వాయువేగం.. జనం ఆగం

ఆదివారం మధ్యాహ్నం జనం సేద తీరుతుంటే.. ఒక్కసారిగా  భయంగొలిపే గాలీవాన శివారు ప్రజలను వణికించింది.  కేవలం రెండు గంటల్లో హోరుగాలి... భారీవర్షం భయోత్పాతాన్ని సృష్టించింది.

Updated : 27 May 2024 05:20 IST

భీకర గాలులకు వణికిన రాజధాని
నేలకొరిగిన వృక్షాలు.. అంధకారంలో కాలనీలు
చెట్లకొమ్మలు, ఇటుక రాళ్లు పడి నలుగురి మృతి

వనస్థలిపురం గణేశ్‌టెంపుల్‌ వద్ద కూలిన భారీ వృక్షం

  • హయత్‌నగర్, కుంట్లూరు, వనస్థలిపురం, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో గాలివాన దెబ్బకు యాభైకి పైగా చెట్లు కూలిపోయాయి. నాలుగైదు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
  • వనస్థలిపురంలో సాగర్‌రింగ్‌రోడ్డు, బీఎన్‌రెడ్డినగర్, తుర్కయాంజాల్‌ ప్రాంతాల్లో అరగంటసేపు ఏకధాటిగా వర్షం కురిసింది. 
  • నిజాంపేట బృందావన్‌కాలనీ, హైదర్‌నగర్‌లో టిఫిన్‌సెంటర్లు, చెరుకురసం బండ్లపై రేకులు, టార్పాలిన్‌లు ఎగిరిపోయాయి. 
  • హిమాయత్‌నగర్‌ కూడలి వద్ద ఏర్పాటు చేసిన గ్రీన్‌మ్యాట్‌ షెడ్‌ గాలికి ఎగిరింది. పరదాకు  ఉన్న ఇనుప గొట్టాలు ఆర్టీసీబస్సు, ఇన్నోవాకారుపై పడ్డాయి. హయత్‌నగర్‌లోని ఆర్టీసీ డిపోలో  బస్సుపై భారీ చెట్టుపడింది. 

బడంగ్‌పేట పరిధి మల్లాపూర్‌లో ఓ ఇంటిపై పిడుగు పడడంతో దెబ్బతిన్న గోడ

ఈనాడు, హైదరాబాద్‌: ఆదివారం మధ్యాహ్నం జనం సేద తీరుతుంటే.. ఒక్కసారిగా  భయంగొలిపే గాలీవాన శివారు ప్రజలను వణికించింది.  కేవలం రెండు గంటల్లో హోరుగాలి... భారీవర్షం భయోత్పాతాన్ని సృష్టించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీవృక్షాలు ఒక్కసారిగా నేలకొరిగాయి..కార్లు, బైకులు వాటికింద నలిగిపోయాయి. విద్యుత్తు తీగలపై పడడంతో కరెంటు సరఫరా గంటల తరబడి నిలిచిపోయింది. శివారు ప్రాంతాల్లో వందకుపైగా కాలనీల్లో అంధకారం నెలకొంది. అర్ధరాత్రి దాటినా చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరించలేదు. ఎల్బీనగర్, కూకట్‌పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా వనస్థలిపురంలో 1.3 సెంటీమీటర్ల వర్షం కురవగా.. మియాపూర్‌లో 0.8సెం.మీ, గచ్చిబౌలిలో 0.5 సెం.మీ వాన కురిసింది. 

ఘట్‌కేసర్‌లో కూలిన విద్యుత్తు స్తంభం


గాలిలో కలిసిన నాలుగు ప్రాణాలు 

కీసర, మియాపూర్, న్యూస్‌టుడే: ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సానికి చెట్లకొమ్మలు, ఇటుక రాళ్లు మీద పడి వేర్వేరుచోట్ల నలుగురు మృతి చెందారు.  చెట్లకొమ్మలు మీదపడి.. యాదాద్రి జిల్లా బొమ్మలరామారానికి చెందిన నాగిరెడ్డి రాంరెడ్డి(60) ఎరువుల దుకాణం నడుపుతున్నారు. సమీపంలోని ధర్మారంలో కోళ్ల ఫారం నిర్వహిస్తున్న దేశినేని ధనుంజయ్‌(44)తో అతనికి పరిచయం ఉంది. ఆదివారం రాంరెడ్డి దుకాణానికి వచ్చిన ధనుంజయ్‌ను వెంట తీసుకొని శామీర్‌పేట మండలం తూంకుంటలో తన బంధువులకు మామిడి పండ్లు ఇచ్చేందుకు ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. తిమ్మాయిపల్లి వద్దకు రాగానే ఈదురు గాలులతో వర్షం మొదలైంది. ఆగకుండా అలాగే వెళ్తుండటంతో ఒక్కసారిగా రోడ్డు పక్కనున్న చెట్టు కొమ్మ విరిగి వీరిపై పడింది. ధనుంజయ్‌ ఛాతికి చెట్టు కొమ్మ వచ్చి బలంగా తగిలింది. వెనకున్న రాంరెడ్డి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయారు.తీవ్ర గాయాలతోనే ధనుంజయ్‌.. రాంరెడ్డి కుటుంబసభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించారు. ఆ తర్వాత ధనుంజయ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.  

భారీ గాలులకు ప్రతాపసింగారంలో విరిగిపడిన రేకులు

ఇటుక రాళ్లు ఎగిరొచ్చి..  హఫీజ్‌పేట సాయినగర్‌లో నసీముద్దీన్‌ కుటుంబం ఉంటుంది. ఆదివారం సాయంత్రం ఈదురుగాలులకు ఇంట్లో నిద్రిస్తున్న ఆయన కుమారుడు సమద్‌(4)పై ఇటుక రాయి పడడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

  • అదే సమయంలో సాయినగర్‌ పక్కనే ఉన్న యూత్‌ కాలనీలో మెడికల్‌ షాప్‌ నిర్వహించే రషీద్‌(45) తన చిన్న కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్నాడు. సమీపంలోని ఓ ఇంటి రేకుపై ఉన్న ఇటుక రాళ్లు ఎగిరిపడడంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: నగరంలో ఆదివారం పడిన వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఈ సందర్భంగా పలువురి నుంచి జీహెచ్‌ఎంసీకి    ఫిర్యాదులు అందాయి. కూలిపోయిన చెట్లకు సంబంధించి 48 ఫిర్యాదులు రాగా డీఆర్‌ఎఫ్‌ బృందాలు వాటిలో 42 అంశాలను పరిష్కరించారు. రహదారులపై గుంతల పూడ్చివేతకు సంబంధించి వచ్చిన 5 ఫిర్యాదులను పరిష్కరించారు.

కుంట్లూరు ఆర్‌వీఆర్‌ కాలనీలో వేసుకున్న గుడిసెలు కొట్టుకుపోవడంతో తిరిగి నిర్మించుకుంటున్న బాధితులు

మేడ్చల్‌ పరిధిలో కూలిపోయిన పెంకుటిల్లు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని