Tsrtc bill : ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం

 టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలిపారు. 

Updated : 14 Sep 2023 13:56 IST

హైదరాబాద్‌ : టీఎస్‌ఆర్టీసీని (TSRTC) ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్‌ తమిళిసై (Tamilisai) ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫారసుల విషయంలో ప్రభుత్వ స్పందనపై సంతృప్తి చెందిన గవర్నర్‌ తాజాగా ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్‌ అభినందనలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం శాసన సభలో బిల్లులను ప్రవేశపెట్టింది. వాటిని గవర్నర్‌కు పంపించగా.. ఆమె కొన్ని అంశాలపై అధికారుల వివరణ అడిగారు. అంతేకాకుండా 10 సిఫారసులు చేశారు. వీటిపై ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన తమిళిసై.. తాజాగా బిల్లుకు ఆమోదం తెలిపారు.

 ప్రజారవాణా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు, సేవలను ఇంకా విస్తృతపరిచేందుకు సంస్థలో పనిచేస్తున్న వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఇటీవల మంత్రి మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికులు గతంలో సమ్మె చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ సానుకూల నిర్ణయం వెలువరించింది. దీనిపై విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆర్‌అండ్‌ బీ, రవాణాశాఖ, జీఏడీ శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన బిల్లును వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి.. తుది ఆమోదం కోసం గవర్నర్‌కు పంపింది. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో.. తెలంగాణ ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 43,373 మంది ఉద్యోగులు ప్రభుత్వోద్యోగులుగా మారనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని