Hyderabad: మీర్‌పేట ఘటన.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ ఆదేశం

మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నందనవనం కాలనీలో 16ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆరా తీశారు.

Updated : 22 Aug 2023 19:24 IST

హైదరాబాద్‌: మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నందనవనం కాలనీలో 16ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆరా తీశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్‌... 48గంటల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీ, రాచకొండ సీపీని ఆదేశించారు. రెడ్ క్రాస్‌ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ప్రతినిధులు తక్షణమే బాధితురాలి నివాసానికి వెళ్లి ఆమె కుటుంబానికి అవసరమైన సహాయ.. సహకారాలు అందించాలని గవర్నర్‌ ఆదేశించారు.

ఏం జరిగిందంటే?

16 ఏళ్ల ఎస్సీ బాలికపై గంజాయి మత్తులో ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ లాల్‌బజార్‌కు చెందిన బాలిక(16) తల్లిదండ్రులిద్దరూ గతంలో చనిపోవడంతో 15 రోజుల క్రితం తన సోదరుడి(14)తో కలిసి మీర్‌పేటలోని ఓ కాలనీకి వచ్చారు. సమీప బంధువైన అక్క దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. బాలిక దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. తమ్ముడు ఫ్లెక్సీలు కట్టే పనిచేస్తుంటాడు.

సోమవారం ఉదయం 9 గంటలకు బాలిక తన సోదరుడు, మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఎనిమిది మంది నిందితులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ బృందంలోని నలుగురు బాలిక మెడపై కత్తిపెట్టారు. భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. మిగిలినవారు ఆమె తమ్ముడితోపాటు అక్కడే ఉన్న చిన్నారుల్ని బెదిరించారు. పైకెళ్లిన నిందితుల్లో ముగ్గురు బాలికను కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.  బాలిక గట్టిగా కేకలు వేయడంతో పరారైనట్లు బాలిక బంధువులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని