కమిటీల పేరుతో కాలయాపన

ప్రతి అయిదేళ్లకు ఒక సారి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడం ఆనవాయితీ. ఒకవేళ ఇది ఆలస్యమైతే ఐఆర్‌ (మధ్యంతర భృతి) ప్రకటిస్తుంది.

Updated : 22 Apr 2024 06:15 IST

ఐఆర్‌ రద్దు చేసిన వైకాపా ప్రభుత్వం
ఉద్యోగుల మండిపాటు
మాచవరం, న్యూస్‌టుడే

ప్రతి అయిదేళ్లకు ఒక సారి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడం ఆనవాయితీ. ఒకవేళ ఇది ఆలస్యమైతే ఐఆర్‌ (మధ్యంతర భృతి) ప్రకటిస్తుంది. ప్రస్తుత ఎన్నికల ముందు ప్రకటించే 12వ పీఆర్సీ నివేదిక కోసం గత ఏడాది జులైలో మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీ.. తమ నివేదికను ఈ ఏడాది జూన్‌ 30వ తేదీలోపు ముఖ్యమంత్రికి అందించాల్సి ఉంది. కమిటీని నియమించారే కానీ.. విధులు నిర్వర్తించేందుకు కార్యాలయం, సిబ్బందిని కేటాయించకపోవడం దారుణం. పలు ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేయగా.. ఈ ఏడాది మార్చిలో సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఏర్పాటై పది నెలలు గడిచినా.. ఇంత వరకు సదరు కమిటీకి కార్యాలయం కేటాయించకపోవడంతో ఛైర్మన్‌ ఒక్క రోజు కూడా సీటులో కూర్చోలేదు.

ఉద్యోగులు ఐఆర్‌ అడుగుతుంటే.. ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఎత్తివేసింది. జూన్‌ నెలలో పీఆర్సీ నివేదిక వస్తుంది.. ఇక ఐఆర్‌ ఎందుకంటూ వాదిస్తోంది. రాష్ట్రంలోని 11 లక్షల మంది ఉద్యోగులు ఐఆర్‌ వస్తుందని.. కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఐఆర్‌ ఎత్తివేయడంతో వారి ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. గత తెదేపా ప్రభుత్వంలోనూ జులై, 2018లో 11వ పీర్సీకి కమిషన్‌ను నియమించి.. ఏడాది గడువుతో నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు వెల్లడించింది. నివేదికను సిద్ధం చేసిన కమిషన్‌.. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం 2022లో పీఆర్సీ నివేదికను కోరింది. గత తెదేపా ప్రభుత్వం 20 శాతం ఐఆర్‌ ఇస్తుండగా.. అధికారంలోకి వస్తే 27 శాతం ఇస్తామని వైకాపా ఎన్నికల ముందు ప్రకటించింది. ఫిట్‌మెంట్‌లో నాలుగు శాతంతో పాటు హెచ్‌ఆర్‌ఏలోనూ నాలుగు శాతం తగ్గించి రివర్స్‌ పీర్సీ అని పేరు తెచ్చుకున్న ఘనత వైకాపాదే.

నివేదికపై ఒక్క అడుగు పడలేదు

12వ పీఆర్సీ నివేదికపై ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కమిషన్‌కు కార్యాలయమే కేటాయించకుండా నివేదిక సాధ్యమేనా అని పలు ఉద్యోగ సంఘాలు గళమెత్తుతున్నాయి. కమిషన్‌ ఏర్పాటై పది నెలలు గడిచింది. మరో రెండు నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. 30 శాతం ఐఆర్‌తోపాటు కొత్తగా రెండు డీఏలు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగులు, పింఛనర్లకు మధ్యంతర భృతిపై సర్కారు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆందోళన చెందారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఐఆర్‌ ప్రకటిస్తారని ఆశించారు. పన్నెండో పీఆర్సీ ఏర్పడకపోవడం, కనీసం ఐఆర్‌పైనా నిర్ణయం వెలువడకపోవడంతో ఉద్యోగులు, పింఛనుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


ధరలతో సతమతం

- ఓ కింది స్థాయి ఉద్యోగి, గుణదల

రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్‌ ఎత్తివేయడం వల్ల సుమారు నెలకు రూ.5వేలు నష్టపోయాను. ప్రస్తుత నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఐఆర్‌ ఇస్తే కుటుంబానికి కొంత ప్రయోజనకరంగా ఉండేది.


నెలకు రూ.15వేలు నష్టం

  - ఓ ఉద్యోగి, మాచవరం

ఉద్యోగులకు ఐఆర్‌ ఎత్తివేయడం దారుణం. నెలకు సుమారు రూ.15వేలు నష్ట పోయాను. ఇంటిపై తీసుకున్న రుణం చెల్లించేందుకు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీనికి తోడు వైకాపా ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏ కూడా తగ్గించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని