holiday vacation: విహారయాత్ర ఎన్ని రోజులుంటే బాగుంటుంది?

కరోనా.. లాక్‌డౌన్‌ కారణంగా గత కొన్నాళ్లుగా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు.. దాంతో గృహిణిలకు ఇంట్లో పనులు మరింత పెరిగాయి. వీటన్నింటికీ విరామం ఇచ్చి హాయిగా కొద్ది రోజులు విహారయాత్రకు వెళ్లాలని చాలా మంది

Published : 01 Aug 2021 15:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గత కొన్నాళ్లుగా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు.. దాంతో గృహిణులకు ఇంట్లో పనులు మరింత పెరిగాయి. వీటన్నింటికీ విరామం ఇచ్చి హాయిగా కొద్ది రోజులు విహారయాత్రకు వెళ్లాలని చాలామంది భావిస్తున్నారు. అందుకే, లాక్‌డౌన్‌ ఆంక్షలు లేని ప్రాంతాలకు రెక్కలు కట్టుకుకొని వాలిపోతున్నారు. మరికొందరు వారికి నచ్చిన ప్రాంతంలో ఆంక్షలు ఎప్పుడు తొలగిస్తారా? అని ఎదురుచూస్తున్నారు. జీవితంలో ఒత్తిళ్లను మర్చిపోవడానికి విహారయాత్ర నిజంగానే సంజీవనిలా పనిచేస్తుంది. అయితే, ఎన్ని రోజులు వెళ్లాలి? సెలవులు ఎంతకాలం తీసుకుంటే.. విహారయాత్ర ఆహ్లాదంగా ఉంటుందనే విషయంపై గతంలో ఓ యూనివర్సిటీ పరిశోధన చేసింది. అందులో తేలిందేమంటే..

విహారయాత్రకు ఎనిమిది రోజులు సరిపోతాయని ఫిన్లాండ్‌లోని టాంపెరె యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఎనిమిది రోజుల ట్రిప్‌లో మనిషికి కావాల్సినంత ప్రశాంతత, విశ్రాంతి లభిస్తాయని పేర్కొన్నారు. హాలీడే ట్రిప్‌ మొదటి రోజు నుంచే ప్రశాంత భావం, సానుకూల ప్రయోజనాలు ప్రారంభమవుతాయట. అవి ఎనిమిది రోజులపాటు ఉంటాయని, ఆ తర్వాత తగ్గుతూ.. ఉద్యోగం, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల ఆలోచనలు మొదలవుతాయని చెప్పారు. పదకొండో రోజుకు వచ్చేసరికి అవి మరింత పెరుగుతాయని వెల్లడించారు.

విచారకరమైన అంశమేంటంటే.. ఎన్ని రోజులు విహారయాత్రకు వెళ్లినా.. తిరిగొచ్చాక ఆ ఆహ్లాదభరిత క్షణాలను మీరు త్వరగా మరచిపోతారని.. మీ మానసిక స్థితి, రోజువారీ పనులపై అదెలాంటి ప్రభావం చూపదని పరిశోధకులు స్పష్టం చేశారు. కాకపోతే ఈ విహారయాత్రల వల్ల మనసుకు, శరీరానికి విశ్రాంతి లభిస్తుందన్నారు. కాబట్టి.. ఎక్కువ రోజులు విహారయాత్రకు వెళ్తే మంచి అనుభూతి మిగిలిపోతుందని భావించి.. రెండుమూడేళ్లకు ఒకసారి ఎక్కువ రోజులు సెలవులు పెట్టి విహారయాత్రకు వెళ్లడం కన్నా.. ఏటా 7 నుంచి 11 రోజులు విహారయాత్ర చేయడం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని