ఎమ్మెల్యేనా.. వీధి రౌడీనా!

రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన.. చట్టాలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికార వైకాపాకు చెందిన మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసి వీధి రౌడీలా వ్యవహరించారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 22 May 2024 06:12 IST

పోలింగ్‌ రోజు బరితెగించిన ప్రజాప్రతినిధి
పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై విమర్శల వెల్లువ 
ఈనాడు, నరసరావుపేట 

రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన.. చట్టాలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికార వైకాపాకు చెందిన మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసి వీధి రౌడీలా వ్యవహరించారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే, మాచర్ల వైకాపా అభ్యర్థి రామకృష్ణారెడ్డి పోలింగ్‌ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రం 202లోని బూత్‌లోకి అనుచరులతో వెళ్లారు. అలా వెళ్లటం నిబంధనలకు విరుద్ధం. బూత్‌లోని ఈవీఎంను బయటకు పట్టుకొచ్చి నేలకేసి కొట్టి ధ్వంసం చేయడం సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. అది సిట్‌ విచారణతో బహిర్గతమైంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, సహాయమంత్రి హోదా కలిగిన విప్‌ పదవిలో ఉన్న వ్యక్తే ఇలా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాచర్లలో ఈవీఎంల విధ్వంసాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలట్ల ధ్వంసం వంటివి అధికార వైకాపా నాయకులకు పరిపాటిగా మారిందని ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు సైతం గుర్తుచేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఎన్నికల విధులు అంటే ఉద్యోగులకు కత్తిమీద సామేనని చాలామంది అక్కడ విధులకు వెళ్లటానికి ఇష్టపడరు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే వెళ్లాల్సి వస్తుందని ఉద్యోగి ఒకరు తెలిపారు. అక్కడ వైకాపా నేతల ఆగడాలకు అడ్డూ అదుపు ఉండదు. అది గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లోనే స్పష్టమైంది. ఎన్నికల యంత్రాంగంపై విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తారు. అనేక విధాలుగా ప్రభావితం చేస్తారని వారి వ్యవహారాలు తెలిసిన పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ రోజున వైకాపా నేతలు ధ్వంసం చేసిన ఓటింగ్‌ యంత్రాలు 

అరెస్టులకు భయపడి..

ఎన్నికల బదిలీల్లో భాగంగా జిల్లాలో పనిచేసిన పోలీసుల్ని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు పంపారు. ఆ జిల్లాలకు చెందిన వారికి ఇక్కడ పోస్టింగ్‌లు ఇచ్చారు. అయితే మాచర్ల రూరల్, అర్బన్, కారంపూడి సీఐ, ఎస్సై పోస్టులకు ఎవరూ పోటీ పడలేదు. కొన్నిరోజుల పాటు ఖాళీగా ఉన్నాయి. చివరకు ఉన్నతాధికారులే భరోసా ఇచ్చి బలవంతంగా పంపారు. దీనికి కారణం అక్కడ ఎమ్మెల్యే సోదరుల అరాచకాలే. పోలింగ్‌ వేళ నేరాలు, ఘోరాలు చేస్తుంటారు. ఆ సమయంలో వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లడమో గృహ నిర్బంధమో చేయాల్సి వస్తుంది. ఆ పనిచేస్తే తమను భవిష్యత్తులో గుర్తు పెట్టుకుంటారన్న ఆందోళనతో చాలామంది అక్కడ పనిచేయడానికి ఆసక్తి చూపలేదు. అదే సాధారణ రోజుల్లో అక్కడ పోస్టింగ్‌లు అంటే చాలామంది ఎమ్మెల్యే ఆశీస్సుల కోసం క్యూలు కట్టేవారు.  తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యం తీసుకొచ్చి భారీగా విక్రయాలు చేశారు. పోలీసులకు విక్రేతల నుంచి డబ్బులు ముడతాయి. అలాగే గ్రానైట్‌ లారీలు తెలంగాణలోకి ప్రవేశం కూడా మాచర్ల నుంచే వెళ్లాలి. దీంతో గ్రానైట్‌ లారీల నుంచి ఆదాయం వస్తుందని పోలీసు అధికారులు ఏరికోరి పోస్టింగ్‌ వేయించుకునేవారు. అలాంటిది ఎన్నికల సమయంలో అక్కడ వారి అరాచకాలు తెలుసుకుని ఎవరూ పోస్టింగ్‌లకు పైరవీలు చేసుకోలేదు. 

నిబంధనలకు విరుద్ధంగా వెళ్లడం నేరం..

పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను దృష్టిలో పెట్టుకుని అక్కడ విధి నిర్వహణలో ఉండే పోలీసులు వెంటనే ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాలి. అసలు పోలింగ్‌ బూత్‌లోకి అనుచరులతో వెళ్లడమే నేరం. ఆయన అలా వెళుతుంటే వెంటనే అక్కడ ఉన్న పీవో అరెస్టుకు ఆదేశించాలి. కానీ అటు పోలీసులు ఇటు పీవో ఎవరికివారు భయపడి మిన్నకుండిపోయారు. కనీసం ఆ ఘటనలను పీవో తన డైరీలో అయినా నమోదు చేశారా లేదా అన్నది ప్రశ్నార్థకం. ఒక్క పీవోనే కాదు సూక్ష్మ పరిశీలకులు సైతం జిల్లా ఎన్నికల పరిశీలకుని దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్లి వెంటనే ఆ ఈవీఎంను పరిశీలించేలా చేయాలి. అయితే వారు ఆ పని చేసినట్లు లేదు. సిట్‌ దర్యాప్తు చేసే వరకు ఘటన వెలుగులోకి రాలేదని తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని