ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..

సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్‌... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి.

Updated : 23 Apr 2024 06:15 IST

అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ సాధించేందుకు పార్టీల కసరత్తు

న్యూస్‌టుడే-మెదక్‌: సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్‌... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగానే ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించగా, ఈనెల 25న సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభ, వచ్చే నెల 7, 8 తేదీల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో భారాస అధినేత కేసీఆర్‌ ప్రచారం చేయనున్నారు. ఈ స్థానంపై అన్ని పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లను సాధించాలనే కృతనిశ్చయంతో పార్టీలు ముందడుగు వేస్తున్నాయి. పోలింగ్‌ బూత్‌ వారీగా కార్యాచరణను రూపొందించుకొని ప్రజలను నేరుగా కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నాయి.

ప్రత్యేక దృష్టిపెట్టిన నేతలు

మెదక్‌ లోక్‌సభ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇందిరాగాంధీ ఇక్కడి నుంచే ఎంపీగా గెలుపొంది ప్రధాని పదవిని చేపట్టడంతో దేశ వ్యాప్తంగా ఈ స్థానం ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇక్కడిను నుంచి అత్యధికసార్లు కాంగ్రెస్‌ పార్టీ గెలవగా, ఆ తర్వాత భారాస(నాటి తెరాస) అభ్యర్థులు విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో ఆరుగురు భారాసకు చెందిన ఎమ్మెల్యేలు గెలవగా, మెదక్‌లో మాత్రం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గెలుపొందారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేల ప్రాతినిథ్యం వల్ల తమకే విజయావకాశాలు ఉన్నాయని భారాస భావిస్తుండగా, రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో ప్రజలు తమ వైపు మొగ్గుచూపుతారని హస్తం పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. ఇక కేంద్రంలో మరోసారి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుకు పట్టం కట్టనున్నారనే భావన భాజపా నేతల్లో ఉంది.

బూత్‌ స్థాయిలో ప్రచారం...

పోలింగ్‌ బూత్‌ల వారీగా ఆయా పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. బూత్‌ అధ్యక్షులతో పాటు సమన్వయకర్తలను నియమించారు. ఓటరు జాబితాలు తీసుకొని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే భాజపా ఈ కార్యక్రమం చేపట్టగా, భారాస ఆయా సెగ్మెంట్లలో బూత్‌ స్థాయి ఇన్‌ఛార్జులను నియమిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ సైతం ఒక్కో బూత్‌కు ముగ్గురు నాయకులను నియమించి ప్రచారంలో ముందుకు సాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వివరాలను పోలింగ్‌ కేంద్రాల వారీగా విశ్లేషిస్తూ అభ్యర్థులు ప్రచార వ్యూహాలను రచిస్తున్నారు. ఓట్లు తక్కువగా వచ్చిన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్ల శాతాన్ని కూడా పరిశీలిస్తూ మెరుగ్గా ఫలితం వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ప్రణాళికలు రచించి..

గత అసెంబ్లీ ఎన్నికల కంటే ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించేలా పక్కా వ్యూహంతో పార్టీలు ముందుకెళ్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లలో భారాసకు అత్యధిక ఓట్లు రాగా, 2023 వచ్చే సరికి ఓట్లు తగ్గాయి. 2018 కంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా ఓట్ల శాతం మెరుగుపడింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భారాస, ఓట్ల దక్కించుకోవడంలో ముందు వరుసలో నిలవగా, ఆ తర్వాత కాంగ్రెస్‌, భాజపా నిలిచాయి. 2014 ఉప ఎన్నిక వచ్చే సరికి భారాస, కాంగ్రెస్‌కు ఓట్లు తగ్గి, భాజపాకు పెరిగాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలకు మద్దతు పెరిగింది. ఈసారి జరిగే ఎన్నికల్లో సైతం అత్యధిక ఓట్లు సాధించాలనే పట్టుదలతో అన్ని పార్టీలు ఉన్నాయి. ఈ మేరకు ప్రణాళికలు రచించి, అస్త్రాలను ఉపయోగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని