ఫోన్‌ తీయట్లేదని.. చంపేశాడట

తన ప్రేమను నిరాకరించిందంటూ హుబ్బళ్లిలో అంజలి (19) అనే యువతిని మూడు రోజుల కిందట హత్య చేసిన నిందితుడు విశ్వ అలియాస్‌ గిరీశ్‌ (21) మరో హత్య చేసేందుకు తెగించి.. దొరికిపోయాడు.

Updated : 18 May 2024 09:47 IST

అంజలి హత్యకేసులో విషాద కోణం
రైల్లో నుంచి దూకి.. దొరికిన నిందితుడు

హత్యకు గురైన అంజలి.. , నిందితుడు గిరీశ్‌ 

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : తన ప్రేమను నిరాకరించిందంటూ హుబ్బళ్లిలో అంజలి (19) అనే యువతిని మూడు రోజుల కిందట హత్య చేసిన నిందితుడు విశ్వ అలియాస్‌ గిరీశ్‌ (21) మరో హత్య చేసేందుకు తెగించి.. దొరికిపోయాడు. దావణగెరె సమీపాన ‘విశ్వమానవ ఎక్స్‌ప్రెస్‌’లో ప్రయాణిస్తూ తుమకూరుకు చెందిన ఒక ప్రయాణికురాలితో గొడవకు దిగి చిక్కుల్లో పడ్డాడు. కత్తితో ఆమెపై దాడి చేస్తుండగా, సహ ప్రయాణికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రైలు నుంచి గురువారం రాత్రి మాయాకొండ స్టేషన్‌కు సమీపంలోనే కిందకు దూకి గాయపడ్డాడు. దావణగెరె రైల్వే పోలీసులు అతన్ని చికిత్స కోసం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అతని వివరాలను సేకరిస్తున్న సమయంలోనే అంజలిని హత్య చేసిన హంతకుడు ఇతనేనని గుర్తించారు. హుబ్బళ్లి పోలీసులకు సమాచారం అందించగా.. అతన్ని గురువారం రాత్రి అదుపులోనికి తీసుకుని, చికిత్స కోసం కిమ్స్‌కు తరలించారు. హుబ్బళ్లి-ధార్వాడ పోలీసు కమిషనర్‌ రేణుకా సుకుమార కిమ్స్‌కు వచ్చి వైద్యుల నుంచి చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని తీసుకున్నారు. నిందితుని తల, వెన్నుకు తీవ్ర గాయాలు కావడంతో నిందితుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడని చెప్పారు. హత్య అనంతరం విశ్వ మైసూరుకు చేరుకున్నాడు. గోవా, మహారాష్ట్రలకు వెళ్లేందుకు మళ్లీ రైలు ఎక్కి దావణగెరె మార్గంలో వెళుతూ ఇలా దొరికిపోయాడు. నాలుగు బైకులు దొంగిలించిన కేసులు అతనిపై ఉన్నాయి. హత్య అనంతరం చరవాణి వినియోగించకపోవడంతో అతన్ని గాలించటం కష్టమైంది. అతని మిత్రులూ నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది. దావణగెరె పోలీసులకు చిక్కిన సమయంలో.. అంజలిని నేనేమీ చంపలేదని బుకాయించాడు.

కఠిన చర్యలు..

అంజలిని హత్య చేసిన హంతకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి డాక్టర్‌ పరమేశ్వర్‌ తెలిపారు. పోలీసు ఠాణాలో మౌఖిక ఫిర్యాదు చేయడంతోనే అంజలి నాయనమ్మ గంగమ్మ ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదన్నారు. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తించి ఇప్పటికే ఇద్దరిని సస్పెండ్‌ చేశామని గుర్తు చేశారు. ఏడీజీపీ స్థాయి అధికారిని హుబ్బళ్లికి పంపించగా, అక్కడి నుంచి తనకు నివేదిక పంపించారని చెప్పారు. త్వరలో తాను హుబ్బళ్లికి వెళ్లి అంజలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానని తెలిపారు.

అధికారం వీడండి..

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆరోపించారు. ప్రజలకు భద్రత కల్పించలేకపోతే ముఖ్యమంత్రి, మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. ఎవరికీ భయం లేకపోవడంతోనే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు. నేహా హత్య అనంతరమూ జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అంజలి హత్యకు గురైందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా, పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. విపక్షాలు మాట్లాడితే స్వార్థ రాజకీయాలంటూ విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. ఈ హత్య కేసు దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

మోసమే ఎత్తుగడ..

చిన్న వయసు నుంచి నేర ప్రవృత్తి కలిగిన విశ్వ అలియాస్‌ గిరీశ్‌ మద్యానికి బానిస. మద్యం కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. యువతులను లక్ష్యంగా చేసుకుని, ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి నగదు తీసుకునేవాడు. అంజలిని అలాగే నమ్మించి నగదు, నగలు, వెండి వస్తువులు తీసుకున్నాడు. అతను వంచకుడని గుర్తించి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. దీంతో నిన్ను హత్య చేస్తానని బెదిరించడంతో నాయనమ్మతో కలిసి బెండిగేరి ఠాణాలో ఇటీవలే ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అక్కడ పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదు. మే 15న వేకువ జామున 5.30 గంటలకు ఇంటి వద్దకు వచ్చి విశ్వ తలుపు తట్టగా.. అంజలి తలుపు తీసింది. తన వద్ద ఉన్న కత్తితో ఆమెపై విచక్షణ రహితంగా పొడిచి పరారయ్యాడని పోలీసు అధికారులు వివరించారు. చికిత్స కోసం తరలించేలోగా ఆమె మరణించింది. విశ్వ కొద్ది రోజులు ఆటో డ్రైవరుగా పని చేశాడు. మైసూరులోని ఓ హోటల్‌లో మరికొద్ది రోజులు పని చేశాడు. అంజలిని తాను 15 రోజుల కిందటే వివాహం చేసుకున్నానని, ఇప్పుడు తనను నిర్లక్ష్యం చేసి, ఫోన్‌ నంబరును బ్లాక్‌ చేయడంతోనే హత్య చేశానని పరారయ్యేందుకు ముందుగా ఒక స్నేహితుడికి గిరీశ్‌ వివరించాడని తెలిసింది. హత్యకు వారం ముందు అంజలిని రూ.2 వేలు అడిగాడు. ఆమె రూ.1000 ఫోన్‌ పే ద్వారా పంపించింది. ఆ తర్వాత అతని నంబరును బ్లాక్‌ చేసింది. హత్య తర్వాత హావేరికి వెళ్లి, అక్కడి నుంచి మైసూరుకు రైల్లో వెళ్లాడు. తాను పని చేసిన హోటల్‌కు చేరుకుని అక్కడ పడుకున్నాడు. మళ్లీ గోవా, మహారాష్ట్రకు వెళ్లేందుకు రైల్లో ప్రయాణిస్తూ దావణగెరె సమీపంలో ప్రయాణికురాలితో గొడవకు దిగి.. ఇలా దొరికిపోయాడు.

పలుచోట్ల ధర్నాలు

అంజలి హత్యను ఖండిస్తూ హుబ్బళ్లిలో వివిధ సంఘాలు, విపక్షాలకు చెందిన కార్యకర్తలు ధర్నా, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, కాంగ్రెస్‌ కార్పొరేటర్, గత నెల హత్యకు గురైన విద్యార్థిని నేహా తండ్రి నిరంజన్‌ హిరేమఠ తదితరులు అంజలి కుటుంబ సభ్యులను కలసి మాట్లాడారు. వారికి ధైర్యం చెబుతూ, పరిహారం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. మరో వైపు తమను ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని ఒత్తిడి చేస్తున్నారని నిందితుడు గిరీశ్‌ తల్లి సునీత ఆవేదన వ్యక్తం చేశారు. తాను జీవనోపాధి కోసం హోటల్‌లో పని చేస్తున్నానని ఆమె తెలిపారు. విశ్వ అలియాస్‌ గిరీశ్‌ ఎప్పుడైనా వచ్చి చూసి వెళ్లేవాడని గుర్తు చేసుకున్నారు. నేర ప్రవృత్తిని మానుకోవాలని పలుసార్లు చేసిన హెచ్చరికలను అతను పెడచెవిన పెట్టాడని ఆక్రోశించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని