అంతా.. గంపగుత్తా

భువనగిరి లోక్‌సభ గెలుపోటముల్లో కీలక పాత్ర పోషించే ఓ సామాజికవర్గం ఓట్లను గంపగుత్తగా పొందడానికి ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సామాజికవర్గ నాయకులను కలుస్తూ ఎన్నికల్లో మద్దతు కూడగడుతున్నారు.

Updated : 14 Apr 2024 06:47 IST

సామాజికవర్గాలు, ప్రభావశీల నేతలపై ప్రధాన పార్టీల గురి
ఈనాడు, నల్గొండ

భువనగిరి లోక్‌సభ గెలుపోటముల్లో కీలక పాత్ర పోషించే ఓ సామాజికవర్గం ఓట్లను గంపగుత్తగా పొందడానికి ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సామాజికవర్గ నాయకులను కలుస్తూ ఎన్నికల్లో మద్దతు కూడగడుతున్నారు. మరో ప్రధాన పార్టీ నాయకుడిది ఇదే తీరు. ఏళ్లుగా ఎదురుచూపుల అనంతరం ఇప్పుడే తమ సామాజికవర్గానికి అవకాశం వచ్చిందని..ఈ దఫా ఎన్నికల్లో తనకు మద్దతిస్తే సామాజికవర్గ అభ్యున్నతికి కృషి చేస్తానని సదరు అభ్యర్థి ఎన్నికల ప్రచారాల్లో వెల్లడిస్తున్నారు.

నల్గొండ లోక్‌సభ పరిధిలోని పలు సెగ్మెంటుల్లో ఇతర పార్టీల్లో ఉండి గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి తీవ్రంగా కృషి చేస్తున్నారు. గతంతో తనతో పనిచేసిన వారితో పాటూ క్షేత్రస్థాయిలో ప్రభావం చూపే నాయకులతో స్వయంగా తానే మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు.

ఎన్నికలకు ఇంకా నెల రోజులే సమయం ఉండటం, అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఇంటింటి ప్రచారానికి లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం లేకపోవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు గంపగుత్త ఓట్లపై దృష్టి సారించారు. సామాజికవర్గాలు, కమ్యూనిటీ సెంటర్లు, అపార్ట్‌మెంట్లు, సొసైటీల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం తమ నమ్మకస్తుల ద్వారా చర్చలు జరపుతూ ఎన్నికల్లో గెలుపొందితే తామేం చేస్తామో వెల్లడిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిల్లో సామాజికవర్గాల వారీగా ఓట్ల లెక్కలను విశ్లేషించుకుంటూ ప్రతి మండలం, నియోజకవర్గాల వారీగా ఎవరు గెలుపోటముల్లో కీలకంగా ఉంటారనే దానిపై చర్చలు జరుపుతున్నారు.

ద్వితీయ శ్రేణి చేజారకుండా...

అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీలైన భారాస, భాజపా అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా ముఖ్యనాయకుల విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. భారాస గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు లోక్‌సభ స్థానాల్లో సమావేశాలు నిర్వహిస్తుండగా.. నల్గొండలో మంత్రి ఉత్తమ్‌, భువనగిరిలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికార పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. మరోవైపు భాజపా పార్టీ కేంద్ర పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ క్షేత్రస్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తోంది.

ఇప్పుడిప్పుడే ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో పార్టీకి గ్రామ, మండల స్థాయిలో కీలకమైన ద్వితీయ శ్రేణి నాయకులు చేజారకుండా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటూ వారి సన్నిహితులు దృష్టి పెడుతున్నారు. బూత్‌స్థాయిలో ఓటర్లను కలిసి వారిని పోలింగ్‌ రోజు పార్టీకి ఓటేసేలా చేయడంలో ద్వితీయ శ్రేణి నాయకులు కీలకంగా ఉండనున్న నేపథ్యంలో వారి అవసరాలు తీరుస్తూ రాయబేరాలు సాగిస్తున్నారు. అధికార కాంగ్రెస్‌, భారాస నేతలు ఇప్పుడు తమకు మద్దతిస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని హామీలిస్తున్నారు. భాజపా నాయకులు కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వమే రాబోతుందని చెబుతూ ఆ రెండు పార్టీల కంటే ఇక్కడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నచ్చజేబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని