పట్టాలపై పరుగో.. పరుగు..

అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను అందిపుచ్చుకోవడంలో విజయవాడ రైల్వే డివిజన్‌ ముందంజలో ఉంది. ఫలితంగా వేగం పెరగడంతోపాటు ప్రయాణ సమయం తగ్గనుంది.

Updated : 30 May 2024 06:26 IST

సాఫీగా ప్రయాణికులు, సరకు రవాణా రైళ్లు
విజయవాడ డివిజన్‌లో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ
విజయవాడ(రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే

త్యాధునిక సాంకేతిక వ్యవస్థను అందిపుచ్చుకోవడంలో విజయవాడ రైల్వే డివిజన్‌ ముందంజలో ఉంది. ఫలితంగా వేగం పెరగడంతోపాటు ప్రయాణ సమయం తగ్గనుంది. గతంలో డివిజన్‌ పరిధిలో ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తితే సమాచారం తెలిసేందుకు గంటల సమయం పట్టేది. ప్రస్తుతం అన్ని విభాగాల్లోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో సమాచారం నిమిషాల వ్యవధిలోనే తెలిసిపోతుంది. దీంతో నష్టనివారణ చర్యలు వేగవంతం చేయడంతో పాటు తీవ్రతను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని డివిజన్‌ పరిధిలో మాన్యువల్‌గా ఉన్న వ్యవస్థను పూర్తి ఆటోమేటిక్‌గా తీర్చిదిద్దారు. రైలు పట్టాల క్రాసింగ్‌లోనూ పెనుమార్పులు వచ్చాయి. దీంతో రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్ణీత సమయంలోనే ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరనున్నారు.

నూతన సిగ్నలింగ్‌ వ్యవస్థ (ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నల్స్‌)

విజయవాడ డివిజన్‌ పరిధిలోని గన్నవరం-నూజివీడు సెక్షన్‌ మధ్య మొత్తం 22 అత్యాధునిక ఆటోమేటిక్‌ సిగ్నల్స్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఆటోమెటిక్‌ బ్లాక్‌ సిస్టం(ఏబీఎస్‌) అనేది రైల్వే సిగ్నలింగ్, రైల్వే లైన్లు, బ్లాక్‌లుగా విభజిస్తుంది. మొత్తం 21.21 కిమీ విస్తీర్ణంలో అధునాతన ఆటోమెటిక్‌ బ్లాక్‌ సిస్టంను తాజాగా విజయవాడ డివిజన్‌ అధికారులు ప్రారంభించారు. రైల్వే నెట్‌వర్క్, భద్రత, సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ వ్యవస్థ ముఖ్య లక్ష్యం. అత్యంత రద్దీగా ఉండే ఈ సెక్షన్‌లో రూ.31.81 కోట్ల వ్యయంతో ఈ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులు, సరకు రవాణా రైళ్లు సాఫీగా, సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు కొత్త సిగ్నలింగ్‌ వ్యవస్థ దోదహపడుతుంది.

రైలు పట్టాల క్రాసింగ్‌ ఇక సులువు

డివిజన్‌ పరిధిలోని వేటపాలెం రైల్వే యార్డులో వెల్డబుల్‌ కాస్ట్‌ మాంగనీస్‌ స్టీల్‌(డబ్ల్యూసీఎంఎస్‌)ను అందుబాటులోకి తెచ్చారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో అత్యంత రద్దీగా ఉండే విజయవాడ, గూడూరు సెక్షన్‌లో మొదటిసారి వేటపాలెంలో దీన్ని ఏర్పాటు చేశారు. రైలు మరో ట్రాక్‌పైకి క్రాస్‌ అయ్యే సమయంలో చాలా తక్కువ వేగంతో వెళ్తాయి. ఏ మాత్రం వేగం పెరిగినా పట్టాలు తప్పే అవకాశం ఉంటుంది. కొత్త వ్యవస్థ అమల్లోకి రావడంతో ఇకపై రైలు క్రాసింగ్‌ సమయంలో 130కిమీ వేగంతో ట్రాక్‌ మారేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటి వరకు స్టేషన్‌ పొడవునా టర్న్‌ అవుట్‌ పాయింట్లు ఉండేవి. ఈ పాయింట్లకు జాయింట్లు వేసేవారు. ప్రస్తుతం డబ్ల్యూసీఎంఎస్‌ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో తక్కువ దూరంలోనే క్రాసింగ్‌ ఉంటాయి. మాంగనీస్‌తో తయారు చేసినవి కావడంతో రైలు వేగంగా పట్టాలు మారడమే కాకుండా కుదుపులు కూడా ఉండవు. ప్రయాణం సాఫీగా సాగుతుంది.


గన్నవరం, పెదఅవుటపల్లి, తేలప్రోలు, నూజివీడు స్టేషన్లలో వరుసగా 4 అత్యాధునిక ఏబీఎస్‌ పరికరాలను అమర్చారు. వీటిని స్ట్రెస్డ్‌ ప్రీకాస్ట్‌ టెక్నాలజీతో నిర్మించారు.


క్షేమంగా గమ్యస్థానం చేర్చడమే లక్ష్యం

- నరేంద్ర ఆనందరావు పాటిల్, డీఆర్‌ఎం, విజయవాడ 

విజయవాడ డివిజన్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడం జోనల్‌ పరిధిలోని విజయవాడ డివిజన్‌లో ఇదే తొలిసారి. దీని ద్వారా డివిజన్‌ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యంగా రైల్వే శాఖ పని చేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని విభాగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని