తరుగు పేరిట దోపిడీ

అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు అమ్మకానికి తీసుకెళ్తే రైతులు దోపిడీకి గురవుతున్నాడు. అకాల వర్షాలతో కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసిపోవడంతో ఆరబెట్టేందుకు అనేక అవస్థలు పడ్డారు

Updated : 21 May 2024 05:43 IST

కేంద్రం నిర్వాహకుడి నిర్వాకం

చెన్నూరు మండలం దుబ్బపల్లి కొనుగోలు కేంద్రంలో నిల్వచేసిన వరిధాన్యం 

చెన్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే : అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు అమ్మకానికి తీసుకెళ్తే రైతులు దోపిడీకి గురవుతున్నాడు. అకాల వర్షాలతో కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసిపోవడంతో ఆరబెట్టేందుకు అనేక అవస్థలు పడ్డారు. అయినా వీరిపై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కనికరం చూపడంలేదు. ధాన్యం తడిసిందని, తీసుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తారని సాకులు చెబుతూ తూకం ఎక్కువగా వేయడంతోపాటు తరుగు పేరుతో ముంచుతున్నారు. చెన్నూరు మండలంలోని దుబ్బపల్లి కొనుగోలు ధాన్యంలో జరిగిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రాగా అధికారులు విచారణ చేపట్టారు.

లారీకి ఎనిమిది క్వింటాళ్లు..

మండలంలోని దుబ్బపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రం(పీఏసీఎస్‌) ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం కొనసాగుతోంది. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. ఈ కేంద్రం నిర్వాహకులు ఈనెల 14, 15 తేదీల్లో పలువురు రైతులకు చెందిన ధాన్యాన్ని 40కిలోల 650 గ్రాములకు బదులుగా 42 కిలోలు తూకం వేశారు. ఆ సమయంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు కూడా అభ్యంతరం తెలుపలేదు. ధాన్యాన్ని నిర్వాహకుడు మూడు లారీల్లో మిల్లుకు తరలించాడు. ఆన్‌లోడ్‌ చేసిన అనంతరం లారీలు తిరిగి ఈనెల 16న దుబ్బపల్లికి చేరుకున్నాయి. మిల్లర్‌ ఒక్కో లారీకి ఎనిమిది క్వింటాళ్ల ధాన్యం తరుగు తీశారని కొనుగోలు కేంద్రం ఇన్‌ఛార్జి రైతులకు చెప్పడంతో వారు ఆందోళన చెందారు. తమకు ట్రక్‌షీట్‌ చూపాలని కోరినా పట్టించుకోకుండా సమాధానం దాటవేయడంతో ఈనెల 17న చెన్నూరులోని సంబంధిత అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేయకపోవడంతో సోమవారం చెన్నూరు తహసీల్దారు కార్యాలయానికి వచ్చిన జిల్లా అదనపు పాలనాధికారి మోతిలాల్‌కు తిరిగి రైతులు ఫిర్యాదు చేశారు. 

అధికారుల విచారణ..

దుబ్బపల్లి కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై రైతులు చేసిన ఫిర్యాదుపై సోమవారం జిల్లా సహకార శాఖ అధికారి(డీసీవో) నర్సయ్య, సహాయ రిజిస్ట్రార్‌ రవికిశోర్‌లు కేంద్రానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఒక లారీకి సంబంధించిన ట్రక్‌షీట్‌ను పరిశీలించారు. అందులో అదనంగా రైతుకాని వ్యక్తి పేరు ఉందని రైతులు అధికారులతో పేర్కొన్నారు. దీనిపై జిల్లా పాలనాధికారికి నివేదిక సమర్పిస్తామని అధికారులు పేర్కొన్నారు. 

రశీదు ఇవ్వరు.. 

ధాన్యాన్ని తూకం వేసిన అనంతరం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రశీదు  ఇవ్వాలనే నిబంధన ఉన్నా.. చాలా కేంద్రాల్లో ఇవ్వడంలేదు. దీంతో రైతుల వద్ద ఆధారం లేకుండా పోతోంది. ట్రక్‌షీట్‌ పైనే ధాన్యం బస్తాల వివరాలు రాస్తున్నారు. ఈవిషయంలో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని