ముడాపై మురిసిన తోడేళ్లు..!

మట్టి, ఇసుక, బుసక పేరిట వైకాపా శ్రేణులు దోపిడీకి పాల్పడుతున్నా ఎలాంటి చర్యలు ఉండవు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పోర్టు అవసరాల కోసం తెదేపా ప్రభుత్వం రైతుల భూములను కొనుగోలు చేస్తే...

Updated : 22 Apr 2024 06:11 IST

భూముల్లో మట్టి దందా
దండుకున్నది రూ.50 కోట్లపైనే
మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే

అకమ్రాలు, దళారీ వ్యవస్థలతో ప్రమేయం లేకుండా అవినీతి రహిత పాలన అందిస్తున్న ఘనత దేశం మొత్తం మీద మా ప్రభుత్వానిదే ... అవినీతి అన్న పదానికి తావే లేదు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

లా పదే పదే సీఎం జగన్‌ తనకు తానే కితాబు ఇచ్చుకోవడం తెలిసిందే. సొంత పార్టీకి చెందిన నేతలే దారుణంగా అవినీతికి పాల్పడుతూ రూ. కోట్లు వెనకేసుకుంటున్నా కిమ్మనని జగన్‌ దానికి మాత్రం సమాధానం చెప్పరు. కళ్లముందు దోచుకుంటున్నా.. అదేమీ తనకు కనిపించనట్లు , అవినీతి అనేమాటకు తావు లేనట్లు మాటలు వల్లెవేస్తుంటారు.

ట్టి, ఇసుక, బుసక పేరిట వైకాపా శ్రేణులు దోపిడీకి పాల్పడుతున్నా ఎలాంటి చర్యలు ఉండవు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పోర్టు అవసరాల కోసం తెదేపా ప్రభుత్వం రైతుల భూములను కొనుగోలు చేస్తే... అధికార యంత్రాంగాన్ని ప్రేక్షక పాత్రకే పరిమితం చేసి సదరు ప్రభుత్వ భూముల నుంచే రూ.కోట్ల విలువైన మట్టి దోపిడి కొనసాగిస్తూ ఉండడం వైకాపా అరాచకాలకు నిదర్శనంగా చెప్పవచ్చు.

మచిలీపట్నం పోర్టు నిర్మాణ అవసరాల కోసం తెదేపా ప్రభుత్వం ల్యాండ్‌ పూలింగ్‌తో పాటు ఎకరా రూ.25 లక్షల చొప్పున రైతుల నుంచి భూములు కొనుగోలు చేసింది. మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ(ముడ) ద్వారా కరగ్రహారం, మంగినపూడి, తపసిపూడి, మేకావానిపాలెం, పోతేపల్లి, తదితర గ్రామాల పరిధిలో సేకరించిన దాదాపు 1,200 ఎకరాల భూములను ఏపీ మారిటైంబోర్డుకు అప్పగించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ప్రభుత్వ భూముల్లోనే పోర్టు నిర్మిస్తామని స్పష్టం చేయడంతో ముడ ద్వారా కొనుగోలు చేసిన భూములను స్థానిక అధికార పార్టీ నాయకులు ఆదాయ వనరులుగా మార్చేసుకున్నారు. అధికారపార్టీ అండతో భూములు ప్రభుత్వానివైనా అనధికారికంగా కొంత విస్తీర్ణంలో వరి, వేరుశనగ, కూరగాయల సాగుతో పాటు సరుగుడు తోటలు వేసి ఆర్థిక లబ్ధి పొందారు. ఇది బహిరంగ రహస్యమే అయినా అధికారులు మాత్రం స్పందించలేదు.


జగనన్న లేఔట్ల సాకుతో..

పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ఇచ్చిన జగనన్న లేఔట్లను మెరక సాకుతో దాదాపు రెండు సంవత్సరాలుగా వైకాపాకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు మట్టి దందాకు శ్రీకారం చుట్టారు. మచిలీపట్నంతో పాటు పరిసరప్రాంతాల మెరక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అసైన్డ్‌భూముల్లో మట్టిని నయానో భయానో కొల్లగొట్టేశారు. అవన్నీ ఖాళీ కావడంతో మరింత లాభాపేక్షతో ఏకంగా ముడ ద్వారా సేకరించిన ప్రభుత్వ భూములపై వారి కన్నుపడడంతో ఆమేరకు పావులు కదిపారు. ఏడాదిన్నర కాలంగా రాత్రి పగలు అన్నతేడా లేకుండా ముడ భూముల నుంచి అక్రమంగా మట్టిని దోచేస్తున్నారు. కేవలం నలుగురు వ్యక్తుల అదుపాజ్ఞల్లో మట్టి దోచేసి రూ.50 కోట్ల వరకూ దండుకున్నారంటే మొత్తం మీద దందా ఏమేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు.


ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనా...

మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసినా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మట్టి దందాను ఆపలేదు. మేకావానిపాలెం సమీపంలోని ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేసి పెద్ద ఎత్తున మట్టి నిల్వచేసే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. ఈ హంగామాను భరించలేని స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలను నియమించాల్సి వచ్చింది. మట్టి దందాకు సంబంధించిన వివరాలు, ఆనవాళ్లు సేకరించిన ప్రతిపక్ష నాయకులు ఉన్నతస్థాయిలో దర్యాప్తు కోరనున్నారు.


దోపిడీ ఆగడం లేదు

- శ్రీపతి వాకాలరావు, గోపువానిపాలెం

తీరప్రాంత గ్రామాల భద్రతనే ప్రశ్నార్థకం చేసేలా సాగుతున్న మట్టిదోపిడిని అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేటికీ ఫలితం లేదు. ఏడాది క్రితం ఇదే విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. మచిలీపట్నం వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు వినతిపత్రం అందజేశాం. ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా ఈ దందా ఆగడం లేదు.  


రూ. కోట్లు కొల్లగొట్టేశారు

- వై.వెంకటేశ్వరరావు, కరగ్రహారం

అధికార పార్టీ ముసుగులో కొందరు నాయకులు రూ. కోట్ల విలువచేసే మట్టిని కొల్లగొట్టేశారు. రైతువారీ భూముల్లో మెరకలు సరిచేసుకునేందుకు అనుమతులు అడిగే రెవెన్యూ సిబ్బంది సంవత్సరాల తరబడి ప్రభుత్వ భూముల్లో మట్టి కాజేస్తున్నా చోద్యం చూస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని