యో.. అన్నీ పెద్దాయన ప్రాంతానికే

జిల్లాలో అదొక ప్రత్యేక ‘సామ్రాజ్యం’.. అక్కడ ఆ ‘పెద్దాయన’ చెప్పిందే వేదం.. అదేమిటని అడిగేవారే లేరు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పలు శాఖలకు సంబంధించి ఏ చిన్న పని చేపట్టాలన్నా అక్కడి నుంచే మొదలుకావాలి.

Updated : 13 Apr 2024 04:44 IST

 విద్యుత్తు శాఖలో పుంగనూరు నేత దందా
 జిల్లాలో విద్యుత్తు తీగల కొరత
 వినియోగదారులకు తప్పని నిరీక్షణ

జిల్లాలో అదొక ప్రత్యేక ‘సామ్రాజ్యం’.. అక్కడ ఆ ‘పెద్దాయన’ చెప్పిందే వేదం.. అదేమిటని అడిగేవారే లేరు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పలు శాఖలకు సంబంధించి ఏ చిన్న పని చేపట్టాలన్నా అక్కడి నుంచే మొదలుకావాలి.. అన్నీ ‘అక్కడకే’ చేరాలి.. కాదంటే వారు ‘వేరేచోట’కు వెళ్లిపోతారు.. ఇదీ ఆ నియోజకవర్గ ప్రత్యేకత.. కాదని చెప్పేవారే ఉండరు. ఉన్నా జిల్లాలో పనిచేయలేరు.. దీంతో ప్రస్తుతం కీలకమైన విద్యుత్తు శాఖకు సంబంధించిన సామగ్రిని సైతం సంబంధిత అధికారులు ‘ప్రత్యేక చొరవ’తో ఆ నియోజకవర్గానికే కేటాయించడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది.

చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే: విద్యుత్తు శాఖలో వైర్లు(కండక్టర్లు) కొరత తీవ్రంగా ఉంది.. చిత్తూరులోని విద్యుత్తు శాఖ గోదాములో ఒక మీటరు విద్యుత్తు వైరు అందుబాటులో లేదు.. దీంతో నూతన సర్వీసులకు దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు అవస్థలు తప్పడం లేదు.. మూడు నెలలుగా వినియోగదారులు విద్యుత్తు వైర్ల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ అవస్థలు పడుతున్నారు.. ఇదేం పరిస్థితి అని ఆరా తీస్తే.. ఎదురయ్యే సమాధానం.. అన్నీ పుంగనూరుకు పంపామని.. ఇది చాలు ఆ ‘పెద్ద’ మంత్రి అంటే అధికారులకు ఎంత భయమో.. ఇదీ ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యుత్తు శాఖ పరిపాలనా దుస్థితి.

ఆర్భాటాలకే పరిమితం..

వినియోగదారులకు అడిగిన వెంటనే విద్యుత్తు సర్వీసులు అందిస్తున్నామంటూ ప్రభుత్వ ఆర్భాటపు ప్రకటనలే తప్ప క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితి. విద్యుత్‌ ఛార్జీలే కాదు.. నియంత్రికలు, అనుబంధ పరికరాల ధరలూ పెంచేసి వినియోగదారులపై మోయలేని భారాన్ని మోపింది వైకాపా సర్కార్‌. పెంచిన ధరలతోనైనా తీసుకుందామంటే సరిపడా పరికరాలు ప్రధాన గోదాములో అందుబాటులో లేవు. గృహ, వాణిజ్య, వ్యవసాయ తదితర అన్ని రకాల సర్వీసులకు తిరుపతి సర్కిల్‌ వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నూతన సర్వీసులు జారీ చేయగానే క్షేత్రస్థాయిలో అమర్చాలంటే నియంత్రికలు, కండక్టర్లు(వైర్లు), అనుబంధ పరికరాలు అవసరం. నూతన సర్వీసులకు 11కేవీ నుంచి నియంత్రిక వరకు వైర్లు ఏర్పాటు చేయాలి. వైర్ల కొరతతో సర్వీసులు అమర్చడం పూర్తిగా ఆగింది.

విద్యుత్తు శాఖ గోదాము

అంతా అక్కడికే...

అంతంతమాత్రంగా గోదాముకు చేరే కండక్టర్లు, అనుబంధ పరికరాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గానికే పరిమితమవుతున్నట్లు ఆ శాఖ అధికారులే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. గోదాము నుంచి నియంత్రికలు, అనుబంధ పరికరాలు, కండక్టర్లను ప్రాధాన్యత క్రమంలో అన్ని డివిజన్లకు సరఫరా చేయాల్సి ఉన్నా పుంగనూరుకు సరఫరా చేస్తున్నారు. దీంతో మిగిలిన ప్రాంతాల వినియోగదారులకు మొండిచేయి చూపుతున్నారు. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ‘పెద్ద’మంత్రి విద్యుత్తుశాఖకూ బాధ్యుడు కావడంతో దీనిపై ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి.  ‘ఆ.. ప్రజలు ఎలా పోతే మనకేంటి.. ‘పెద్దాయన’ ఆశీస్సులు ఉంటే చాలు మనకు..’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి అధికారులు దృష్టి సారించి కండక్టర్లు, అనుబంధ పరికరాల సమస్య పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని