నీటి రాతలే.. నీళ్ల్లివ్వరు!

వలసలతో పట్టణ జనాభా నానాటికీ పెరుగుతోంది.. పెరుగుతున్న అవసరాలకు సరిపడా నీరందడం లేదు. వేసవిలో గుక్కెడు నీటి కోసం పుర ప్రజలు అల్లాడుతున్నారు.

Updated : 16 Apr 2024 06:07 IST

తాగునీటి సమస్యకు పరిష్కారం చూపని ప్రభుత్వం
నిధులు లేక అక్కరకు రాని రక్షిత నీటి పథకాలు
వేసవి పూర్తిగా రాకుండానే పట్టణాల్లో దాహం కేకలు

వలసలతో పట్టణ జనాభా నానాటికీ పెరుగుతోంది.. పెరుగుతున్న అవసరాలకు సరిపడా నీరందడం లేదు. వేసవిలో గుక్కెడు నీటి కోసం పుర ప్రజలు అల్లాడుతున్నారు. జనాభాకనుగుణంగా ఒక్కో వ్యక్తికి సగటున వంద లీటర్లపైన నీరందించాల్సి ఉండగా, ఏ పట్టణంలో కూడా 70 లీటర్ల నీటిని అందించలేకపోతున్నారు. రక్షిత నీటి పథకాల విస్తరణ గురించి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. పట్టణాల్లో అదనంగా రిజర్వాయర్లు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, పైప్‌లైన్ల నిర్మాణానికి నిధులు కేటాయించకుండా మొండిచేయి చూపారు. పన్నుల వసూళ్లపై చూపిన శ్రద్ధ నీటి సరఫరా మెరుగుదలకు ఏ మాత్రం చూపలేదు. జిల్లా కేంద్రం బాపట్లలో రెండో రిజర్వాయరు తవ్వకానికి వంద ఎకరాల భూసేకరణకు రూ.18 కోట్ల నిధులు మంజూరు చేస్తానని సాక్షాత్తు సీఎం జగన్‌ ఇచ్చిన హామీ నీటి మీద రాతలయ్యాయి. నీటి పథకాల నిర్వహణ లేమితో వేల లీటర్ల నీరు వృథా అవుతున్నాయి. కుళాయిల ద్వారా నీరు రంగు మారి వస్తూ ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది. శివారు కాలనీలకు ట్యాంకర్లతో కూడా నీరందించడం లేదు. దాహం తీర్చండి మహాప్రభో.. అని పట్టణ వాసులు గొంతెత్తినా, ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు.

బాపట్ల, న్యూస్‌టుడే

బాపట్లలో రెండ్రోజులకొకసారి నీళ్ల్ఠుజిల్లా కేంద్రం బాపట్లలో నాలుగున్నర దశాబ్దాల నాటి రక్షిత నీటి పథకం పెరిగిన జనాభా  అవసరాలకు తగినట్లుగా నీరు అందించలేకపోతోంది. ప్రసుత్తం ఉన్న రిజర్వాయరుతో పాటు రానున్న 30 ఏళ్లు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో వంద ఎకరాల రిజర్వాయరు నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. భూసేకరణకు రూ.18 కోట్లు కావాల్సి ఉంది. ఇరవై నెలల క్రితం బాపట్ల వచ్చిన సీఎం జగన్‌ నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి నేటి వరకు రూపాయి విడుదల చేయలేదు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో పట్టణంలోని ఉప్పరపాలెంలో రూ.రెండు కోట్లతో నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకును పైప్‌లైన్లతో అనుసంధానం చేయకుండా నిరుపయోగంగా ఉంచారు. పురపాలక సంఘానికి నాలుగు ట్యాంకర్లు ఉండగా రెండు పాడైపోయాయి. ప్రస్తుతం తిరుగుతున్న రెండింటిలో ఒకటి మరమ్మతులకు గురైంది. ఒక్క ట్యాంకర్‌తోనే కుళాయిల ద్వారా నీరు అందిస్తున్నారు.

మరమ్మతులు చేయాల్సిన ట్యాంకరు

శివారు ప్రాంతాలకు నీటిని అరకొరగా సరఫరా చేస్తున్నారు. శివారు కాలనీలకు పది రోజుల కొకసారి మాత్రమే ట్యాంకరు వస్తోంది. పాత పైప్‌లైన్లు దెబ్బతిని పట్టణంలో రోజూ ఏదొక ప్రాంతంలో 50 వేల లీటర్లకుపైగా నీరు వృథాగా మురుగు కాలువల్లో కలిసిపోతోంది. ఒక్కటే రిజర్వాయరు కావడం వల్ల, నీటి లభ్యత తక్కువగా ఉండటం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి నుంచి రెండ్రోజుల కొకసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక్కో వ్యక్తికి రోజూ పూర్తి అవసరాలకు 135 లీటర్లు కావాలి కానీ బాపట్లలో 65 లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు.


రేపల్లెలో దినదినగండంగా సరఫరా

రేపల్లెలో ఇంటింటా డ్రమ్ములు ఉండాల్సిందే..

రేపల్లె రక్షిత నీటి పథకం చెరువులో నీటి నిల్వలు పడిపోయాయి. 14 అడుగులకు గాను ప్రస్తుతం ఆరు అడుగులు మాత్రమే నీరు ఉంది. రోజూ అర గంట మాత్రమే వార్డుల్లో కుళాయిలకు నీరు సరఫరా చేస్తున్నారు. నీరు కోసం ప్రజలు బోర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఒకటో వార్డు ఎస్టీ కాలనీ, 28వ వార్డు శివారు, జగనన్న కాలనీకి కుళాయిల ద్వారా నీరు అందడం లేదు. రెండు ట్యాంకర్ల ద్వారా అరకొరగా మాత్రమే నీరు అందుతోంది. ప్రజలు ఇంటి ముందు డ్రమ్ములు పెట్టుకుని నీటి కోసం ఎదురుచూస్తున్నారు. పాత పైప్‌లైన్లు దెబ్బతిని నీరు లీకై రంగు మారి వస్తుండటంతో పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు.

పెరిగిన నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో రిజర్వాయరు నిర్మించాల్సి ఉండగా, వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. అరకొరగా అందుతున్న నీరు అవసరాలకు చాలక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.


చీరాలలో రంగు మారిన నీరే గతి

చీరాల రక్షిత నీటి పథకానికి ఒక్క రిజర్వాయరు మాత్రమే ఉంది. పెరుగుతున్న జనాభా అవసరాల నిమిత్తం మరో వంద ఎకరాల్లో రెండో రిజర్వాయరు నిర్మాణానికి అధికారులు రూ.50 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపించారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదు. పట్టణంలో నలభై ఏళ్ల నాటి పైప్‌లైన్లు దెబ్బతిని లీకై తాగునీరు వృథాగా పోతోంది. రక్షిత నీటి పథకం పంప్‌హౌస్‌లో నీటి శుద్ధి సరిగా జరగటం లేదు. కుళాయిల ద్వారా వస్తున్న నీరు రంగు మారి నల్లగా, పచ్చగా వస్తున్నాయి. నీటిలో సన్నటి పురుగులు కనిపిస్తున్నాయి.

రంగుమారిన నీటిని గృహావసరాలకు వాడటానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఎక్కువగా బోర్లపై ఆధారపడుతున్నారు. పాత పైప్‌లైన్ల స్థానంలో కొత్త వాటిని వేసి లీకులను అరికట్టి, నీరు రంగు మారి కలుషితం కాకుండా చర్యలు చేపట్టాల్సి ఉన్నా పాలకులు దృష్టిసారించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.


అద్దంకి శివార్లలో దాహం కేకలు

గుండ్లకమ్మ ఊట బావుల నుంచి పట్టణ వాసులకు నీరు సరఫరా చేస్తున్నారు. అద్దంకి పట్టణంలో మూడు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు ఉన్నాయి. వాటిలో పురపాలక కార్యాలయం వద్ద 1978లో నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. దీంట్లోకి నీటిని ఎక్కిస్తే కూలిపోతుందని, ప్రస్తుతం రెండు ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల ద్వారానే నీటిని అందిస్తున్నారు. పట్టణంలో శివారు కాలనీలు ఎన్టీఆర్‌ నగర్‌, గరటయ్య కాలనీ, మొండితోకపాలెం, కట్టకిందపాలెం, గుంజివారిపాలెం, ముజావారిపాలెం, ఏకలవ్యనగర్‌, భిక్షాల కాలనీ వాసులకు కుళాయిల ద్వారా నీరందడం లేదు. ఒక్క ట్యాంకర్‌ ద్వారా అరకొరగా సరఫరా చేస్తున్నారు.

మూడో ఓవర్‌ హెడ్‌ ట్యాంకు  నిర్మాణానికి రూ.మూడు కోట్లు కావాల్సి ఉన్నా వైకాపా ప్రభుత్వం రూపాయి కూడా మంజూరు చేయలేదు.  శివారు కాలనీ వాసుల నీటి కష్టాలు  తీరలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని