నిబంధనలపై అవగాహన.. ప్రచారం కల్పిస్తే ఆదరణ

నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తే ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుంది.

Updated : 26 May 2024 06:04 IST

ఆర్టీఏ ఆవరణలో పిల్లల ట్రాఫిక్‌ పార్కు
న్యూస్‌టుడే, తెలంగాణచౌక్‌(కరీంనగర్‌)

 ఆర్టీఏ కార్యాలయ ఆవరణలోని ట్రాఫిక్‌ అవగాహన పార్కు

నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తే ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుంది. 2019లో తిమ్మాపూర్‌లోని రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో పిల్లల ట్రాఫిక్‌ అవగాహన పార్కు ఏర్పాటు చేశారు. మొదట్లో  విద్యార్థులను ఇక్కడకు తీసుకొచ్చినా, ఆ తర్వాత ఆదరణ కొరవడింది. మళ్లీ ప్రచారం కల్పిస్తే పిల్లలు వచ్చి నిబంధనలపై అవగాహన పెంచుకునే అవకాశముంది.

సందేహాల నివృత్తి..

ట్రాఫిక్‌ అవగాహన పార్కులో ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.30 చొప్పున, సర్కారు బడి పిల్లలకు ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. పార్కులో ప్రవేశానికి ముందు విద్యార్థుల సంఖ్యను బట్టి పిల్లలను గ్రూపులుగా విభజించి ఆడిటోరియంలో ఉదయం, మధ్యాహ్నం ట్రాఫిక్‌కు సంబంధించిన తరగతులు చెబుతారు. గంట సేపు ప్రొజెక్టర్‌పై ఫొటో, వీడియోల ద్వారా తరగతులు చెబుతూ సందేహాలుంటే వెంటనే నివృత్తి చేస్తారు. ట్రాఫిక్‌పై పూర్తి అవగాహన వచ్చేలా కృషి చేస్తారు.

తరగతుల ఆధారంగా..

తరగతులు విన్న విద్యార్థులకు సైకిల్, శిరస్త్రాణం అందించి ట్రాఫిక్‌ అవగాహనకు పార్కులోకి పంపుతారు. విన్న పాఠాల ఆధారంగా విద్యార్థులు పార్కులో సైకిళ్లపై చక్కర్లు కొడుతూ తిరుగుతారు. మధ్యమధ్యలో స్టాప్, సిగ్నల్, క్రాసింగ్, మూవ్, హారన్, డోన్ట్‌ హారన్, రైల్వేట్రాక్, పాఠశాల, ఆసుపత్రి జోన్, మార్కెట్‌ వంటి చిహ్నాలు కనిపిస్తాయి. తరగతి గదిలో నేర్చుకున్న వివరాలను నివృత్తి చేసుకుంటూ విద్యార్థులు పార్కును చుట్టిరావాల్సి ఉంటుంది.

అనుభవాల పాఠాలు..

విద్యార్థుల్లో కొందరిని ట్రాఫిక్‌ పోలీసులుగా నియమిస్తారు. పార్కులో మిగిలిన పిల్లలు సైక్లింగ్‌ చేసే  సమయంలో వారు నియమాలను పాటిస్తున్నారా? లేదా? అని వీరు పరిశీలిస్తారు. నియమాలను ఉల్లంఘించిన విద్యార్థులకు జరిమానా విధింపు, ట్రాఫిక్‌ ఆంక్షలు చోదకులకు వివరించేలా శిక్షణ ఇప్పిస్తారు. సైకిల్‌ తొక్కడం రాని విద్యార్థులు ఫుట్‌బోర్డుపై నడుచుకుంటూ ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన పెంచుకోవచ్చు. అనంతరం విద్యార్థుల అనుభవాలు, నేర్చుకున్న విషయాలను తోటి విద్యార్థులతో ఆడిటోరియంలో చర్చిస్తారు. ఇదంతా అధికారులు దగ్గరుండి పరిశీలిస్తారు.

ఇప్పటికీ 9451 మంది రాక

పార్కు ప్రారంభం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 9451 మంది విద్యార్థులు పార్కును సందర్శించి ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన పెంచుకున్నారు. కరోనా తర్వాత పార్కుకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గింది. వచ్చే నెలలో పాఠశాలలు పునఃప్రారంభంకానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ అవగాహన పార్కుపై ప్రచారం చేసినట్టయితే విద్యార్థులు వచ్చే అవకాశముంది.

దృష్టి సారిస్తాం

ట్రాఫిక్‌ అవగాహన పార్కుకు విద్యార్థులు వచ్చేలా చూస్తాం. విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ విషయంపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల దృష్టికి తీసుకెళ్తాం. విద్యార్థి దశ నుంచే రహదారి నిబంధనలు తెలుసుకోవడం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.

పెద్దింటి పురుషోత్తం, డీటీసీ, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని