ఆరోగ్యశ్రీ ఆగనుంది!

వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. మూడు వేలకుపైగా చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చాం!.. వ్యయ పరిమితి రూ.25 లక్షలకు పెంచామంటూ డప్పు కొట్టుకునే సర్కారు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను మాత్రం గుర్తించడంలేదు.

Updated : 22 May 2024 05:19 IST

పేరుకుపోయిన బిల్లుల బకాయిలు
చేతులెత్తేసిన ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు
నేటి నుంచి నిలిచిపోనున్న సేవలు
పేద రోగులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే  
ఈనాడు, కడప

వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. మూడు వేలకుపైగా చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చాం!.. వ్యయ పరిమితి రూ.25 లక్షలకు పెంచామంటూ డప్పు కొట్టుకునే సర్కారు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను మాత్రం గుర్తించడంలేదు. పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోవడంతో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఘం లేఖ రాసింది. ఫలితంగా జిల్లాలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో పేదలకు ఉచిత సేవలు ఆగిపోనున్నాయి. ఈ మేరకు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు రోగులకు ముందుగానే స్పష్టం చేశాయి. వైద్య సేవలు పొందాలంటే నగదు చెల్లించాల్సి ఉంటుందని తేల్చి చెబుతున్నాయి.

జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం నెట్‌వర్క్‌ పరిధిలో ఆసుపత్రులు 75 వరకు ఉండగా, వీటిలో ప్రైవేటు రంగానికి చెందినవి 20 వరకు ఉన్నాయి. మరో 55 ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలందుతున్నాయి.  జిల్లాలో మొత్తం 4,61,553 ఆరోగ్యశ్రీ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలోని ఆసుపత్రులకు రూ.120 కోట్ల మేర బకాయిలు రావాలి. రోగులు ఎక్కువ మంది ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం విషయంలో ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకొంటూ వెళుతుంటే క్షేత్ర స్థాయిలో రోగులు మాత్రం తరచూ తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. సేవలు ఆపేస్తామంటూ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు హెచ్చరించడం, అంతో ఇంతో బిల్లులు చెల్లించి వ్యవహారాన్ని చల్లబరచడం.. మరోసారి పునరావృతం కావడం జరుగుతోంది, ఈ నేపథ్యంలో నెట్‌వర్క్‌ ఆసుపత్రులు మావల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నాయి. వైద్య పరికరాలు, మందుల కంపెనీలకు బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటికి బకాయి పెట్టేసిన ప్రభుత్వం పేద రోగులను నరకం అంచుల్లోకి నెట్టేస్తోంది. ఆరోగ్యశ్రీ క్లెయిమ్స్‌ వేలల్లో పేరుకుపోతుంటే వైకాపా ప్రభుత్వ ప్రచారం మాత్రం తారస్థాయికి వెళుతోంది.

జగన్‌ది ప్రచార ఆర్భాటం

‘పేదలే నా ప్రాణం. వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం. ఆరోగ్యశ్రీ వారి కోసమే’ అంటూ జగన్‌ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు. వాస్తవంగా చూస్తే పథకానికి అనారోగ్యమొచ్చింది. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల బిల్లులను వేగంగా చెల్లించకుంటే దాని ప్రభావం రోగులకు అందించే వైద్యంపై పడుతుందని కాగ్‌ హెచ్చరించినా జగన్‌ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. ప్రచారం చేసుకున్నంత గొప్పతనమేమీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడంలేదు. బీమా కార్డు తీసుకెళితే ధీమా దక్కడంలేదు. అయినా గొప్పలు చెప్పుకోవడంలో మాత్రం జగన్‌ వెనక్కి తగ్గడంలేదు. ఆరోగ్యశ్రీ వైద్య సేవలపైనే మనుగడ సాగించే కొన్ని ఆసుపత్రులకు నిర్వహణ భారంగా పరిణమిస్తోంది. ఆ ప్రభావం రోగులపై పడుతోంది. జగన్‌ ప్రభుత్వం మాత్రం ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వార్షిక చికిత్స పరిమితిని రూ.25 లక్షలకు పెంచామంటూ ప్రచారంలో తరిస్తోంది.  ఇవ్వని బిల్లులకు ఎన్ని రూ.లక్షలు చేస్తే ఏం లాభం అన్నది.. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. 

45 రోజుల్లో చెల్లించాల్సి ఉన్నా..!

ఆరోగ్యశ్రీ పథకం మార్గదర్శకాల ప్రకారం క్లెయింలు పంపిన 45 రోజుల్లోగా చెల్లింపులు పూర్తి కావాల్సి ఉంది. దీనికి కొన్నిసార్లు నెలల తరబడి సమయం తీసుకుంటోంది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తరుణంలో వైద్య చికిత్సలు, కొనసాగింపు, బిల్లుల విషయమై తర్వాత వచ్చే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోననే ఆందోళన నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాల్లో నెలకొంది. దీంతో సేవలు నిలిపివేయడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చాయి.  

పథకం సేవల వివరాలు

కార్డుల సంఖ్య 4,61,553
నెట్‌వర్క్‌ పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రులు 20
సేవలందించే ప్రభుత్వ ఆసుపత్రులు 55
2023-24లో సేవలు అందుకున్న రోగులు 25,898 మంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని