ఆరోగ్యశ్రీలో అడ్డదారులు

ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త ఏడాదిన్నర క్రితం ఎడపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారిగా ఉద్యోగం రావడంతో వెళ్లిపోయారు. మహబూబ్‌నగర్‌కు చెందిన జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ స్వప్నకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.

Updated : 21 May 2024 05:50 IST

పక్కా ప్రణాళికతో దోచుకుంటున్న కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు
ఇన్‌ఛార్జుల పాలనే కారణం

  • నిన్నటికి నిన్న నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద బైపాస్‌ సర్జరీ చేసేందుకు వైద్యులు రూ.80 వేలు అడిగారని మృతుడు సత్యనారాయణ(34) కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రి ఎదుట ధర్నా చేసి సీపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌కు వెళ్లి నిరసన తెలిపి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

  • ఖలీల్‌వాడిలో ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిపై ఇటీవల ఫిర్యాదులు రావడంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ప్రత్యేక బృందం ఆకస్మిక తనిఖీలు చేయడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లల విభాగంలో చేరకపోయినా చేరినట్లు తప్పుడు పత్రాలు చూపి ఆరోగ్యశ్రీ ద్వారా బిల్లులు డ్రా చేసేందుకు చూశారు. ఈ విషయం ప్రత్యేక బృందం తనిఖీలో బయటపడటంతో ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు నిలపివేశారు.

నిజామాబాద్‌ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కాలు విరిగిన బాధితుడిని ఆరోగ్యశ్రీ కింద చేర్చారు. ఆరోగ్యమిత్రలకు సంబంధం లేకుండా నేరుగా ఆసుపత్రి వైద్యుడే రూ.35 ఇవ్వాలని, కేసు సీరియస్‌గా ఉందని చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో రోగి కుటుంబ సభ్యులు నగదు ఇచ్చారు. మిత్రాలు కల్పించుకొని ఎక్స్‌రేలు, స్కానింగ్‌ చేసిన డబ్బులు    ఆసుపత్రి నుంచే ఇస్తారని చెప్పడంతో విషయం బయటకు వచ్చింది.


న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం: ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త ఏడాదిన్నర క్రితం ఎడపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారిగా ఉద్యోగం రావడంతో వెళ్లిపోయారు. మహబూబ్‌నగర్‌కు చెందిన జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ స్వప్నకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ పోస్టులో ఆరేళ్లుగా ఇన్‌ఛార్జే కొనసాగుతున్నారు. సదరు డీఎం ఆదిలాబాద్‌లో పూర్తిస్థాయి బాధ్యతలు చూస్తున్నారు. ఈయనకు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల జిల్లాల అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. నిబంధనల ప్రకారం నిజామాబాద్‌కు ముగ్గురు, కామారెడ్డికి ముగ్గురు చొప్పున టీంలీడర్లు ఉండాలి. ఈ పోస్టులు సైతం ఆరేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. 

ఆధారాలు లేకుండా..

ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స చేయాలంటే అదనంగా డబ్బులు ఇస్తేనే వైద్యం చేస్తున్నారు. ఇందుకు ఎలాంటి ఆధారాలు లేకుండా వసూలు చేస్తున్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే, చెక్కు ఇలా ఏవీ తీసుకోవడం లేదు. నగదు రూపంలోనే తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారితో పాటు డీఎం, టీంలీడర్లు ఎవరూ లేకపోవడంతో డాటా ఎంట్రీ ఆపరేటర్ల సూచనల మేరకు ప్రైవేటు వైద్యులు విచ్చలవిడిగా పేదల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. 

ఉన్నతాధికారులు స్పందిస్తేనే...

గతంలో జిల్లాలో డాక్టర్‌ వినీత్‌ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌గా ఉండేవారు. సదరు వైద్యుడు ఏడాదిన్నర క్రితం వెళ్లడంతో ఈ పోస్టు ఖాళీగా ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల అరాచకాలను అడ్డుకోవాలంటే ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్‌ పోస్టులను నియమించాలని కోరుతున్నారు. లేదంటే ఆరోగ్యశ్రీలో అక్రమాలు ఆగేలా లేవు. ఇదే పరిస్థితి కొనసాగితే పేదలకు ఆరోగ్యశ్రీ అందని ద్రాక్షలా మారనుంది.


ఫిర్యాదు చేస్తే సేవలు నిలిపివేస్తాం

- స్వప్న, ఆరోగ్యశ్రీ    జిల్లా సమన్వయకర్త, నిజామాబాద్‌ 

2023 జనవరి నుంచి ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నా. ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బులు అడిగితే స్థానికంగా ఉండే ఆరోగ్యమిత్రలకు లేదంటే అక్కడ ఉన్న ఫోన్‌ నంబర్లకు ఫోన్‌చేస్తే స్పందిస్తాం. ఆసుపత్రిపై విచారణ జరిపి సేవలు నిలిపేస్తాం. ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నాం. సెంట్రల్‌ టీమ్‌ లోతుగా పరిశీలిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని