TS Governor Speech : మాది ప్రజా ప్రభుత్వం.. దేశానికే ఆదర్శం కాబోతున్నాం: గవర్నర్‌ తమిళిసై

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించారు.

Updated : 15 Dec 2023 12:52 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాసేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రజాకవి కాళోజీ కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్‌.. దాశరథి సూక్తులతో ముగించారు.

గవర్నర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తాం.
  • తమ జీవితాల్లో మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు. ఇది సామాన్యుడి ప్రభుత్వమని గర్వంగా చెప్పే పరిస్థితి ఉంది.
  • 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రం ఇది. మా పాలన దేశానికే ఆదర్శం కాబోతోంది.
  • అమరవీరుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని పాలన సాగిస్తాం. స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి సభావేదికగా నివాళి అర్పిస్తున్నాం.
  • ప్రజాసంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలు ప్రకటించాం. హమీలకు చట్టబద్ధత కల్పించే దస్త్రంపై సీఎం తొలి సంతకం చేశారు.
  • తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికింది. ప్రజలకు ఇచ్చిన  ప్రతిమాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
  • బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోపే రెండు గ్యారంటీలు అమలు చేశాం.
  • ప్రతి ఆడబిడ్డను మహాలక్ష్మిగా చేయాలనేదే మా ప్రభుత్వ ఆలోచన.
  • వచ్చే వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తాం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
  • ప్రజల ఆరోగ్య భద్రత.. మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీని ప్రస్తుత అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచాం.
  • అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటిస్థలం.. గౌరవభృతి ఇస్తాం.
  • వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
  • ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. రూ 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ.
  • అసైన్డ్‌, పోడు భూములకు త్వరలోనే పట్టాల పంపిణీ
  • కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని