మద్యం తరలిస్తున్న వాహనం బోల్తా

మద్యం సీసాల లోడుతో వెళ్తున్న వ్యాను జాతీయ రహదారిపై బోల్తా పడటంతో కొందరు అందినకాడికి మందు సీసాలు ఎత్తుకెళ్లారు.

Updated : 23 May 2024 04:51 IST

మందు సీసాలతో ఉడాయించిన కొందరు స్థానికులు 

మద్యం సీసాలను మరో వాహనంలోకి మార్చుతున్న దృశ్యం 
కంటోన్మెంట్, న్యూస్‌టుడే: మద్యం సీసాల లోడుతో వెళ్తున్న వ్యాను జాతీయ రహదారిపై బోల్తా పడటంతో కొందరు అందినకాడికి మందు సీసాలు ఎత్తుకెళ్లారు.  ఈ ఘటన బోయిన్‌పల్లి ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణరెడ్డి, స్థానికుల వివరాల ప్రకారం... కొంపల్లికి చెందిన బసలింగప్ప (35) డీసీఎం కంటెయినర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఇద్దరు సహాయకులను తీసుకొని దేవర్‌యాంజల్‌లోని ఐఎంఎఫ్‌ఎల్‌ డిపోకు వెళ్లాడు. సుమారు రూ.32లక్షలు విలువజేసే వివిధ కంపెనీలకు చెందిన మద్యం సీసాల కాటన్‌ బాక్సులను వ్యాన్‌లో ఎక్కించుకొని మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో డిపో నుంచి పంజాగుట్ట, బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 10లోని గౌరీశంకర్, శ్రీనివాస్, శ్రీ మద్యం దుకాణాలకు బయలుదేరాడు. బోయిన్‌పల్లి చెక్‌పోస్టు సమీపంలోని లిక్కర్‌ మార్టు వద్దకు చేరుకోగానే వెనక టైరు పేలడంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. లోపలి మద్యం కాటన్లు రోడ్డుపై చిందరవందరగా పడ్డాయి. దీన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు మద్యం సీసాలతో ఉడాయించారు. బసలింగప్ప, అతని సహాయకులు తేరుకొని క్యాబిన్‌లోంచి బయటకు వచ్చి పలువురు స్థానికులు, లిక్కర్‌ మార్టు భద్రత సిబ్బందితో కలిసి మద్యం సీసాలను పట్టుకెళ్తున్న వారిని నివారించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న బోయిన్‌పల్లి లాఅండ్‌ఆర్డర్, ట్రాఫిక్‌ పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని