దాతల స్థలం... దర్జాగా కబ్జా

విద్యార్థుల భవిష్యత్తుకు దాతలు ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అధికారులు ఎన్నికల్లో తలమునకలవగా కబ్జాదారుడు దర్జాగా స్థలాన్ని కొట్టేయడానికి దీని చుట్టూ రక్షణకు సిమెంటు స్తంభాలు ఏర్పాటు చేసేందుకు శుక్రవారం కూలీలతో గోతులు తవ్వించే పనులు ప్రారంభించాడు.

Updated : 25 May 2024 04:07 IST

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

విద్యార్థుల భవిష్యత్తుకు దాతలు ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అధికారులు ఎన్నికల్లో తలమునకలవగా కబ్జాదారుడు దర్జాగా స్థలాన్ని కొట్టేయడానికి దీని చుట్టూ రక్షణకు సిమెంటు స్తంభాలు ఏర్పాటు చేసేందుకు శుక్రవారం కూలీలతో గోతులు తవ్వించే పనులు ప్రారంభించాడు. పాఠశాల స్థలం ఆక్రమణకు గురవుతోందనే విషయం తెలియడంతో పార్టీలకు అతీతంగా గ్రామస్థులు దీనిని అడ్డుకోవడానికి ముందుకొచ్చారు. 

చ్యుతాపురం మండలం దోసూరు సర్వే నంబర్‌ 123లో రెండు ఎకరాలు, సర్వే నంబర్‌ 116లో 1.06 ఎకరాల భూమిని 21.01.1961న ఈ గ్రామానికి చెందిన వారణాసి శ్రీహరిరావు, వారణాసి వెంకట నరసింహమూర్తి పాఠశాల కోసం బహుమతిగా రాశారు. తరవాత కాలంలో ఇదే స్థలాన్ని మైనర్‌ దాత అయిన వారణాసి బాలసుందరం అనకాపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో విశాఖకు చెందిన ఇద్దరికి విక్రయించాడు. ఈ స్థలం తమకు చెందిందని కొనుగోలు చేసిన వ్యక్తులు 2022లో అక్టోబర్‌లో స్థలం చుట్టూ స్తంభాలు వేయడానికి ప్రయత్నించారు. వైకాపాకు చెందిన ఓ మంత్రి అండదండలతో ఈ విధంగా చేస్తున్నారని తెలుసుకున్న గ్రామానికి చెందిన నాయకులు అఖిలపక్షంగా ఏర్పడి దీనిని అడ్డుకున్నారు. స్థలాన్ని కాపాడి పాఠశాలకు చెందే విధంగా హైకోర్టులో కేసువేసి దీనిని కాపాడడానికి కృషి చేస్తున్నారు. అధికారులు ఎన్నికల్లో తలమునకలై ఉండగా శుక్రవారం ఇదే స్థలం చుట్టూ స్తంభాలు వేయడానికి గోతులు తీయడంతో పార్టీలకు అతీతంగా నాయకులు పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. ఆక్రమణను అడ్డుకోకుంటే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో పోలీసులు స్పందించి పనులు నిలిపివేయించారు. గతంలో ఆక్రమణకు ప్రయత్నించినప్పుడు జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ సుభద్రతోపాటు జిల్లా పరిషత్‌ అధికారులు, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఈ స్థలం ప్రభుత్వానిదని బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. దీనిపై అచ్యుతాపురం సీఐ బుచ్చిరాజు వివరణ కోరగా స్థలాన్ని ఆక్రమిస్తున్నట్లు గ్రామపెద్దలు దృష్టికి తీసుకురావడంతో పనులు నిలిపివేయించామని చెప్పారు. స్థలానికి చెందిన రికార్డులు పరిశీలిస్తామని తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని