దారి మారలేదు.. ఆళ్ల వల్ల కాలేదు..

కృష్ణా పశ్చిమ డెల్టాలోని వివిధ ప్రాంతాల నుంచి తెనాలికి వచ్చి అక్కడి నుంచి దుగ్గిరాల మీదుగా విజయవాడకు రాకపోకలు సాగించేవారు ఎక్కువ.

Updated : 16 Apr 2024 06:06 IST

పట్టాలెక్కని తెనాలి-విజయవాడ రోడ్డు విస్తరణ
బిల్లులు ఇవ్వలేదని మరమ్మతులూ నిలిపివేత
గోతుల దారిలో వాహనదారుల సాహస ప్రయాణం
ఈనాడు, అమరావతి

తుమ్మపూడి వద్ద ఇలా..

కృష్ణా పశ్చిమ డెల్టాలోని వివిధ ప్రాంతాల నుంచి తెనాలికి వచ్చి అక్కడి నుంచి దుగ్గిరాల మీదుగా విజయవాడకు రాకపోకలు సాగించేవారు ఎక్కువ. డెల్టా నుంచి వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు, తెనాలి మార్కెట్‌ నుంచి నిమ్మకాయలు నిత్యం విజయవాడ మార్కెట్‌కు తీసుకెళ్తారు. తెనాలి పరిసర ప్రాంతాల విద్యార్థులు విజయవాడలో ఉన్నత విద్య అభ్యసించే క్రమంలో రోజువారీగా రాకపోకలు సాగిస్తుంటారు. మరోవైపు రాజధాని అమరావతిలోని విద్యా సంస్థలకు వెళ్లడానికి కేఎల్‌యూ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వెళ్లే విద్యార్థులకు ఇది కీలకమార్గం. ఇలా అందరికీ అనుసంధాన మార్గంగా ఉన్న తెనాలి-విజయవాడ మార్గం అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. రోడ్డుకు ఇరువైపులా కాలువలు ఉండడంతో ఇరుకుమార్గంలో రాకపోకలు సాగిస్తున్న క్రమంలో వాహనాలు ఎదురుగా వచ్చే వాటిని తప్పించబోయి కాలువలో పడిపోయిన ఘటనలు ఉన్నాయి. రాత్రివేళ ఏమాత్రం ఆదమరిచినా అంతే సంగతులు. ఈ మార్గంలో ప్రమాదాలకు గురై పలువురు మృత్యువాత పడడంతో ఆ బాధిత కుటుంబాల వేదన వర్ణనాతీతంగా ఉంది.

హామీలతోనే సరి..

తెనాలి-విజయవాడ మార్గం విస్తరిస్తామని నేతలు ఎప్పటికప్పుడు హామీలు ఇస్తున్నారు. ఇది ప్రతిసారి ఎన్నికల హామీగా మిగిలిపోతోంది. ఇక్కడి నుంచి గత పదేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పలుమార్లు హామీ ఇచ్చినా అమలు కాలేదు. ప్రజలు డిమాండ్‌ చేసినప్పుడు, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డు విస్తరణపై హామీలు ఇవ్వడం, తర్వాత మరిచిపోవడం పరిపాటిగా మారింది. కనీసం గోతులైనా పూడ్చలేని దుస్థితిలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రోడ్డు మొత్తం ఒక లేయరు తారు లేచిపోయి గోతులుగా మారింది. ద్విచక్ర వాహనాలు సైతం గోతులు తప్పించుకోలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో ఎట్టకేలకు రెండు రీచ్‌లలో రోడ్డు మరమ్మతులకు నిధులు కేటాయించారు. పనులు చేపట్టిన గుత్తేదారు బిల్లులు రాలేదని అర్ధంతరంగా ఆపేశారు. వైకాపా ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో రెండుసార్లు టెండర్లు పిలిచిన తర్వాత ఒకే గుత్తేదారు వచ్చారు. సదరు సంస్థ కూడా పనులను అర్ధంతరంగా ఆపేయడం గమనార్హం. దీంతో ఇది మరోసారి ఎన్నికల హామీగానే మిగిలిపోయిందని ఈ ప్రాంత వాసులు వాపోతున్నారు.

దుగ్గిరాల మండలం తుమ్మపూడి-రేవేంద్రపాడు మధ్యలో గోతులతో అధ్వానంగా రహదారి


మంగళగిరి నియోజకవర్గ వ్యవహారాలను కొన్నాళ్లు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేపట్టారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో దుగ్గిరాలలో వైకాపా కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ దుగ్గిరాలకు వచ్చే రోడ్డు చాలా అధ్వానంగా ఉందని, కళ్లారా ప్రత్యక్షంగా చూశానన్నారు. అదే నెల 25వ తేదీలోగా మరమ్మతు చేయించి బాగు చేయిస్తానన్నారు. నెలన్నర గడిచినా ఇప్పటికీ అతీగతీ లేదు.  


మంగళగిరి ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ తెనాలి-మంగళగిరి రహదారి విస్తరణకు రూ.250 కోట్లు ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నారు. దుగ్గిరాల మండలం చింతలపూడి నుంచి మంగళగిరి వరకు రోడ్డు విస్తరించి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఏడాది తర్వాత ఇంకా రోడ్ల పనులు ప్రారంభం కాలేదని విలేకరులు అడిగితే దుగ్గిరాలలో ఉన్న లాకుల ఆకృతి మార్చేసి రోడ్డు విస్తరిస్తాం. ఆకృతులు రావడంలో జాప్యం జరుగుతోందన్నారు. అందుకే పనులు ప్రారంభించలేదని తెలిపారు. ఆయన పదవీకాలం అయిదేళ్లు పూర్తవుతున్నా రహదారి విస్తరణ పట్టాలెక్కలేదు.


24.5 కి.మీ

తెనాలి నుంచి మంగళగిరికి 24.5 కి.మీ దూరం ఉంది. తెనాలి నుంచి రాజధాని ప్రాంతానికి అనుసంధానం, విజయవాడ వెళ్లే మార్గం, కేఎల్‌యూ, ఏఎన్‌యూ వంటి విద్యా సంస్థలు, పాలు, కూరగాయలు, పండ్లు వంటి వ్యవసాయ ఉత్పత్తులు విజయవాడ మార్కెట్‌కు తీసుకెళ్లడానికి ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తారు. తెనాలి నుంచి రోజువారీగా విజయవాడకు రాకపోకలు సాగించేవారు ఎక్కువ మంది ఉన్నారు.

8.5 కి.మీ

తెనాలి నుంచి దుగ్గిరాల వరకు 8.5 కి.మీ మార్గం ఉంది. ఇందులో రోడ్డుకు ఒకవైపు తూర్పు కాలువ, మరోవైపు పశ్చిమ కాలువ ఉంది. దుగ్గిరాల నుంచి పెదవడ్లపూడి వరకు కృష్ణా పశ్చిమ కాలువ తూర్పు వైపు ఉంటుంది. ఈ క్రమంలో దుగ్గిరాల నుంచి మంగళగిరి వరకు రోడ్డు విస్తరణకు అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి 20 అడుగుల వెడల్పు ప్రభుత్వ స్థలం ఉంది. భూసేకరణ లేకుండా రోడ్డు విస్తరించవచ్చు. తెనాలి నుంచి దుగ్గిరాల వరకు రెండు వైపులా కాలువలు ఉన్నప్పటికీ పశ్చిమ వైపు రోడ్డు విస్తరించే అవకాశం ఉంది.

తెనాలి నుంచి మంగళగిరి మార్గంలో రహదారి అధ్వానంగా ఉన్న ప్రాంతంలో 8.8 కి.మీ నుంచి 13వ కి.మీ వరకు అభివృద్ధికి   రూ.2.8కోట్లు, ఇదే మార్గంలో 13.2 కి.మీ నుంచి 19వ కి.మీ వరకు రహదారి మరమ్మతులకు నిధులు కేటాయించి గుత్తేదారుకు పనులు అప్పగించారు. కొంత పనిచేసిన గుత్తేదారు బిల్లులు రాకపోవడంతో వాటిని నిలిపివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని