కాంగ్రెస్‌లోకా.. అబ్బే!

కాంగ్రెస్‌లో చేరబోతున్నానంటూ ప్రకటించి 24 గంటలు గడవకముందే రాజేంద్రనగర్‌ భారాస ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ యూటర్న్‌ తీసుకున్నారు. అబ్బే... కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదంటూ శనివారం అధికారికంగా ప్రకటించారు.

Updated : 21 Apr 2024 06:20 IST

పార్టీ మారడం లేదన్న ప్రకాష్‌గౌడ్‌

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి:  కాంగ్రెస్‌లో చేరబోతున్నానంటూ ప్రకటించి 24 గంటలు గడవకముందే రాజేంద్రనగర్‌ భారాస ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ యూటర్న్‌ తీసుకున్నారు. అబ్బే... కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదంటూ శనివారం అధికారికంగా ప్రకటించారు. పార్టీలో ప్రముఖ స్థానాన్ని కల్పిస్తామని.. నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పాలని భారాస అగ్రనేతలు కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వెచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రకాష్‌గౌడ్‌ సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరించాలని కోరడానికే కలిసినట్లు తెలిపారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే మరోసారి శుక్రవారం సీఎంను కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరే విషయాన్ని పరిశీలించాలని ప్రకాష్‌గౌడ్‌ను కోరారు. దీనికి ఆయన అంగీకరించి కార్యకర్తలతో చర్చించి ప్రకటిస్తానని సీఎంకు చెప్పి వచ్చారు. శుక్ర, శనివారాల్లో పార్టీ శ్రేణులతో సమావేశమై చర్చించారు. చాలామంది నేతలు పార్టీ మారొద్దని, మంత్రి పదవి ఇస్తే మారాలని మరికొందరు సలహా ఇచ్చారు. భారాస అగ్రనేతలు సైతం ఆయనతో మాట్లాడి పార్టీ మారితే సాంకేతిక ఇబ్బందులు తప్పవని వివరించారు. దీంతో ప్రకాష్‌గౌడ్‌ కాంగ్రెస్‌ అగ్రనేతలతోనూ ఎమ్మెల్యే మాట్లాడినట్లు తెలిసింది. తానొక్కడినే చేరితే కోర్టుల ద్వారా అనర్హుడినయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో వెనకంజ వేశారు. భారాస ఎమ్మెల్యేలు ఎక్కువ మంది చేరితే.. కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని ఈనాడు ప్రతినిధితో తెలిపారు.


మారిన వ్యూహం

ప్రకాష్‌గౌడ్‌ వ్యవహారంతో నగరంలోని భారాస ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరే అవకాశం లేదంటున్నారు. రాజధానికి చెందిన ఆరేడుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ అగ్రనేతలు అంతర్గతంగా చర్చలు జరిపారు. వీరంతా హస్తం గూటికి చేరడానికి సుముఖత వ్యక్తం చేశారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికిప్పుడు పార్టీ మారే అవకాశం లేకపోతే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయానికి తోడ్పాటు ఇచ్చేలా అంతర్గత ఒప్పందం కూడా జరిగినట్లు సమాచారం. ఇప్పుడు భారాస ఎంపీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు కొందరు పోలింగ్‌కు ఒకటి, రెండ్రోజుల ముందు కాంగ్రెస్‌ విజయానికి కృషి చేసేలా చర్యలు తీసుకోబోతున్నారని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని