ఇసుకపై.. డేగకన్ను

ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో గనుల శాఖ అధికారులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన వారంతా గత రెండు రోజులుగా  రేవులను పరిశీలించే పనిలో పడ్డారు.

Updated : 19 May 2024 05:44 IST

సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికారులు చర్యలు 

భామిని మండలంలోని వంశధార నదిలో గుర్తించిన పసుకుడి రేవు 

న్యూస్‌టుడే, పార్వతీపురం: ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో గనుల శాఖ అధికారులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన వారంతా గత రెండు రోజులుగా  రేవులను పరిశీలించే పనిలో పడ్డారు.

జిల్లాలోని వంశధార, నాగావళి నదుల్లో నాలుగు చోట్ల ఇసుక రేవులు గుర్తించారు. ఒక్కోచోట 75 వేల క్యూబిక్‌ మీటర్ల పైబడి నిల్వలు ఉన్నాయి. నాగావళిలో కొమరాడ మండలం కొరిశిలలో కొన్ని రోజుల కిందట వరకు ఇసుక తవ్వేశారు. ఎన్నికల సమయంలో అధికారుల పర్యవేక్షణ తగ్గడంతో అక్రమంగా తోడేశారు. కొమరాడ మండలం చోళ్లపదం, కూనేరు వంటి ప్రాంతాల్లోనూ యథేచ్ఛగా దోచేశారు. భామిని మండలంలోని నేరడి, పసుకుడి వద్ద రేవులు ఉన్నా.. అక్కడ తవ్వకాలు వద్దని అధికారులకు ఆదేశాలు ఉన్నాయి. 

తెదేపా హయాంలో నిధులు 

తెదేపా హయాంలో ఇసుక రేవులపై వచ్చే ఆదాయాన్ని పంచాయతీలకు ఇచ్చేవారు. దీంతో స్థానిక అవసరాలు తీరేవి. వైకాపా పాలనలో ప్రైవేటు సంస్థలకు గనులు, ఇసుక రేవులు అప్పగించారు. దీంతో అధికారుల నియంత్రణ లేకుండా పోయింది. ప్రైవేటు సంస్థలదే ఇష్టారాజ్యమైంది. మద్యం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఎస్‌ఈబీ వ్యవస్థను నీరుగార్చారు. కొంత కాలంగా ఇసుకపై ఆ శాఖ అధికారులు దాడులు చేసిన దాఖలాలు లేవు.

30 రేవుల్లోనూ తవ్వేశారు..

జిల్లాలో నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదుల్లో చిన్నచిన్న రేవులు 30 ఉన్నాయి. వీటిల్లో 5 వేల క్యూబిక్‌ మీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఇసుక లభించడంతో స్థానిక అవసరాలకు తీసుకెళ్లొచ్చని కొన్నాళ్ల క్రితం ఉమ్మడి విజయనగరం జిల్లా కలెక్టర్‌ అనుమతి ఇచ్చారు. గృహ నిర్మాణాలకు సచివాలయాలు, ఇంజినీర్లు కూపన్లు ఇచ్చేవారు. ఇది కూడా వ్యాపార సామ్రాజ్యంగా మారిపోయింది. ఈ కూపన్లతో ఇష్టానుసారంగా తవ్వకాలు చేశారు. ముఖ్యంగా కొమరాడ మండలం నుంచి ఇసుక వ్యాపారం భారీగా సాగింది. అయినా అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇన్నాళ్లు అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిన కొరిశిల రేవును ప్రస్తుతం మూసేశారు.

టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు..: జిల్లాలోని నాలుగు పెద్ద రేవుల్లో ఇసుక తవ్వకాలు ప్రస్తుతం లేవు. గతంలో ఇచ్చిన 30 చిన్న రేవుల్లో స్థానికులు అవసరాలకు తవ్వుతున్నారు. మేము రేవులను తనిఖీ చేస్తున్నాం. దీనిపై నివేదికలు ఉన్నతాధికారులకు సమర్పించాం. రాష్ట్రస్థాయిలో అక్రమాలపై టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేశారు.

శ్రీనివాసరావు, జిల్లా గనుల శాఖ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని