పాటలతో రీల్స్‌.. మాటలతో మీమ్స్‌

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు.

Updated : 23 Apr 2024 05:41 IST

 సామాజిక మాధ్యమాల్లో వినూత్న ప్రచారం

ఒక్కో అభ్యర్థికి ప్రత్యేక సోషల్‌  మీడియా విభాగం

  ఈనాడు, వరంగల్‌: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. ప్రస్తుతం నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటున్న రీల్స్‌ను విరివిగా వాడుకుంటున్నారు. వీటిని మామూలుగా కాకుండా ఆయా సందర్భాలకు తగ్గట్టు సినిమా పాటలు వేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్‌, మహబూబాబాద్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌, భాజపా, భారాస అభ్యర్థుల సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 

 ‘తెల్లాతెల్లారి పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా’..

బలగం సినిమాలో ప్రముఖ గాయకుడు రామ్‌మిరియాల పాడిన ఈ పాట ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల పల్లె పాటగా మారింది. దీన్ని రీల్‌గా చేసి సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉగాది, అంబేడ్కర్‌ జయంతి, శ్రీరామనవమి.. ఇలా ఏ ప్రత్యేక సందర్భం వచ్చినా అందిపుచ్చుకుంటున్నారు.  ప్రచారాస్త్రాలుగా మలచుకుంటున్నారు.

‘అభ్యర్థులు ఓవైపు రీల్స్‌తో ప్రచారాన్ని హుషారెత్తిస్తూనే మరో వైపు ప్రత్యర్థులు, ఎదుటి పార్టీలను విమర్శించేందుకు   మీమ్స్‌ను వాడుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్‌లోని వరంగల్‌, మానుకోట లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యేకంగా సోషల్‌మీడియా విభాగాలను తమ కార్యాలయాల్లో ఏర్పాటుచేసుకుని ప్రచారంలో వైవిధ్యాన్ని చూపేందుకు ప్రయత్నిస్తున్నారు.’

జోరుగా జోకులు

అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక మంది నేతలు పార్టీలు మారుతున్నారు. వీరిపై జోరుగా మీమ్స్‌ రూపొందిస్తున్నారు. పాత పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడిన వీడియోలకు సినిమాల్లోని హాస్యనటుల డైలాగులను జోడిస్తూ వారిపై సెటైర్లు పేలుస్తున్నారు. నేతలు బాగా నటించగలరని చెప్పేందుకు మహానటి టైటిల్‌ సాంగ్‌తోపాటు, హాస్య నటులు బ్రహ్మానందం, రావురమేశ్‌తోపాటు, పలువురి డైలాగులను సందర్భానుసారంగా వాడుకుంటూ నేతలు సామాజిక మాధ్యమాల ద్వారానే విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి మీమ్స్‌ను నెటిజన్లు సైతం పోస్టులుగా పెట్టుకుంటున్నారు.
ఇలా సినిమా పాటలను రీల్స్‌గా, డైలాగులను మీమ్స్‌గా రూపొందించడం వల్ల నెటిజన్లు పోస్టును మొత్తం వీక్షించి, లైక్‌ చేసే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు, అభ్యర్థులు చెబుతున్నారు.


వరంగల్‌లో..
వరంగల్‌ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌ సోషల్‌ మీడియా బృందంలో పది మంది వరకు చురుగ్గా పనిచేస్తున్నారు. నిత్యం సమావేశాలు, ర్యాలీలు, బహిరంగ సభలు జరిగిన వెంటనే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. లోక్‌సభ పరిధిలో గ్రామ, మండల, అసెంబ్లీ సెగ్మెంట్, లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో సుమారు వెయ్యి వాట్సప్‌ గ్రూప్‌లను రూపొందించి ఎప్పటికప్పుడు షెడ్యూలు, ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని అందులో పోస్టు చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి పలు రకాల వీడియోలను రూపొందించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా రమేశ్‌ పలు చోట్ల కల్యాణోత్సవాల్లో పాల్గొన్న వీడియో దృశ్యాలకు ‘హనుమాన్‌’ సినిమాలోని ‘రఘునందన రఘురఘునందన రఘువర సేవన’ పాటను జతచేసి రీల్‌గా మార్చి ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిళ్లలో పోస్టు చేశారు. పల్లె ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్న ఓ వీడియోకు బలగం సినిమాలోని తెల్లాతెల్లారి పాలధారలల్ల’ పాటతో ముడిపెట్టారు. అంబేడ్కర్‌ జయంతి రోజున పాల్గొన్న కార్యక్రమాలకు ‘జై భీం అని గొంతెత్తి నినదించాలో’ అనే పాటతో వీడియోను రూపొందించారు. సోషల్‌మీడియా ద్వారా యువతను ఆక్టుకునేందుకు అనేక మీమ్స్‌ను కూడా తయారుచేస్తున్నారు.
వరంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య సైతం సామాజిక మాధ్యమాల్లో చురుగ్గానే ఉంటున్నారు. శ్రీరామనవమి రోజు పాల్గొన్న కార్యక్రమాల్లో ‘హనుమాన్‌’ చిత్రంలోని ‘జయ హనుమాన జ్ఞానగుణసాగర’ అనే పాటతో ఓ రీల్‌ను రూపొందించి వివిధ సామాజిక మాధ్యమాల్లోని తన ఖాతాల్లో పోస్టు చేయించారు. మరో సందర్భంలో  వకీల్‌సాబ్‌లోని ‘మగువా మగువా’ పాటతో రీల్‌ చేసి పోస్టు చేశారు. కావ్య సోషల్‌మీడియా వింగ్‌లో 30 మంది వరకు పనిచేస్తున్నారు.  
వరంగల్‌ భారాస అభ్యర్థి డాక్టర్‌ మారపల్లి సుధీర్‌కుమార్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్టుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. శ్రీరామ నవమికి శ్రీరామరాజ్యంలోని ‘జగదానందకారక’ పాట జత చేసి రీల్‌ చేశారు. ఉగాది, రంజాన్‌  పండగల సందర్భంగా సామాజిక వేదికలను ఉపయోగించుకున్నారు.


మానుకోటలో..
కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌ ‘ఎక్స్‌’, ‘ఫేస్‌బుక్‌’లలో ఇటీవల పలు సందర్భాల్లో వీడియోలను పోస్టు చేశారు. రంజాన్‌ పండగ రోజు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపే దృశ్యాలతో పాటు, ఓ సినిమాలోని ‘మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్‌’ అనే డైలాగును జతచేస్తూ రీల్‌ చేసి పెట్టుకున్నారు. మహాశివరాత్రి, మహిళా దినోత్సవం, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానుకోటలో పాల్గొన్న సభ దృశ్యాలను ఎప్పటికప్పుడు పోస్టు చేస్తున్నారు.
భారాస అభ్యర్థిని మాలోతు కవిత సైతం రీల్స్‌ ఉత్సాహంగా చేస్తున్నారు. రజనీకాంత్‌ చిత్రం నరసింహ సినిమాలోని ‘సింగమల్లె నువ్వు శిఖరము చేరూ’ పాటతో సామాజిక మాధ్యమాల్లో తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు.
భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్‌ ప్రత్యేక ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచారు. ఇందులో మోదీకి సంబంధించిన దృశ్యాలతో సింగమల్లె నువ్వు శిఖరము చేరూ పాటతోనే రీల్‌ తయారుచేశారు. ఛత్రపతి శివాజీ జయంతి, శ్రీరామ నవమి తదితర వేడుకలను పురస్కరించుకొని పాటలతో వీడియోలను పోస్టు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని