‘నమాజు సమయంలో మమ్మల్ని గుర్తుపెట్టుకోండి’

ఎన్నికల్లో మతపరమైన అంశాలతో ప్రచారం చేయకూడదనే కఠిన నిబంధనలున్నా.. వైకాపా నేతలకు మాత్రం వర్తించడం లేదు. విచ్చలవిడిగా మతపరమైన అంశాలను జోడించి ప్రచారం చేస్తున్నారు.

Updated : 22 Apr 2024 06:14 IST

ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో మతపరమైన అంశాలతో ప్రచారం చేయకూడదనే కఠిన నిబంధనలున్నా.. వైకాపా నేతలకు మాత్రం వర్తించడం లేదు. విచ్చలవిడిగా మతపరమైన అంశాలను జోడించి ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నియోజకవర్గ వైకాపా అసెంబ్లీ అభ్యర్థి జగన్మోహనరావు తరఫున అతని తమ్ముడు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ సామాజిక వర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. అన్నను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. నందిగామ ఓసీ క్లబ్‌లో నూర్‌ బాషా ముస్లింలతో అరుణ్‌కుమార్‌ ప్రత్యేక సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లా పేరు చెప్పి వారిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు.

అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘మీ ప్రార్థనలు, అల్లా దయ మా మీద ఉండాలి. మీరు మీ నమాజు సమయంలో మమ్మల్ని గుర్తు పెట్టుకోండి. ప్రజలకు మంచి చేస్తాం. సేవ చేయండి, ప్రేమను పంచండి.. అల్లా చెప్పిన సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటాం. తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తాం.’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతోంది.. ఎన్నికల ప్రచారంలో మతపరమైన అంశాలను ప్రస్తావించడం నేరం. పెనమలూరులోనూ వైకాపా అభ్యర్థి జోగి రమేష్‌ ఇలాగే.. పాస్టర్లతో సమావేశం నిర్వహించి.. ‘ఏసు బిడ్డ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలి’ అంటూ వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. దీనిపై ఎన్నికల అధికారులకు కూడా ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి.

ఇన్నాళ్లూ ఏం చేసినట్టు?

నూర్‌ బాషా ముస్లింలలో రాజకీయంగా ఎవరికీ పెద్దగా పదవులు లేవని, అత్యధిక మంది ఆర్థికంగా వెనుకబడిన వాళ్లేనని తాను తెలుసుకున్నట్టు అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. అందుకే.. తమను గెలిపిస్తే వాళ్లందరికీ మేలు చేస్తానని, వారి పక్షాన నిలబడి సేవ చేస్తానంటూ చెప్పడంపై.. ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల వైకాపా పాలనలో తమను పట్టించుకోకుండా వదిలేసి, ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే మేలు చేస్తానంటూ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందంటూ నూర్‌ బాషా ముస్లింలే విమర్శిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని