అమ్మకేదీ అభయం!

‘ఎక్కడా మాతా శిశు మరణాలు జరగకూడదు. బాలింతలు, గర్భిణులు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోండి’ - సమావేశాల్లో కలెక్టర్‌ వైద్యాధికారులకు చెప్పే మాటలివి.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

Updated : 22 May 2024 06:30 IST

గర్భిణులపై కొరవడిన పర్యవేక్షణ
ఏడాదిలో ఆరుగురు తల్లులు, 40 మంది చిన్నారుల మృతి

‘ఎక్కడా మాతా శిశు మరణాలు జరగకూడదు. బాలింతలు, గర్భిణులు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోండి’ - సమావేశాల్లో కలెక్టర్‌ వైద్యాధికారులకు చెప్పే మాటలివి.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ప్రసవ సమయంలో గత ఏడాదిలో ఆరుగురు తల్లులు, 40 మంది శిశువులు మృత్యువాత పడటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆర్భాటం తప్ప.. ఆచరణలో చేసింది శూన్యమనిపిస్తోంది. జిల్లాలో గతం కంటే మరణాలు తగ్గాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నా.. వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. 

ఈనాడు, నెల్లూరు: గర్భిణులకు ప్రతి 15 రోజులకు వైద్య పరీక్షలు, గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో హైరిస్క్‌ గర్భిణుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు, ఆరోగ్యశ్రీ కింద కాన్పు చేయించుకుంటే.. డిశ్ఛార్జి సమయంలో రూ.అయిదు వేలు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా బాలింతను వారి ఇంటి వద్దకే చేర్చుతామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. ఇవి పక్కాగా అమలు కావడం లేదు. అవగాహన లేక మరికొందరు వినియోగించుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో గర్భిణుల నమోదు ప్రక్రియ నుంచే వారి ఆరోగ్య స్థితిపై పీహెచ్‌సీల్లో నివేదికలు రూపొందిస్తున్నా.. గత కాన్పు వివరాలు? ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఇతర అనారోగ్య సమస్యలను ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది గుర్తిస్తున్నా.. తర్వాత వైద్యులు పరీక్షిస్తున్నా.. కాన్పు సమయానికి ముందే ఆసుపత్రుల్లో చేర్పిస్తున్నా మాతా శిశు మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హైరిస్క్‌ కేసుల్లో తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడే విషయమై పర్యవేక్షణ కొరవడుతోందని జిల్లాలో చోటు చేసుకున్న మరణాలే స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే.. మరణాలు నమోదువుతున్న పీహెచ్‌సీల పరిధిలో పర్యవేక్షణ మరింత పెరగాలని వైద్యులు సూచిస్తున్నారు. 

  • నెల్లూరు నగర పరిధిలోని ఓ మహిళ(21) ప్రసవ  వేదనతో ఉండగా- స్థానిక ఓ ఆసుపత్రిలో చేర్పించారు. రక్తపోటు అధికం కావడంతో కాన్పు కష్టమైంది. దాంతో వైద్యులు మరో ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆ క్రమంలో మార్గం మధ్యలోనే సదరు మహిళ మృతి చెందారు. గత ఏడాది అక్టోబరులో ఈ సంఘటన చోటు చేసుకోగా-వైద్యులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. 
  • అనంతసాగరం మండలం రేవూరుకు చెందిన ఓ మహిళ తన రెండో ప్రసవం కోసం ఆత్మకూరులోని జిల్లా ఆసుపత్రిలో చేరారు. సాధారణ ప్రసవం జరిగింది. బాబు పుట్టాడు.. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫిట్స్‌ వచ్చాయి. వైద్యులు స్పందించే లోపే ఆమె మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 
  • వెంకటాచలం మండలం పూడిపర్తికి చెందిన ఓ గిరిజన మహిళ.. గత నెలలో వెంకటాచలం పీహెచ్‌సీలో చేరారు. ఆమెకు అది తొలికాన్పు.. ఉదయం 10 గంటలకు ఆసుపత్రిలో చేరితే.. అర్ధరాత్రి 1 గంటకు ప్రసవం జరిగింది. ఆ సమయంలో  ప్రసూతి వైద్యురాలు లేరు. శిక్షణ వైద్యులు మాత్రమే ఉన్నారు. నర్సులు కాన్పు చేశారు. బిడ్డ బయటకు రాగానే.. ఆరోగ్యం బాగోలేదని..పెద్దాసుపత్రికి తీసుకువెళ్లాలని హడావుడి చేశారు. తీరా తీసుకువెళ్లేలోపే చిన్నారి మృతి చెందింది.వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

క్లిష్ట పరిస్థితుల్లో.. మరో ఆసుపత్రికి

జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్తు(ఏబీవీపీ) పరిధిలో 13 ఆసుపత్రులు ఉండగా- వీటిలో పది సామాజిక(సీహెచ్‌సీ), 2 ప్రాంతీయ, ఒక జిల్లా ఆసుపత్రి ఉన్నాయి. నాడు-నేడు పథకంలో భాగంగా 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాలను 50 నుంచి 100 పడకలకు ఉన్నతీకరించారు. పెంచిన పడకలకు అనుగుణంగా ప్రసూతి, మత్తు(ఎనస్తీషియా), చిన్న పిల్లల వైద్య నిపుణులను నియమించారు. అయినా.. ప్రసూతి సేవల విషయంలో సర్కారు ఆసుపత్రులు సంతృప్తిని కలిగించలేకపోతున్నాయి. ప్రసవాల కోసం ఇంకా ప్రైవేటు ఆసుపత్రుల వైపే చూస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు నెలకు 30 నుంచి 350 ప్రసవాలు నిర్దేశించినా.. అందులో సగమైనా చేరుకోవడం లేదు. కొన్నిచోట్ల కాన్పు కోసం వచ్చిన వారిని పరీక్షించి.. ఏదో ఒకసాకు చెప్పి ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులకు పంపుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తూ ప్రైవేటు క్లినిక్‌లలో సేవలకే కొందరు పరిమితం కావడమూ ప్రసూతి సేవలు దారి తప్పేందుకు కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

పూర్తిగా తగ్గించేలా చర్యలు

పెంచలయ్య, జిల్లా వైద్యాధికారి

మాతా శిశుమరణాలు తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రతినెలా సమీక్షలు నిర్వహించి.. మరణాలకు కారణాలు తెలుసుకుని, పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నాం. అత్యధికంగా మార్చిలో పసిపిల్లల మరణాలు సంభవించాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని