Cyclone Michaung: ‘మిగ్‌జాం’ ప్రభావం.. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

Updated : 04 Dec 2023 16:54 IST

హైదరాబాద్‌: నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలలో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమైన తుపాను గంటకు 8 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలపడి తీవ్ర తుపానుగా మారిందని తెలిపింది. మంగళవారం ఉదయం బాపట్ల దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

తుపాను ప్రభావంతో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తామని పేర్కొంది. మంగళవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని