సింగరేణిలో ఎందుకీ వివక్ష?

ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్‌ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది.

Updated : 20 May 2024 06:12 IST

ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఆర్థిక నష్టం

న్యూస్‌టుడే, మంచిర్యాల:  ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్‌ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకలా, సింగరేణి క్లరికల్‌ సిబ్బందికి మరోలా పరిగణించడం వల్ల పలు విధాలుగా నష్టం జరుగుతోంది. ఎన్నికల విధుల్లో సింగరేణి క్లరికల్‌ సిబ్బందిని ఆన్‌ డ్యూటీ కింద పరిగణించకపోవడం వల్ల అన్ని విధాలుగా నష్టపోతున్నామని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక సెలవుల కింద పరిగణించడం వల్ల, వార్షిక హాజరు లెక్కింపులో వీటిని వాస్తవ హాజర్ల కింద పరిగణనలోకి తీసుకోవడం లేదు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు కలిపి పది రోజులు కోల్పోవాల్సి వస్తోందని తెలిపారు. 

ఇటీవల ముగిసిన పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్‌ అధికారులుగా విధులు నిర్వర్తించిన క్లరికల్‌ సిబ్బందికి శిక్షణ పేరిట రెండు రోజులు, పోలింగ్‌ సందర్భంగా మూడు రోజులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో విధులు నిర్వర్తించారు. రెండు ఎన్నికల సందర్భంగా క్లరికల్‌ సిబ్బంది మొత్తం పది రోజులు ప్రత్యేక సెలవులు (ఎన్నికల విధులు)గా పరిగణించడం వల్ల వీరికి వార్షిక హాజర్ల లెక్కింపులో పది రోజులు తగ్గుతాయి. అంతర్గతంగా పదోన్నతుల కోసం నిర్వహించే పరీక్షలకు వార్షిక హాజర్ల ఆధారంగా వేసే అసెస్‌మెంట్‌ మార్కులు తగ్గుతాయి. ఫలితంగా 0.5 మార్కులు తగ్గినా, ర్యాంకు ఎక్కడికో వెళ్లే ప్రమాదముంది. ప్రతీ 20 వాస్తవ హాజర్లకు ఒకటి చొప్పున ఆర్జిత సెలవులు లభిస్తాయి. పది రోజులు ఎన్నికల విధుల పేరిట ప్రత్యేక సెలవులుగా పరిగణించడం వల్ల ఆర్జిత సెలవుల లెక్కింపులోనూ నష్టపోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా హాజర్ల లెక్కింపు ఆధారంగా చెల్లించే త్రైమాసిక బోనస్, లాభాల వాటా, టీఏ డీఏలతో కలిపి ఒక్కో ఉద్యోగి రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు నష్టపోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఒకే సంస్థలో వేర్వేరు విధానాలు

ఇదే సింగరేణి సంస్థలో ఈవీఎం యంత్రాలు, రవాణా చేయడానికి ఎన్నికల విధులు అప్పగించిన ఎంవీ డ్రైవర్లకు ఎన్నికలకు ముందు రోజు (ఆదివారం), ఎన్నికల రోజు ప్లేడే మస్టర్లు పొందుతున్నారని వారికి రెట్టింపు వేతనాలతోపాటు అన్ని అర్హతలు వర్తిస్తాయని క్లరికల్‌ సిబ్బంది తెలిపారు. ఒకే సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటే వేర్వేరు ప్రయోజనాలు ఏమిటని, వివక్ష ఎందుకని వాపోతున్నారు. దీనిపై సింగరేణి యాజమాన్యం తగిన న్యాయం చేసేలా  వెంటనే నిర్ణయం తీసుకోవాలని, ఎంవీ డ్రైవర్ల మాదిరిగా తమకూ ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని