ఆరోగ్యశ్రీపై బకాయిల బండ

పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మూడు వేలకు పైగా చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోని తీసుకొచ్చాం. వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాం.. అంటూ సీఎం జగన్‌ ప్రసంగాల్లో ఊదరగొట్టారు.

Updated : 25 May 2024 06:37 IST

ఎంతకూ బిల్లులివ్వని ప్రభుత్వం
సేవలందక పేదలకు ఇబ్బందులు

 

  • జంగారెడ్డిగూడేనికి చెందిన సత్యనారాయణ (55) చాలా రోజుల నుంచి కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు. రెండు రోజుల కిందట ఏలూరు అశోక్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి యాజమాన్యాన్ని సంప్రదించగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాం.. కిడ్నీ శస్త్ర చికిత్స చేయాలంటే రూ.1.5 లక్షలు చెల్లించాలన్నారు. అంత స్తోమత లేక వారు వెనుదిరిగారు.
  • తణుకు జాతీయ రహదారి సమీపంలోని ప్రముఖ ఆసుపత్రిలో రెండు రోజుల కిందటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేశారు. వెంకటేశ్వర కూడలి, తణుకు బస్టాండు సమీపంలోని రెండు ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు నిలిపివేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రెండు రోజులుగా ఆరోగ్యశ్రీ సేవల కోసం వస్తున్న రోగులు వెనుదిరుగుతున్నట్లు తెలుస్తోంది.
  • నాయుడు దుర్గమ్మ (60) అనే మహిళకు కర్ణభేరి సమస్య రావడంతో చెవికి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఏలూరులో జాతీయ రహదారి సమీపంలోని ఓ ఆసుపత్రికి సోమవారం తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ అందుబాటులో లేదని, నగదు చెల్లించి చికిత్స చేయించుకోవాలని యాజమాన్యం చెప్పింది. అంత ఆర్థిక స్తోమత లేక శస్త్ర చికిత్స చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.

ఈనాడు, ఏలూరు : పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మూడు వేలకు పైగా చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోని తీసుకొచ్చాం. వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాం.. అంటూ సీఎం జగన్‌ ప్రసంగాల్లో ఊదరగొట్టారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఆరోగ్యశ్రీ నిర్వహణ పూర్తిగా గాడితప్పింది. రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోవడం, కొన్ని ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేయడంతో పేదల ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు అందక ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీకి తెరతీశారు.

ఆసుపత్రులపై ఆర్థిక భారం

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు అన్ని కలిపి 58 ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. మొత్తం 12.3 లక్షల మంది వరకు లబ్ధిదారులున్నారు. జగన్‌ ప్రభుత్వం ఏడాది నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రులపై ఆర్థిక భారం పడటంతో యాజమాన్యాలు చేతులెత్తేశాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.130 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ప్రధాన ఆరోగ్యశ్రీ ఆసుపత్రి ఆశ్రంకే రూ.12 కోట్ల బకాయిలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

పొంతన లేదు.. అధికారులు చెబుతున్న దానికి క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. ఉమ్మడి జిల్లాలో ఆశ్రం తప్ప అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లిన వారికి మాత్రం ఆరోగ్యశ్రీ సేవలు లేవని యాజమాన్యాలు బదులిస్తున్నాయి. ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, జంగారెడ్డిగూడెంలలోని చాలా ఆసుపత్రుల్లో వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు.

ప్రైవేటు దోపిడీ.. ఆరోగ్య శ్రీ సేవలు సవ్యంగా సాగకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. అత్యవసర సమయంలో శస్త్ర చికిత్సలు ఆపేయడంతో వచ్చిన రోగుల్లో కొందరు ఆర్థిక స్తోమత లేక వెనుదిరుగుతున్నారు. మరికొందరు అప్పులు చేసి డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో మాత్రం ఆరోగ్యశ్రీ అవచ్చు.. కాకపోవచ్చని ముందే చెబుతున్నారు. వస్తే ఉచితంగా వైద్యం చేస్తాం.. లేదంటే మీరే డబ్బులు చెల్లించాలని అంటున్నారు. దీంతో పేదల పరిస్థితి దయనీయంగా ఉంది.

ఈ విషయమై ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ రాజీవ్‌ను వివరణ కోరగా అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని.. చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు