మరాఠీ విద్యార్థులు.. జపనీస్‌ నేర్చుకుంటున్నారు

తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏ భాషలో విద్యాబోధన చేయాలన్న అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. మాతృభాషలో బోధించాలని కొందరు, ఆంగ్లభాషలో బోధిస్తేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు ప్రజలు

Published : 10 Oct 2020 13:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏ భాషలో విద్యాబోధన చేయాలన్న అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. మాతృభాషలో బోధించాలని కొందరు, ఆంగ్లభాషలో బోధిస్తేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. భాషపై ఇన్ని వివాదాలు కొనసాగుతుండగా.. మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏకంగా ఓ విదేశీ భాషను నేర్చుకుంటున్నారు. 

ప్రైవేటు, అంతర్జాతీయ పాఠశాలల్లో విద్యార్థుల ఎంపిక మేరకు విదేశీ భాషను నేర్పిస్తుంటారు. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి సదుపాయం ఉండదు. అయితే మహారాష్ట్రలోని ఔరంగబాద్‌కు 25కి.మీ దూరంలో ఉన్న గడివాట్‌ అనే గ్రామంలో జిల్లా పరిషత్‌ పాఠశాలలోని విద్యార్థులకు అక్కడి పాఠశాల యాజమాన్యం జపనీస్‌ నేర్పిస్తోంది. ఆ పాఠశాలలో 4-8 తరగతి విద్యార్థులను ఏదైనా విదేశీ భాష ఎంచుకోమని అడిగితే చాలా మంది జపనీస్‌ను ఎంచుకున్నారట. దీంతో జపనీస్‌ భాషా పండితులతో ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా విద్యార్థులకు ఈ భాష నేర్పిస్తున్నారు. అక్కడి టీచర్లు కూడా జపనీస్‌ నేర్చుకోవడం విశేషం. విద్యార్థులకు వృత్తికి తగిన విద్యను అందించాలన్న లక్ష్యంతో గతేడాది ఈ విదేశీ భాష కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు స్థానిక జిల్లా విద్యాధికారి తెలిపారు. విద్యార్థులు జపనీస్‌ నేర్చుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఔరంగబాద్‌లో ఉన్న అజంతా.. ఎల్లోరా గుహలను చూడటానికి ఏటా చాలా మంది జపనీయులు వస్తుంటారట. వారికి వారి మాతృభాషలో ఈ చారిత్రక నిర్మాణాల గురించి వివరించేలా గైడ్‌ ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

అంతేకాదు, ఇక్కడి విద్యార్థులు టెక్నాలజీ, రోబోటిక్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. జపాన్‌లో ఈ రంగాలకు అధిక ప్రాధాన్యముంది. దీంతో జపనీస్‌ భాష నేర్చుకొని అక్కడికి వెళ్లి ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేస్తామని విద్యార్థులు అంటున్నారు. ఇప్పటికే జపనీస్‌ నేర్చుకోవడంలో తొలి దశ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఆ భాషలో మాట్లాడగలుగుతున్నారు. ప్రస్తుత కరోనా సమయంలోనూ విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతున్నారట. ఈ పాఠశాల విద్యార్థులు జపనీస్‌ నేర్చుకోవడం గురించి తెలిసి జపాన్‌లో ఉంటున్న ఓ భారతీయ ప్రొఫెసర్‌ ఈ పాఠశాలకు మరాఠీ-జపనీస్‌ డిక్షనరీలను పంపించారట. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న ఈ పాఠశాల ఇతర పాఠశాలలకు ఆదర్శమనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని