బతుకుజీవుడా..

జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది.

Updated : 20 May 2024 06:17 IST

 పశు సంచారంతో రోడ్డు ప్రమాదాల ముప్పు

  •  సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై కూసుమంచి మండలం జీళ్లచెర్వు వద్ద ఇటీవల కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఖమ్మం నగరానికి చెందిన వెంకటేశ్వర్లు(54) మృతిచెందారు. రాత్రివేళ గేదె అడ్డురావడమే ప్రమాదానికి కారణం.
  • విజయవాడ-జగదల్‌పూర్‌ జాతీయ రహదారిపై పాల్వంచ మండలం జగన్నాథపురం వద్ద ద్విచక్రవాహనం కిందపడి యువకుడు మృతిచెందాడు. మరొకరు గాయపడ్డారు. రోడ్డు పక్కన భీకరంగా పోట్లాడుకునే దుక్కిటెడ్లు ఒక్కసారిగా మీదకు దూసుకురావడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది.

ఈనాడు డిజిటల్, కొత్తగూడెం

జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. ఒక్కసారిగే అడ్డొచ్చే మూగజీవాల కారణంగా కార్లు పల్టీ కొడుతున్నాయి.  ద్విచక్ర వాహనాలు, ఆటోలు, టాటాఏస్‌ తదితర రవాణా వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. వేసవిలో ఇలాంటి ప్రమాదాల వల్ల ఉమ్మడి జిల్లాలవాసులు బతుకుజీవుడా అంటూ ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి. ఏడాది వ్యవధిలో పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకోవడమే పరిస్థితికి అద్దం పడుతోంది.

వాహనదారులూ.. జాగ్రత్తలే రక్ష

  • పశువుల సంచారాన్ని గమనిస్తే 50 మీటర్ల ముందే బ్రేకులు వేసి వేగాన్ని తగ్గించాలి.
  • మూగజీవాల పక్కనుంచి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవి ఒక్కసారిగా బెదిరి మీదపడితే తీవ్రగాయాలవుతాయి.
  • ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం తప్పక ధరించాలి.
  • హైవేలపై హెచ్చరికలు, సూచనలను విధిగా పాటించాలి. నిర్ణీత వేగంతోనే వాహనం అదుపులో ఉంటుంది.
  • నిద్ర మత్తులో ఉన్నవారు రాత్రిళ్లు గేదెలు అడ్డొచ్చినా గుర్తించలేక ఢీకొడుతున్నారు. మత్తులోంచి తేరుకున్నవారే ప్రయాణాలు నడపాలి.
  • ఓవర్‌ టేక్‌ సమయంలో పశువులు అడ్డొస్తే ప్రమాదాన్ని తప్పించలేం. పరిసరాలను గమనిస్తూ.. ముందుచూపుతో వ్యవహరించడమే మేలు.

రోడ్డు ప్రమాదాలకు అతివేగం, రాంగ్‌రూట్, మద్యం మత్తు వంటివి ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి. ఆ తర్వాత సైకిళ్లు, రిక్షాలతో పాటు గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు ఒక్కసారిగా అడ్డురావడం వల్ల ఎక్కువ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంతో 2022లో 6.7 శాతం ప్రమాదాలు జరిగినట్లు ‘రోడ్డు ప్రమాదాల నివేదిక’ పేర్కొంది. హైవేల్లో వాహనాలు ఢీకొని గేదెలు, ఆవులు, వన్యప్రాణులు మృతిచెందుతున్నాయి. వాటి కళేబరాల్ని వెంటనే పక్కకు తొలగించడం లేదు. దుర్వాసన వెదజల్లకుండా రసాయన పొడి చల్లించాల్సి ఉంది. హైవే అథారిటీ, పంచాయతీలు ఇవేమీ పట్టించుకోక పోవడంతో రాత్రిళ్లు కళేబరాలను ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి.

వేసవిలోనే ఎక్కువ..

రహదారులపై పశువుల సంచారం ఎక్కువగా ఏప్రిల్, మే, జూన్, జులై నెలల్లో ఉంటోంది. పంటల సీజన్‌ ముగియడంతో రైతులు, కాపరులు పశువులను యథేచ్ఛగా వదిలేస్తుంటారు. వీటిలో కొన్ని మేత మేసిన తర్వాత సాయంత్రంలోగా ఇళ్లకు చేరతాయి. మరికొన్ని సుదూర ప్రాంతాలకు తరలుతాయి. అవి అర్ధరాత్రి వేళల్లో రోడ్లను దాటే సమయాల్లో వాహనాలు ఢీకొని ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. ప్రమాదాలకు గురైన మూగజీవాల మృతదేహాలను పంచాయతీలు, లేదా హైవే విభాగం వారు పక్కకు తొలగించకపోవడం మరికొన్ని విషాదాలకు కారణమవుతోంది. ద్విచక్రవాహనం, ఆటోలు వంటివి ప్రమాదానికి గురైనప్పుడు ప్రాణనష్టం అధికంగా ఉంటోంది. ఒక్కోసారి కార్లు అతివేగంలో ఉన్నప్పుడు బోల్తాపడినా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. బస్సులు, సరకు రవాణా లారీలైతే పశువులు చనిపోయి రైతులకు నష్టం వాటిల్లుతోంది.

రోడ్డు, రవాణా శాఖ బాధ్యతలు..

  • ప్రధాన రహదారుల్లో మూగజీవాల కారణంగా జరిగే ప్రమాదాల నివారణకు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ గతంలో కీలక నిర్ణయం తీసుకుంది. పశువుల సంచారాన్ని అడ్డుకునేందుకు ఇరువైపులా   1.20 మీటర్ల ఎత్తుతో వెదురు బొంగులతో బాహుబలి కంచె ఏర్పాటుకు నడుం బిగించింది. వెదురుకు ప్రత్యేక రసాయన పూతతో ఉక్కులా మారే లక్షణం కలుగుతుంది. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఈ ప్రయోగాన్ని అన్ని జిల్లాల్లో ఆచరణలోకి తేవాలి.
  • గ్రామీణ ప్రాంతాల్లో అవసరమున్న చోట రెయిలింగ్‌ ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు గణనీయంగా తగ్గుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఉమ్మడి జిల్లా పరిధిలో జాతీయ రహదారి, ఆర్‌అండ్‌బీ అధికారులు దీనిపై దృష్టిసారించాలి. ముఖ్యంగా ఖమ్మం-సూర్యాపేట, ఖమ్మం-కోదాడ మార్గాల్లో ఏర్పాటు చేయాలిన ప్రజలు కోరుతున్నారు.
  • పశువు సంచారంతో ప్రమాదాలు ఎక్కువగా వాటిల్లే బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాలి.
  • హైవేలపై ప్రయాణించే వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించాలి. ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌లు, స్పీడ్‌గన్‌లు ఏర్పాటు చేసి వేగ నియంత్రణ చేపట్టాలి. రహదారి భద్రత నిపుణుల మార్గదర్శకాలు అమలు చేయాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని