విచారణకు సహకరిస్తా

మహిళలపై లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఈనెల 31న ప్రత్యేక దర్యాప్తు దళం (ఎస్‌ఐటీ) విచారణకు హాజరవుతానని ప్రకటించారు.

Updated : 28 May 2024 06:57 IST

వీడియో విడుదల చేసిన ప్రజ్వల్‌

వీడియోలో మాట్లాడుతున్న ప్రజ్వల్‌ రేవణ్ణ

ఈనాడు, బెంగళూరు : మహిళలపై లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఈనెల 31న ప్రత్యేక దర్యాప్తు దళం (ఎస్‌ఐటీ) విచారణకు హాజరవుతానని ప్రకటించారు. ఆయన సోమవారం ఓ అజ్ఞాత స్థలం నుంచి వీడియో విడుదల చేశారు. తొలుత.. తల్లిదండ్రులు, తాత, బాబాయి కుమారస్వామి, పార్టీ కార్యకర్తలకు క్షమాపణ కోరారు. అనంతరం మాట్లాడుతూ.. ‘నేను ఏప్రిల్‌ 27న విదేశాలకు వెళ్లే సమయానికి నాపై ఆరోపణలు లేవు, కేసు కూడా నమోదు చేయలేదు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం విదేశాలకు వెళ్లా. అక్కడ ఉండగానే.. నాపై ఆరోపణలు వచ్చినట్లు తెలుసుకున్నా. వెంటనే ఎస్‌ఐటీ ఏర్పాటు చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఎక్స్‌ అకౌంట్, నా లాయర్‌ ద్వారా వారం రోజుల సమయం కోరాను. ఆలోగానే కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ, ఇతర నేతలంతా నాపై బహిరంగ సభల్లో విమర్శిస్తూ ప్రచారానికి ఉపయోగించుకున్నారు. దీనితో మానసికంగా ఒత్తిడికిలోనయ్యా. మరోవైపు నా రాజకీయ ఉన్నతిని ఓర్వలేని ప్రత్యర్థులు హాసనలోనూ రాజకీయ కుట్రలకు పాల్పడ్డారు. అందుకే కాస్త దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. నన్ను ఎవరూ తప్పుగా భావించకండి. ఈనెల 31న సిట్‌ ముందు హాజరై విచారణకు సహకరిస్తా. న్యాయస్థానంపై విశ్వాసం ఉన్న నేను ఈ తప్పుడు కేసుల నుంచి బయటపడతా. దేవుడు, ప్రజలతో పాటు కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు నాపై ఉండాలి. సిట్‌ విచారణ ద్వారా నాపై వస్తున్న ఆరోపణలకు తెరదింపుతా’నని ప్రజ్వల్‌ చెప్పారు.

 మా మనవికి స్పందించి ఎస్‌ఐటీ విచారణకు హాజరవుతానని ప్రజ్వల్‌ ప్రకటించటం నాకు ఊరట కల్గించిందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ప్రజ్వల్‌పై ఇప్పటికే అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ప్రజ్వల్‌ వచ్చిన తర్వాత పోలీసులు అరెస్ట్‌ చేయడమే తరువాయని హోంమంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో తానెక్కడున్నది చెప్పకపోవటంతో పోలీసులు వీడియో మూలాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. సీబీఐ మనవి మేరకు ఈనెల 31తో ప్రజ్వల్‌ తీసుకున్న దౌత్య పాస్‌పోర్ట్‌ రద్దు చేసేందుకు విదేశీ వ్యవహారాల శాఖ సిద్ధమైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని