యునెస్కో కనుసన్నల్లో రామప్ప అభివృద్ధి

అద్భుత శిల్పకళ, నిర్మాణశైలితో ప్రత్యేకత చాటుకున్న రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కింది. ప్రపంచ స్థాయి కట్టడంగా, వారసత్వ కట్టడంగా దాని అభివృద్ధికి ఆ సంస్థ అడుగులేస్తోంది.

Updated : 13 Apr 2024 04:49 IST

న్యూస్‌టుడే, వెంకటాపూర్‌

అద్భుత శిల్పకళ, నిర్మాణశైలితో ప్రత్యేకత చాటుకున్న రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కింది. ప్రపంచ స్థాయి కట్టడంగా, వారసత్వ కట్టడంగా దాని అభివృద్ధికి ఆ సంస్థ అడుగులేస్తోంది. ఇప్పటికే మూడు సమావేశాలను ప్రత్యేకంగా నిర్వహించిన యునెస్కో ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించింది. ఆలయ పరిధిలోని కామేశ్వరాలయం, సోమసూత్రం, బఫర్‌జోన్‌, రామప్ప భూములకు హద్దుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు నిబద్ధతతో ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు. దీనిపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

పూర్తయిన సోమసూత్రం పనులు

యునెస్కో మూడో సమావేశంలో చర్చించిన మేరకు మూసుకుపోయిన సోమసూత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చూడడంతోపాటు మరోసారి ఆయనకు ఆలయ పూజారులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌ సమస్యను గుర్తు చేశారు. ఆయన కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, కేంద్ర పురావస్తు శాఖ హైదరాబాద్‌ మండలం సూపరింటెండెంట్‌ స్మితా ఎస్‌ కుమారిని వెంటనే సోమసూత్రం పునరుద్ధరణ పనులు పూర్తి చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటికే సిద్ధమైన పురావస్తు శాఖ అధికారులు పనులు మొదలుపెట్టి సోమసూత్రం నుంచి వచ్చే జలం బయటకు వెళ్లేలా పైపులు అమర్చి సమస్యను పరిష్కరించారు.

నత్తనడకన బఫర్‌జోన్‌, ఆలయ హద్దుల నిర్ధారణ

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక హద్దులు నిర్ధారించుకున్నా, పూర్తి స్థాయిలో నిర్ధారణకు ఇతర శాఖలతో కలిసి సంయుక్త సర్వే ఇంకా చేయలేదని దేవాదాయ శాఖ ఈవో బిళ్ల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బఫర్‌జోన్‌ ఏర్పాటుకు మ్యాప్‌ సిద్ధమైనప్పటికీ రెవెన్యూ, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో సంయుక్త సర్వే మాత్రం పూర్తి కాలేదు. ప్రత్యేకంగా భూపాలపల్లి నుంచి సర్వేయర్లను పిలిపించారు. ఆలయ హద్దుల నుంచి  నిషేధిత ప్రాంతం(0-100 మీటర్ల) క్రమబద్ధీకరించిన ప్రాంతం(100- 300 మీటర్లు), బఫర్‌జోన్‌  (300- 500 మీటర్ల) ప్రాంతాలకు హద్దులు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సర్వేలన్నీ పూర్తి చేసిన అనంతరం యునెస్కో కూడా అభివృద్ధి కోసం నిధులు సమకూర్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చర్చించుకుంటున్నారు.

మొదలైన కామేశ్వరాలయ నిర్మాణం

రామప్ప ఆలయంతోపాటు నిర్మించిన కామేశ్వరాలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరడంతో పురావస్తు శాఖ అధికారులు ఆలయ పునర్నిర్మాణం కోసం 2010 నుంచి సన్నాహాలు మొదలుపెట్టారు. అప్పటి నుంచి నేటి వరకు పూర్తిస్థాయిలో ఆలయ అంతర్భాగాన్ని తొలగించలేదు. ఆలయ అంతర్భాగంలో ఎంతవరకు ఇసుక నింపారు..  డంగుసున్నం కాంక్రీట్‌ ఏమైనా వేశారా.. ఇంకా ఏదైనా టెక్నాలజీ వాడారా.. దానిని తొలగించాలా? లేక ఇంతటితోనే పునర్నిర్మాణ పనులు మొదలు పెట్టాలా? అని నిపుణుల పర్యవేక్షణలో పరీక్షలు చేశారు. ఇటీవల ఆలయ అంతర్భాగంలోని ఇసుకను తొలగించారు. పునాది రాళ్లకు గుర్తులు వేశారు. రామప్ప ఆలయం, వంటగది, ప్రాకారం పునాది రాళ్లతో పోల్చుతూ పునాది రాళ్ల ఫొటో, వీడియో రికార్డు చేసి పునర్నిర్మాణ పనులు వేగంగా చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని