నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం

రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి.

Updated : 20 May 2024 06:14 IST

వస్తు  వినియోగంలో అప్రమత్తత అవసరం
నేడు ప్రపంచ లీగల్‌ మెట్రాలజీ  దినోత్సవం

రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. బరువు, పొడవులకు సంబంధించి నాణ్యత లోపాలు, మోసాలను నియంత్రించేందుకు లీగల్‌ మెట్రాలజీ(తూనికలు కొలతలు) శాఖ కృషి చేస్తోంది. సోమవారం ప్రపంచ లీగల్‌ మెట్రాలజీ దినోత్సవం పురస్కరించుకొని ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

శాస్త్రీయ, సాంకేతిక ఆవిష్కరణలతో స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు 1985 మే 20 నుంచి ఏటా ఈ రోజును లీగల్‌ మెట్రాలజీ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచంలోని వివిధ దేశాలు ఇందులో భాగస్వాములవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు అవగాహన కల్పిస్తున్నారు.

మెట్రిక్‌ విధానంతోనే నిర్ధారణ

మనం వినియోగించే వస్తువులు, పరికరాల వాణిజ్యాన్ని నిర్ధారించేందుకు వాటి బరువు, పొడవులను ప్రామాణికంగా తీసుకుంటాం. ఇందుకోసం ఒక మెట్రిక్‌ విధానాన్ని రూపొందించారు. సెంటీమీటరు, గ్రాము, సెకన్‌-(సీజీఎస్‌), మీటరు, కిలోగ్రామ్, సెకన్‌-(ఎంకేఎస్‌). ఈ రెండు పద్ధతులను కలిపి మెట్రిక్‌ సిస్టంగా పిలుస్తుంటారు. లీగల్‌ మెట్రాలజీ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన శాఖ.

ఏ సందర్భంలో ఫిర్యాదు చేయాలి?

నిత్య జీవితంలో కొనుగోలు చేసే ప్రతి వస్తువునూ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎంపిక చేసుకోవాలి. తయారు చేసిన సంస్థ పేరు, బరువు, నాణ్యత, పరిమాణం, తయారీ తేదీ, కాలపరిమితి లేదా వాడకం గడువు, కస్టమర్‌ కేర్‌ నంబరు.. తదితర వివరాలన్నీ ఒకే చోట ముద్రించి ఉండాలి. ఈ వివరాలు లేకుండా విక్రయిస్తే నేరుగా లీగల్‌ మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. అనుమానం వచ్చినపుడు అధికారులు, సంబంధిత కంపెనీ దృష్టికి తీసుకెళ్తే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటారు.

540 కేసులు.. రూ.31 లక్షల జరిమానా

ఉమ్మడి జిల్లాలో తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, సింగరేణి, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్‌ బంకులు, మిల్లులు, రేషన్‌ దుకాణాల్లో వినియోగించే తూకం యంత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఏటా తూకం యంత్రాలు, బాట్లపై ముద్రలు వేస్తున్నారు. అయితే పలు చోట్ల ఫిర్యాదు చేసినా తనిఖీలు చేయడం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత జిల్లా ఇన్‌ఛార్జిగా ఇన్స్‌పెక్టర్‌ వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు టెక్నికల్‌ అసిస్టెంట్, అటెండర్‌ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో బరువు వ్యత్యాసానికి సంబంధించి 235 కేసులు, ప్యాకేజీ వస్తువులపై 305 కేసులు నమోదయ్యాయి. బాధ్యులకు రూ.31.03 లక్షల జరిమానా విధించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తయారు చేసిన సామగ్రి లక్ష్యం నెరవేరుతుందా? లేదా? అనే విషయాన్ని ధ్రువీకరించేందుకు లీగల్‌ మెట్రాలజీ శాఖ పని చేస్తోంది. ప్రభుత్వ, వస్తు సేవల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం ఈ శాఖకు ఉంటుంది. ఫిర్యాదులపై విచారణ జరిపి సంబంధిత సంస్థలకు నోటీసులు జారీ చేస్తారు. కేసులు నమోదు చేసి, జరిమానా విధిస్తారు.

ఫ్రోరాన్ని ఆశ్రయిస్తే పరిహారం

వస్తు సేవల్లో మోసపోయినట్లు, అన్యాయం జరిగినట్లు భావిస్తే వినియోగదారుడు చట్టపరంగా పోరాడే అవకాశం ఉంది. సంబంధిత ఆధారాలతో జిల్లా వినియోగదారుల ఫోరాన్ని సంప్రదిస్తే విచారణ జరిపి బాధ్యుల నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటారు.

గ్యాస్‌ బరువు సరిచూస్తున్నారా?

  • ఆహార ఉత్పత్తులు, వస్తు సామగ్రి పరిమాణంపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి.
  • ఏ వస్తువును కొనుగోలు చేసినా తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి.
  • గ్యాస్‌ సిలిండరు తీసుకునే సమయంలో డెలివరీ బాయ్‌కు డబ్బులు చెల్లిస్తాం. అయితే గ్యాస్‌ డెలివరీ వాహనాల్లో తూకం యంత్రం తప్పనిసరిగా ఉండాలనే నిబంధనపై మనలో చాలా మందికి తెలియదు.
  • అనుమానం ఉంటే సిలిండరు బరువు తూచిన తర్వాతే తీసుకోవాలి. సిలిండరుపై నికర బరువు, గ్యాస్‌ పరిమాణం ముద్రిస్తారు. అవి ఉన్నాయో? లేదో? సరిచూసుకోవాలి.

ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నాం

వస్తు సేవల్లో తూకంలో మోసాలను అరికడుతున్నాం. మా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య సంస్థలు వినియోగించే తూకం యంత్రాలను తనిఖీ చేస్తున్నాం. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధిస్తున్నాం. ఈ విషయమై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నాం.

విజయసారధి, లీగల్‌ మెట్రాలజీ సహాయ కమిషనర్, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని