చలికాలంలో మూగజీవాలు ఏం చేస్తాయి?

ఏటికేడు శీతాకాలంలో చలి విపరీతంగా పెరుగుతోంది. మనం మనుషులం కాబట్టి.. ఆ చలిని తట్టుకోవడం కోసం అనేక సాధనాలు సిద్ధం చేసుకున్నాం. ఇంట్లోనే ఉంటూ వెచ్చదనం కోసం దుప్పట్లు, స్వెట్టర్లు వేసుకుంటున్నాం. మంట పెట్టి చలికాచుకుంటున్నాం. డబ్బులు ఉన్నవాళ్లు

Published : 11 Dec 2020 01:16 IST

ప్రతి సంవత్సరం శీతాకాలంలో చలి విపరీతంగా పెరుగుతోంది. మనం మనుషులం కాబట్టి.. ఆ చలిని తట్టుకోవడం కోసం అనేక సాధనాలు సిద్ధం చేసుకున్నాం. ఇంట్లోనే ఉంటూ వెచ్చదనం కోసం దుప్పట్లు, చలికోటులు వేసుకుంటున్నాం. మంట పెట్టి చలికాచుకుంటున్నాం. డబ్బులు ఉన్నవాళ్లు ఇళ్లలో హీటర్లు పెట్టుకొని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కానీ, ఎప్పుడైనా మూగజీవుల గురించి ఆలోచించారా? అవి చలి పులి నుంచి ఎలా తప్పించుకుంటాయి. వెచ్చదనం కోసం ఏం చేస్తాయి?తెలుసుకుందాం పదండి..

వలస

చలిని తట్టుకోవడం కోసం జంతువులు, పక్షులు అనేక మార్గాలను ఎంచుకుంటాయి. వాటిలో ఒకటి వలస వెళ్లడం. జంతువుల కన్నా.. పక్షులు ఎక్కువగా ఈ మార్గాన్ని ఎంచుకుంటాయి. శీతాకాలంలో ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపునకు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ సుదూర ప్రాంతాలకు వెళ్తుంటాయి. శీతల దేశమైన సైబీరియా నుంచి వెచ్చదనం కోసం వేలాది కొంగలు దాదాపు 5వేల కి.మీ ప్రయాణించి తెలుగు రాష్ట్రాలకు రావడం గురించి వినే ఉంటారు. ఏపీలోని ఏలూరు సమీపంలో ఉన్న కొల్లేరు సరస్సు, తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతపల్లికి ఈ కొంగలు వస్తుంటాయి. జనవరిలో వచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకొని, వేసవికాలం పూర్తయిన తర్వాత తిరిగి వాటి దేశానికి పయనవుతుంటాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పక్షులు ఆహారం దొరికే.. వాతావరణం అనుకూలించే ప్రాంతాలను ముందుగానే ఎంచుకొని తగిన సమయం చూసుకొని వలసవెళ్తాయి. చేపలు కూడా దక్షిణం వైపు లేదా.. నీటిలో మరింత లోతుకు వెళ్తుంటాయి. కొన్ని రకాల సీతాకోక చిలుకలు సాధారణంగా కెనడాలో ఉంటూ.. శీతాకాలం వచ్చే సరికి మెక్సికోకు వెళ్లిపోతాయి. ఇవేకాదు.. కొన్ని రకాల జంతువులు, తిమింగిలాలు కూడా వలస వెళ్తాయట.


రూపాంతరం

పరిస్థితులకు అనుగుణంగా మారగలిగినప్పుడే ఉనికిని కాపాడుకోగలమని కొన్ని జంతువులు నిరూపిస్తున్నాయి. శీతాకాలంలోనూ సాధారణ జీవనం గడపాల్సి వచ్చే జంతువులు చలికి తట్టుకునేలా వాటి శరీరంలో, ప్రవర్తనలో మార్పులు చేసుకుంటాయి. వెచ్చదనం కోసం జంతువులు శరీరంపై దళసరి వెంట్రుకలను పెంచుకుంటాయి. వెచ్చగా ఉండే చెట్ల రంధ్రాలు, రాళ్ల మధ్య, గుంటల్లో ఆశ్రయం పొందుతాయి. శీతాకాలం జంతువులకు ఆహారం దొరకడం కష్టంగా మారుతుంది. అందుకే ఉడతలు, ఎలుకలు వంటివి ముందుగానే ఆహారాన్ని సేకరించి పెట్టుకుంటాయి. మరికొన్ని జంతువులు కాలాన్ని బట్టి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకొని దొరికింది తింటుంటాయి. కొన్ని రకాల పక్షులు, సరీసృపాలు కూడా శీతాకాలంలో చలిని తట్టుకునే విధంగా రూపాంతరం చెందుతుంటాయి.


నిద్రాణస్థితి

వలస వెళ్లలేని, రూపాంతరం చెందలేని జంతువులు శీతాకాలంలో నిద్రాణస్థితిలోకి వెళ్లిపోతాయి. సురక్షితమైన చోటును ఎంచుకొని అక్కడే చలికాలం ముగిసే వరకు నిద్రపోతూనే ఉంటాయి. ఈ సమయంలో జంతువులు వాటి శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన, శ్వాసప్రక్రియను తగ్గించి శక్తిని ఆదా చేసుకుంటాయి. మరి ఆహారం ఎలా అంటారా? నిద్రాణస్థితికి వెళ్లే ముందే జంతువులు ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తినేసి కొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటాయి. ఆ తర్వాత అవసరమైన శక్తిని ఈ కొవ్వు ద్వారా పొందుతాయి. ధ్రువపు ఎలుగుబంట్లు, గబ్బిలాలు నిద్రాణస్థితిలో ఉండే జంతువులకు ఉదాహరణగా చెప్పొచ్చు. మరికొన్ని జంతువులు, సరీసృపాలు నిద్రాణస్థితిలోకి వెళ్లవు. కానీ, అదే విధంగా విశ్రాంతి తీసుకుంటూ చలి నుంచి తప్పించుకుంటాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని