స్త్రీనిధి రుణం.. అక్రమార్కుల పరం..!

స్వయం సహాయక సంఘాల సభ్యుల అవసరాల కోసం స్త్రీనిధి రుణాలు ఇస్తుండగా వాటిని తిరిగి చెల్లించే విషయంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. భారీగా బకాయిపడిన స్త్రీనిధి రుణాలు పొందిన వారి జాబితాలు ఇప్పటికే ఉన్నతాధికారులకు చేరాయి. 

Updated : 26 May 2024 06:11 IST

ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాల సభ్యుల అవసరాల కోసం స్త్రీనిధి రుణాలు ఇస్తుండగా వాటిని తిరిగి చెల్లించే విషయంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. భారీగా బకాయిపడిన స్త్రీనిధి రుణాలు పొందిన వారి జాబితాలు ఇప్పటికే ఉన్నతాధికారులకు చేరాయి. 

జిల్లాలో ఆరు వేల సంఘాలు

జిల్లాలోని నగరపాలిక/పురపాలికల పరిధిలో 6 వేల స్వయం సహాయక సంఘాలు, 246 సమాఖ్యలు ఉన్నాయి. నగరపాలిక, పురపాలికల్లో పట్టణ సమాఖ్య ద్వారా స్త్రీనిధి వాటాధనం తీసుకుంటాయి. సమృద్ధి పొదుపు ద్వారా సమాఖ్యకు రుణాలు తీసుకునేందుకు అర్హత లభిస్తుంది.  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే రుణం మంజూరవుతుంది. ముందుగా సమాఖ్య సంఘాల సభ్యులు తీర్మానించుకొని రూ.3 లక్షల వరకు రుణాలు మంజూరు చేసే అవకాశముంటుంది. దీన్ని ఏడాదిలోగా తిరిగి చెల్లించాలి.

వెలుగుచూసిన అక్రమాలు

స్త్రీనిధి రుణాలను సొంత అవసరాలకు కొందరు ఆర్పీలు వినియోగించుకున్నారు. వీటిని చెల్లించకుండా నాలుగేళ్లుగా బకాయిలు పడుతున్నారు. స్త్రీనిధి క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా ఈ అక్రమాలు బయటపడ్డాయి.

13 మంది ఆర్పీలకు నోటీసులు

స్త్రీనిధి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని సంఘాల్లోని సభ్యులు, ఓబీలకు, 13 మంది ఆర్పీలు సొసైటీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. నోటీసులకు కొంతమంది స్పందించకపోవడంతో మెప్మా పీడీకి లేఖ రాశారు.

రూ.68 లక్షలు గోల్‌మాల్‌

స్త్రీనిధి కింద తీసుకున్న రుణాలను సంఘాల సభ్యులు చెల్లిస్తుండగా కొందరు ఆర్పీలు, ఓబీలు వాటిని ఇష్టారాజ్యంగా వాడుకున్నారు. నాలుగేళ్లుగా ఖమ్మం నగరపాలికలో 12 మంది ఆర్పీలు రూ.66 లక్షలు, వైరాలో ఒక ఆర్పీ సుమారు రూ.2 లక్షల మేరకు దుర్వినియోగం చేసినట్లు సమాచారం. సీఓలకు, ఇతర అధికారులకు దీనిపై అజమాయిషీ లేకపోవడంతో అక్రమాలకు తెరలేపినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై  స్త్రీనిధి మేనేజర్‌ ఆనంద్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఇప్పటికే వారితో ఒక దఫా చర్చించామని, మరోసారి నోటీసులు ఇస్తామని తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని