అరచేతిలో వాతావరణ సమాచారం

వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది.

Updated : 20 May 2024 06:12 IST

ప్రత్యేక యాప్‌లు రూపొందించిన కేంద్రం

మేఘదూత్‌లో వాతావరణ విశేషాలు

వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. మెరుపులు, ఉరుముల నుంచి రక్షించుకోవడం, వర్షం ఎప్పుడు ఎక్కువగా కురిసే అవకాశముందో తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకునేందుకు వీలుగా కేంద్ర ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ యాప్‌లు ఎంతగానో దోహదపడనున్నాయి. ప్రధానంగా రైతులకు ఈ యాప్‌లు బహుళ ప్రయోజనకరం కానున్నాయి. ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఆయా యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం మీ అరచేతిలో ఉన్నట్లే.

మెరుపు హెచ్చరికల ‘డామిని’

ఎప్పటికప్పుడు మెరుపు హెచ్చరికలను తెలియజేసేందుకు ‘డామిని’ యాప్‌ ఉపయోగపడుతుంది. మెరుపు ఎందుకు వస్తుంది, మెరుపు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ యాప్‌లో సవివరంగా వివరించారు. లొకేషన్‌ ఆధారంగా ఎక్కడెక్కడ మెరుపులు వచ్చే అవకాశముందో సూచిస్తుంది. పిడుగు పడినప్పుడు తోటి వారికి అందించాల్సిన వైద్య సహాయం, శ్వాస ఆగిపోతే నోటి నుంచి శ్వాసను పునరుజ్జీవనం చేయడం, గుండె చప్పుడు ఆగిపోతే సీపీఆర్‌ చేయడం తదితర వివరాలతో పాటు పిడుగు పడినప్పుడు ప్రాథమికంగా చేయకూడని, చేయాల్సిన పనులను ఇందులో పేర్కొనడంతో వివిధ వర్గాల వారికి ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

వర్ష సూచనల ‘రెయిన్‌ అలారమ్‌’

ఎప్పటికప్పుడు వర్ష సూచనను ఈ యాప్‌ మీకు అందుబాటులోకి తెస్తుంది. మీరు నివసిస్తున్న ప్రాంతంలో వాతావరణ, వర్ష సూచనలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయో తెలియజేస్తుంది. వాతావరణంలోని ఉష్ణోగ్రత, మేఘావృతం తదితర అంశాలను వివరిస్తుంది.


సమగ్ర వివరాలతో ‘మేఘదూత్‌’

మేఘదూత్‌ యాప్‌లో సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుంది. వర్షపాతం, గాలిలో తేమ, గాలి వేగం, గాలి వీచే దిక్కు, ఉష్ణోగ్రత తదితర అంశాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంది. వారం రోజుల ముందు, రానున్న నాలుగు రోజుల వాతావరణ విశేషాలను సైతం ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు.

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని