ఎండాకాలంలో దాహం తీర్చే పండ్లు ఇవీ..!

ఎండాకాలం వచ్చేసింది.. భగభగ మండే సూరీడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ తీవ్రమైన ఎండలో బయటకు వెళ్తే శరీరం తొందరగా నిర్జలీకరణమైపోతుంది. దీంతో శరీరంలో నీటిస్థాయితోపాటు పోషకాలూ తగ్గిపోతయి. అయితే, శరీరం కోల్పోయిన

Published : 25 Mar 2021 03:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎండా కాలం వచ్చేసింది.. భగభగ మండే సూరీడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ తీవ్రమైన ఎండలో బయటకు వెళ్తే శరీరం తొందరగా నిర్జలీకరణమైపోతుంది. దీంతో శరీరంలో నీటి స్థాయితో పాటు పోషకాలూ తగ్గిపోతాయి. అయితే, శరీరం కోల్పోయిన నీటి నిల్వలను, పోషకాలను కొన్ని రకాల పండ్లను తినడం వల్ల తిరిగి పొందొచ్చు. ఈ పండ్లు శరీరంలో నీటిస్థాయిని పెంచడంతో పాటు ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన అనేక పోషకాలను అందిస్తాయి. మరి ఆ పండ్లేవో తెలుసుకుందామా..!

కీరా దోస

కీరా దోసలో 95శాతం నీరు ఉంటుంది. ఈ ఎండాకాలంలో శరీరానికి చలువనిచ్చేలా పండ్లు తినాలనుకుంటే ఈ దోసకాయను తినొచ్చు. ఈ కీరా దోస శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. ఇందులోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఫిసెటిన్‌ అనే రసాయన మూలకం మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, ఈ ముక్కలను కళ్ల వద్ద పెట్టుకుంటే కళ్ల కింద నల్లటి చారలు రాకుండా ఉంటాయి. చర్మసౌందర్యం కోసం  ఫేసియల్‌ మాస్క్‌ కూడా పెట్టుకోవచ్చు. ప్రతి రోజు కీరా తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.


పుచ్చకాయ

ఈ ఎండా కాలంలోనే ఎక్కువగా దొరికే పుచ్చకాయల్లో 92శాతం నీరు ఉంటుంది. వీటిని తింటే దాహార్తి ఇట్టే తీరిపోతుంది. నిర్జలీకరణ సమస్యను నివారించవచ్చు. పుచ్చకాయ రక్తపోటును నియంత్రిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుందట. ఇందులోని విటమిన్లు ఏ, సీ, బీ6.. జుట్టు, చర్మం, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాగే ఇందులో ఉండే పీచుపదార్థాలు జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదపడతాయి. 


స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలో 91శాతం నీరు ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన నీటిని అందించొచ్చు. ఆకట్టుకునే రంగులో.. చూడగానే నోరూరించే ఈ పండల్లో పీచు పదార్థాలతో పాటు ఏ, సీ, బీ6, బీ9, ఈ, కె విటమిన్లు ఉంటాయి. అలాగే మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌, పాస్ఫరస్‌ వంటి పోషకాలూ ఉంటాయి. ఈ పండ్లు రక్తంలో కొవ్వును తగ్గిస్తాయి. ఇందులోని ఫెనోలిక్‌ రసాయన మూలకాలు క్యాన్సర్‌ను తగ్గించడంలో దోహదపడతాయి. 


కర్భూజ

కర్భూజ పండ్లలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. విటమిన్‌ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. కంటిచూపు సమస్యలను తగ్గిస్తాయి. విటమిన్‌ కే, ఈలు శరీరంలో రక్తప్రసరణ సరిగా జరిగేలా చూస్తాయి. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.


బత్తాయి 

సీ విటమిన్‌ మెండుగా ఉండే బత్తాయి పండ్లు ఎండాకాలంలో దాహార్తితోపాటు ఆకలినీ తీరుస్తాయి. ఈ పండ్లలో 88శాతం నీరు ఉంటుంది. ఇందులోని సీ విటమిన్‌.. రోగ నిరోధకశక్తిని పెంచడతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పోటాషియం గుండె పనితీరు మెరుగయ్యేలా చేస్తుంది. బత్తాయిలో ఉండే పీచుపదార్థాలు శరీరంలో కొవ్వును తగ్గిస్తాయి. యాంటీ-యాక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. 


అనాస(పైనాపిల్‌)

అనాస పండ్లలో నీటి మోతాదు 87శాతం ఉంటుంది. ఈ పండు దాహార్తిని తీర్చడంతోపాటు శరీరానికి అనేక లాభాలు చేకూర్చుతుంది. ఇందులో ఉండే సీ విటమిన్‌ యాంటీ యాక్సిటెండ్లుగా పనిచేసి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. దెబ్బతిన్న కణజాలాలను నయం చేస్తాయి. అనాసలో ఉండే బ్రొమెలిన్‌ అనే ఎంజైమ్‌ ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఇందులోని బీ విటమిన్‌ ఒత్తిడిని తగ్గించి.. ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. బీటాకెరోటిన్‌, ఇతర విటమిన్లు కంటిచూపు మందగించకుండా కాపాడతాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని