జగనన్న.. గూడు పుఠాణి

అన్నింట్లో అధినేతనే అనుసరించే కొందరు ప్రజాప్రతినిధులు జగనన్న కాలనీలకు భూసేకరణలోనూ చేతివాటం ప్రదర్శించారు. పేదలు నివాసం ఉండే ఇళ్లకు లోతట్టు ప్రాంతాల్లో భూములు సేకరించారు. వాటి మెరక పేరిట మట్టి మెక్కేసి వదిలేశారు.

Updated : 22 Apr 2024 06:21 IST

లోతట్టు ప్రాంతాల్లో స్థలాల సేకరణ
నేతల కాసుల యావతో కష్టాలు
కట్టుకున్న పేదలు అప్పుల్లో ‘మునిగారు’
ముంపుభయంతో నిర్మాణాలకు దూరం

సెంటు భూమిలో అర్హులైన పేదలకు ఇళ్లు కట్టిస్తాం. మీ సొంతింటి కలను నిజం చేస్తాం. ఏకంగా టౌన్‌షిప్‌లనే నిర్మిస్తాం.

ఇదీ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా, సీఎంగా వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలు


ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే, మేడికొండూరు, వట్టిచెరుకూరు, తెనాలి(కొత్తపేట)

అన్నింట్లో అధినేతనే అనుసరించే కొందరు ప్రజాప్రతినిధులు జగనన్న కాలనీలకు భూసేకరణలోనూ చేతివాటం ప్రదర్శించారు. పేదలు నివాసం ఉండే ఇళ్లకు లోతట్టు ప్రాంతాల్లో భూములు సేకరించారు. వాటి మెరక పేరిట మట్టి మెక్కేసి వదిలేశారు. ఫలితంగా పునాది నిర్మాణానికే లబ్ధిదారుల వద్ద కాసుల నిల్వలు నిండుకున్నాయి. వర్షం వస్తే లేఔట్లు చెరువులను తలపిస్తున్నాయి. సొంతంగా కట్టుకోలేని వారి నుంచి ఆప్షన్‌ తీసుకుని ప్రభుత్వమే గుత్తేదారుతో నిర్మాణాలు ప్రారంభించింది. ఆ ఇళ్లూ నాసిరకంగా చేపట్టారు.. కదిపితే పడిపోయేలా పునాదులు తీశారు.. సొంతంగా ఇళ్లు కట్టుకున్న వారు అక్కడ ఉండలేక.. అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. సొంతింటిపై వారు కన్న కలలు కల్లలయ్యాయి.

ఇదీ వట్టిచెరుకూరు మండలం చమళ్లపూడి గ్రామంలో వేసిన జగనన్న లేఔట్‌. ఇక్కడ 2.25 ఎకరాల్లో సుమారు 100 మందికిపైగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వర్షం పడిన ప్రతిసారి ఇంటి చుట్టూ నీళ్లు చేరుతున్నాయి. రోడ్లు బురదమయంగా మారి బయటకు అడుగుపెట్టలేని దుస్థితి నెలకొంది.


ఇదీ వట్టిచెరుకూరు మండలం కర్నెపాడు గ్రామంలో 333  ఎకరాల్లో వేసిన జగనన్న లేఔట్‌. గుంటూరు నగరంలోని 16వేల మంది లబ్ధిదారులకు ఇందులో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఇక్కడ ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేపట్టకపోవడం గమనార్హం.


అడవికాసిన వెన్నెల..

ఇదీ వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో 135 ఎకరాల్లో లోతట్టు ప్రాంతంలో వేసిన లేఔట్‌. 2020లో ఎకరా రూ.52లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. రూ.5కోట్లు వెచ్చించి లేఔట్‌ అంతా విద్యుత్తు స్తంభాలు వేశారు. తీగలు లాగారు. ఒక్క ఇల్లూ లేకపోయినా వీధి దీపాలు రాత్రీపగలు వెలుగుతూనే ఉంటాయి. ఇక్కడ గుంటూరు నగరానికి చెందిన సుమారు 6500 మంది పేదలకు సెంటు చొప్పున స్థలాలు ఇవ్వాల్సి ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు, గుంటూరు నగరానికి చెందిన ప్రజాప్రతినిధికి మధ్య విభేదాలు రావడంతో పట్టాల పంపిణీ మధ్యలోనే నిలిచిపోయింది. ఇచ్చిన వారికీ ఎవరి స్థలం ఎక్కడో తెలియదు.నాలుగేళ్లుగా ఇలా వదిలేశారు. చూశారుగా ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి ఏపాటిదో.

రైతుల నుంచి కమీషన్లు..

జిల్లాలో రాజధాని అమరావతి రాకతో భూముల ధరలు బాగా పెరిగాయి. బహిరంగ మార్కెట్‌లో రాజధాని పరిసర మండలాల్లో ఎకరం రూ.కోటికి పైగా పలికింది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ విలువ కూడా పెంచింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులతో మూడు ముక్కలాట ఆడడంతో జిల్లాలో బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జగనన్న కాలనీల నిర్మాణానికి భూసేకరణ చేపట్టింది. రిజిస్ట్రేషన్‌ విలువ ఎక్కువగా ఉండడం, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ విలువకు 2.5రెట్లు సొమ్ము కలిపి చెల్లిస్తారు. బహిరంగ మార్కెట్‌లో రూ.30లక్షలు ఉన్న భూమికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూసేకరణలో రూ.60లక్షలు పైగా సొమ్ము రైతులకు అందింది. దీన్ని గుర్తించిన ప్రజాప్రతినిధులు ముడుపులు ఇస్తేనే భూములు కొంటామని మెలికపెట్టారు. గుంటూరు రెవెన్యూ డివిజన్‌లో ఎకరాకు గరిష్ఠంగా రూ.1.01 కోట్లు వెచ్చించారు. రైతుల వద్దా కమీషన్లు కొట్టేశారు.

చదునులోనూ నేతల మేత

ఫిరంగిపురం: కాలువలు లేక రోడ్డుపైకి వస్తున్న మురుగు నీరు

జిల్లాలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి సేకరించిన భూములు లోతట్టు ప్రాంతంలో ఉండడంతో మట్టి తోలి ఎత్తు చేయడానికి ఎకరాకు రూ.6లక్షలు వెచ్చించారు. భూముల చదును పనులు అరకొరగా చేసి బిల్లులు చేసుకున్నారు. ఒక్క తెనాలి నియోజకవర్గంలోనే ఓ కీలక నేత రూ.20కోట్లకు పైగా జేబులో వేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాడికొండ, ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లోనూ ఇదే విధంగా నేతలు లబ్ధి పొందారు. జిల్లాలో సింహభాగం లేఔట్లు లోతుట్టుగా ఉండడంతో ఇళ్ల నిర్మాణాలు మొదలుకాలేదు.

ఇంటి నిర్మాణం ఇంతింతకాదయా!

మేడికొండూరు: పేరేచర్లలో పునాది దశలోనే శిథిలమైన నిర్మాణాలు

సొంతంగా ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.8లక్షలు ఏమాత్రం చాలని పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఇచ్చిన స్థలాలు లోతట్టు ప్రాంతంలో ఉన్నాయి. పునాది 4 నుంచి 5 అడుగుల ఎత్తులో నిర్మించుకోవాల్సి వస్తోంది. పునాది నిర్మాణం తర్వాత మట్టితో పూడ్చుకోవడానికి ఖర్చు పెరిగిపోతోంది. సిమెంట్‌, ఇటుక, ఇనుము, కంకర, కూలీ ధరలు పెరగడం లబ్ధిదారులకు శాపంగా మారింది. అర్హులందరూ పేదలు కావడంతో కూలి పనులు ద్వారా వచ్చే మొత్తం కుటుంబ అవసరాలకే చాలని పరిస్థితి. ఇళ్లు కట్టుకోకపోతే స్థలం వెనక్కి తీసుకుంటామని అధికారులు బెదిరించడంతో అప్పులు చేసి నిర్మాణాలు ప్రారంభించారు. పునాది నిర్మాణానికే చేతిలో ఉన్న సొమ్ములు అయిపోవడంతో ఇల్లు పూర్తి చేసేదేలా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

డబ్బులు ఇచ్చి ఎదురుచూస్తే కాని నీరు రాని దుస్థితి

ట్యాంకరు నీటికి నెలకు రూ.4వేలు

షేక్‌ రహిమాబ్‌, ఫిరంగిపురం జగనన్న కాలనీవాసి

ఇంటింటికీ కుళాయి పనులు పూర్తి చేయలేదు. ముందుగా వేసిన ప్రధాన పైపులైన్లు దెబ్బతిన్నాయి. నాలుగు నెలలుగా తాగు నీరు సరఫరా చేయడం లేదు. వెయ్యి లీటర్ల ట్యాంకర్‌ నీటిని రూ.400 చొప్పున కొనుగోలు చేసుకుంటున్నాం. డ్రమ్ముల్లో నిల్వ చేసిన నీరు మూడు రోజుల్లో అయిపోతోంది.  నెలకు పది ట్యాంకర్లకు రూ.4వేలు ఖర్చవుతోంది.


ఆటో, బస్సు సదుపాయం లేదు

ఆసిఫ్‌, పెదరావూరు లేఔట్‌, తెనాలి

వానాకాలంలో లేఔట్‌ నుంచి బయటకు వెళ్లలేం, లోపలికి రాలేం. అంతా బురద. విద్యుద్దీపాలు పూర్తి స్థాయిలో వేయలేదు. ఇక్కడి నుంచి వెళ్లలన్నా, రావాలన్నా సొంత వాహనాలు ఉంటేనే. ఆటో, బస్సు సదుపాయం లేదు. సొంత వాహనాలు లేని వారు నడిచి వెళ్లాల్సిసిందే.


వర్షం పడితే రోడ్డు మునకే

జగనన్న కాలనీ వాసి, ఫిరంగిపురం

ఫిరంగిపురం జగనన్న కాలనీ లోతట్టు ప్రాంతంలో ఉంది. సమీపంలోని ప్రధాన రోడ్డు 4 అడుగుల ఎత్తు ఎక్కువగా ఉంది. వర్షాలు కురిసినప్పుడు నీరు ఇళ్లల్లోకి వస్తుందనే భయంతో పునాది ఎత్తు పెంచాం. దీంతో అదనపు భారం పడింది. ప్రభుత్వం ఇచ్చిన రూ.1.8లక్షలు పునాదికే సరిపోయాయి. మురుగు కాలువలు కట్టలేదు. నీళ్లు ముందుకుపోవడం లేదు. వర్షాలకు అంతర్గత రోడ్లు దెబ్బతిన్నాయి. రాకపోకలకు ఇబ్బందిగా ఉంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని