నిర్లక్ష్యానికి హద్దుండాలి.. ఓట్లడగడానికి సిగ్గుండాలి..

ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లేందుకు పేరేచర్ల-కొండమోడు మార్గం ఎంతో కీలకమైంది. వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగానే ఉంటుంది.

Updated : 12 Apr 2024 06:44 IST

విస్తరణకు నోచుకోని పేరేచర్ల-కొండమోడు రహదారి
నిత్యం ప్రమాదాలతో వందల సంఖ్యలో రోడ్డున పడ్డ కుటుంబాలు
బస్సుయాత్రకు వస్తున్న సీఎం జగన్‌ను ప్రశ్నిస్తున్న స్థానికులు
ఈనాడు-నరసరావుపేట

దుస్థితిలో  కొండమోడు - పేరేచర్ల రహదారి

ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లేందుకు పేరేచర్ల-కొండమోడు మార్గం ఎంతో కీలకమైంది. వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ రహదారి ఇరుకుగా ఉండి అడుగుకో గుంత ఉండటంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుని విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర ద్వారా శుక్రవారం సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామం నుంచి బయలుదేరి సత్తెనపల్లి, మేడికొండూరు మీదుగా గుంటూరు చేరుకుంటారు. బస్సు  యాత్ర సాగే ఈ మార్గం విస్తరణకు నోచుకోక గోతులు పడి ఎంత అధ్వానంగా తయారైందో, ఆ నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. కీలకమైన ఈ రహదారి అభివృద్ధి చేయని జగన్‌ ఎన్నికల్లో ఓటేయాలని ఎలా అడుగుతారని ఈ ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు.

పిడుగురాళ్ల సమీపంలోని కొండమోడు నుంచి గుంటూరు సమీపంలోని పేరేచర్ల వరకు జాతీయరహదారి 50 కిలోమీటర్లను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ.1032 కోట్లతో టెండరు పిలిచారు. ఈ పనులను రాజేంద్రసింగ్‌ బేంబూ అనే సంస్థ దక్కించుకుంది. సంస్థకు బిడ్‌ ఖరారు అయినట్లు లేఖ(ఎల్‌వోఏ) ఇచ్చే దశలో ప్రక్రియ ఆగిపోయింది. భారత్‌మాల పరియోజన పథకం కింద మంజూరు చేసిన ఎన్‌హెచ్‌ ప్రాజెక్టులను కేంద్రం గత నవంబరు నుంచి ఆపేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కొత్త పనులు చేపట్టవద్దని సూచించింది. ఈ మార్గం ప్రాధాన్యం దృష్ట్యా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పనులు ప్రారంభించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండిపోయింది. దీంతో రహదారి విస్తరణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

అడుగుకో గుంత.. చూడకుంటే అంతే..

గుంటూరు నుంచి హైదరాబాద్‌ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరించాలని రాష్ట్ర రహదారిగా ఉన్న సమయంలో ప్రణాళికలు రూపొందించారు. ఈమార్గం ప్రాధాన్యం దృష్ట్యా కేంద్రం జాతీయ రహదారి గుర్తించి అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఇది అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈ మార్గం. గుంటూరు నగరం నుంచి పేరేచర్ల వరకు నాలుగు వరుసల రహదారి, కొండమోడు నుంచి నాలుగు వరుసల రహదారిలో వాహనాలు ప్రయాణిస్తుండగా పేరేచర్ల-కొండమోడు నడుమ ఇరుకు మార్గంలో వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడంతోపాటు ఇంధనం వృథా అవుతోంది. ఇరుకు మార్గంతోపాటు గోతులు ఉండటం, రోడ్డు మార్జిన్లు సక్రమంగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు, ముందు వెళుతున్న వాహనాన్ని వెనుక వాహనం అధిగమించే ప్రయత్నంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల  బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.

వందల సంఖ్యలో బాధిత కుటుంబాలు

పేరేచర్ల-కొండమోడు మార్గం ఇరుకుగా ఉండటంతోపాటు వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాల్లో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో కుటుంబసభ్యులను కోల్పోయిన కుటుంబాలు ఈమార్గం పరిధిలో వందల సంఖ్యలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రమాదాలు జరిగిన ప్రతిసారి రోడ్డు విస్తరణ గురించి ప్రస్తావించే ప్రజాప్రతినిధులు తర్వాత పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించిందని ఈ ప్రాంత వాసులు వాపోతున్నారు. సీఎం జగన్‌ బస్సు యాత్ర శుక్రవారం ఈ మార్గంలో సాగించాల్సి ఉండటంతో ఇకనైనా కళ్లకు గంతలు కట్టుకోకుండా ప్రజలు ఎంత కష్టపడుతున్నారో గ్రహించాలంటున్నారు. రోడ్డు అభివృద్ధి చేయకుండా తనకు ఓటు వేయండని ఎలా అడుగుతారని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఆగిన భూసేకరణ ప్రక్రియ

పేరేచర్ల నుంచి కొండమోడు మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించనున్న నేపథ్యంలో భూసేకరణ కీలకంగా మారింది. విస్తరణకు ఏయే ప్రాంతంలో ఎంత భూమి అవసరమో రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. సేకరించాల్సిన భూమిలో ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి, అసైన్డు, పొరంబోకు భూములను విభాగాలుగా విభజించి వివరాలతో నివేదిక రూపొందించారు. ప్రైవేటు వ్యక్తుల భూమి రహదారి విస్తరణకు ఎంత అవసరం? నిబంధనల ప్రకారం ఎంత పరిహారం లభిస్తుంది? తదితర వివరాలతో నివేదిక తయారుచేశారు. సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్‌ వరకు రూ.22 కోట్ల సొమ్ము భూసేకరణకు అవసరమని ప్రతిపాదనలు తయారుచేశారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో భూసేకరణ ప్రక్రియ ఆగిపోయింది. మరోవైపు గుంటూరు జిల్లా పరిధిలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైనా ఇంకా కొలిక్కి రాలేదు. ప్రభుత్వం భూసేకరణకు నిధులు ఇవ్వకపోవడం, పరిహారం సొమ్ము జమ చేసిన తర్వాతే భూములు ఇస్తామని రైతులు స్పష్టం చేయడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది.

2019 నుంచి ఇప్పటి వరకు మేడికొండూరు మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల  వివరాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని