాటులోకి వచ్చింది. ఉమ్మడి అనంత జిల్లా వాసులకు ఆధునిక ఉచిత వైద్యసేవలు అందించాలన్న లక్ష్యానికి తూట్లు పొడిచాడు జగన్‌. నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసి.. అందరికీ వైద్యసేవలు అందిస్తున్నామంటూ చేసిన ప్రచార ఆర్భాటం అంతాఇంతా కాదు. ఖరీదైన వైద్యసేవలు అనంత ముంగిటకే వస్తాయన్న కరవు జిల్లా వాసుల ఆశలపై నీళ్లు చల్లింది వైకాపా ప్రభుత్వం. ఐదేళ్లలో ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదు. పూర్తిస్థాయిలో వైద్యుల నియామకాలు చేపట్టలేదు. సకల హంగులతో భవనాలు, విలువైన యంత్రాలను వినియోగించకోలేని దారుణస్థితి దిగజారింది జగన్‌ సర్కారు. వినాశనమే తప్ప అభివృద్ధి అంటే గిట్టని పాలకులు.. కార్పొరేట్‌ సేవలు అందించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంత వరకు సమంజసమో అనంత వాసులు ఆలోచించాలి.

న్యూస్‌టుడే, అనంతపురం (వైద్యం)

ప్రత్యేక బడ్జెట్‌ ఊసేదీ?

సూపర్‌ స్పెషాల్టీ ఆసుపత్రి కొవిడ్‌ వ్యాప్తి సమయంలో అందుబాటులోకి వచ్చింది. కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఎండోక్రైనాలజీ, కార్డియోథొరాసిక్‌ తదితర విభాగాలు ఉన్నాయి. నిర్వహణకు ఎలాంటి బడ్జెట్‌ లేదు. అనంతపురం సర్వజన ఆసుపత్రికి కేటాయించిన నిధుల్లో కొంత వినియోగిస్తున్నారు.


గది ఉంది.. ఎంఆర్‌ఐ యంత్రం ఏదీ?

వైద్యశాలలో ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటుకు ప్రత్యేక గది కేటాయించారు. ఇప్పటి వరకు వైకాపా ప్రభుత్వం యంత్రాన్ని కొనుగోలు చేయలేదు. దీంతో వైద్యులు.. రోగులను సర్వజన వైద్యశాలకు వెళ్లి ఎంఆర్‌ఐ చేయించుకోవాలని చీటీ రాసిస్తున్నారు. రోగులకు వ్యయప్రయాస తప్పడం లేదు. ఇక రక్త పరీక్షలు అరకొరగా సాగుతున్నాయి. సిబ్బంది కొరతతో నివేదికలు ఆలస్యంగా వస్తున్నాయని దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి పర్యవేక్షణను ప్రజాప్రతినిధులు గాలికి వదిలేశారు.


వారంలో రెండు రోజులే ఓపీ

ప్రస్తుతం ఎనిమిది విభాగాలకు సంబంధించి వారంలో రెండు రోజులు మాత్రమే ఓపీ సేవలు అందిస్తున్నారు. సగటున 300 నుంచి 400 మంది రోగులు వస్తున్నారు. 200 మంచాల సామర్థ్యం ఉన్నా కేవలం 50కి మించి ఇన్‌పేషెంట్లు ఉండటం లేదు.


అందుబాటులో లేని మందులు

సర్వజన ఆసుపత్రికి కేటాయించే మందులనే సూపర్‌ స్పెషాల్టీలో ఇస్తున్నారు. దీంతో ఇక్కడి వైద్యానికి అవసరమైన ప్రత్యేక మందులు అందుబాటులో ఉండటం లేదు. రోగులు సొంత డబ్బులు వెచ్చించి ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు.


విలువైన పరికరాలు వృథా

మెడికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజికి సంబంధించి రూ.30లక్షల విలువ చేసే యంత్రం, రక్తపరీక్షలు నిర్వహించే ఎలిసారీడర్‌ అండ్‌ వాషర్‌ స్టోర్‌రూంలో వృథాగా పడిఉన్నాయి. ఐదేళ్లలో కనీసం యంత్రాల ప్యాకింగ్‌ అట్టపెట్టెలను కూడా తీయని దుస్థితి. వందకు పైగా వెంటిలేటర్లు, బెడ్లు నిరుపయోగంగా మారాయి.


36 మందికి 16 మంది వైద్యులే..

ఆయా విభాగాలకు 36 మంది వైద్యనిపుణులు అవసరం. ప్రస్తుతం 16 మంది సేవలు అందిస్తున్నారు. మెడికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి వైద్యులను కేటాయించకపోవటంతో మూతపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని