అతివలకు ఆలంబన

మహిళలు వివిధ వ్యాపారాల్లో రాణించి ఆర్థికంగా మరింత బలపడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం మహిళా సంఘాల సభ్యులు చిన్న, మధ్య తరహా వ్యాపారాలు చేస్తున్నారు.

Updated : 26 May 2024 06:15 IST

స్త్రీనిధి వార్షిక రుణ లక్ష్యంగా రూ.252.79 కోట్లు ఖరారు  

మహబూబ్‌నగర్‌లో స్త్రీనిధి రుణాలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్న మెప్మా సీవోలు  

గద్వాల న్యూటౌన్, మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే  : మహిళలు వివిధ వ్యాపారాల్లో రాణించి ఆర్థికంగా మరింత బలపడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం మహిళా సంఘాల సభ్యులు చిన్న, మధ్య తరహా వ్యాపారాలు చేస్తున్నారు. వారు పెద్ద వ్యాపారాలు కూడా చేపట్టేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మహిళలు 11 రకాల వ్యాపారాలు చేపట్టేందుకు ఉమ్మడి జిల్లాలో రూ. 252.79 కోట్ల రుణాలు ఇవ్వాలని స్త్రీనిధి బ్యాంకు ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ).. సెర్ప్‌ ద్వారా గ్రామాల్లో, మెప్మా ద్వారా పురపాలికల్లోని మహిళా సంఘాల సభ్యులకు రుణాలు ఇచ్చేందుకు లక్ష్యాలు ఖరారు అయ్యాయి. 

ప్రతి మహిళకు రుణసాయం : ఉమ్మడి జిల్లాలో డీఆర్డీఏ, సెర్ప్‌ పరిధిలో 36,286 స్వయం సహాయక సంఘాలు, వాటిలో 5,44,290 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 19 పురపాలికల పరిధిలో మెప్మా కింద 10,060 స్వయం సహాయక సంఘాలు, వాటిలో 1,50,900 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు స్త్రీనిధి ద్వారా ఏటా సువిధ, అక్షయ పేర్లతో రుణాలు ఇస్తూ స్వయంశక్తితో ఎదిగేలా ప్రోత్సహిస్తున్నారు. సువిధ పథకం కింద ఆసక్తి ఉన్న ప్రతి మహిళకు వ్యక్తిగత రుణం కింద రూ.10వేల నుంచి రూ.40వేల వరకు రుణం అందిస్తారు. ఈ డబ్బుతో వారు ఏదైనా జీవనోపాధి చేపట్టొచ్చు. ఏదైన వ్యాపారం చేపట్టాలనుకునే మహిళలకు అక్షయ పథకం కింద ఉమ్మడిగా లేదా వ్యక్తిగతంగా రాయితీ ద్వారా రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు రుణాలు అందిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాలపై సెర్ప్, మెప్మా అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.


నాగర్‌కర్నూల్‌కు అధిక లక్ష్యం 

ఈ ఏడాది నాగర్‌కర్నూల్‌ జిల్లాకు స్త్రీనిధి రుణ లక్ష్యం అధికంగా నిర్దేశించారు. డీఆర్డీఏ - సెర్ప్‌ ద్వారా గ్రామాల్లోని సంఘాలకు రూ.70.78 కోట్లు, మెప్మా ద్వారా పురపాలకల్లోని మహిళా సంఘాలకు రూ.13.32 కోట్ల రుణాలు మంజూరు చేయనున్నారు. అత్యంత తక్కువ రుణ లక్ష్యం జోగులాంబ గద్వాల జిల్లాకు కేటాయించారు. ఇక్కడ సెర్ప్‌ ఆధ్వర్యంలోని గ్రామీణ మహిళా సంఘాలకు రూ.18.28 కోట్లు, మెప్మా ద్వారా పురపాలికల్లోని సంఘాలకు కేవలం రూ.19 లక్షలు నిర్దేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని